నెలకు మూడు పెద్ద పులుల మరణం

పెద్దపులులకు అటవీ ప్రాంతాల్లోనే రక్షణ లేకుండా పోతోంది. దట్టమైన అడవుల్లో వేటగాళ్లు, ప్రమాదాల బారిన పడి అవి ప్రాణాలు కోల్పోతున్నాయి.

Published : 25 Jan 2023 02:57 IST

ఏడాదిలో 117, పదేళ్లలో 1062
జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: పెద్దపులులకు అటవీ ప్రాంతాల్లోనే రక్షణ లేకుండా పోతోంది. దట్టమైన అడవుల్లో వేటగాళ్లు, ప్రమాదాల బారిన పడి అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. 2022లో దేశంలో ఏకంగా 117 పెద్దపులులు మరణించాయి. అంటే ప్రతినెలా వివిధ కారణాలతో దాదాపు 10 వ్యాఘ్రాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. గడిచిన పదేళ్ల (2012-2022)లో చూస్తే ఈ సంఖ్య 1062కి చేరింది. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ(ఎన్టీసీఏ) అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది. తెలంగాణలో గడిచిన పదేళ్లలో 9 పెద్దపులులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే 2022లో మాత్రం రాష్ట్రంలో మరణాలు నమోదవ్వకపోవడం సానుకూలాంశం.

ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 270, మహారాష్ట్ర 184, కర్ణాటక 150, ఉత్తరాఖండ్‌ 98, అస్సాం 71, తమిళనాడు 66, ఉత్తర్‌ప్రదేశ్‌ 56, కేరళలో 55 పులులు మరణించాయి. పులుల మరణాల్ని గత దశాబ్దకాలం (2012-2022)లో నెలల వారీగా చూస్తే వేసవిలో అవి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వర్షాలు కురిసే నెలలు, అడవి పచ్చగా ఉన్న సమయంలో తక్కువ మరణాలు ఉన్నాయి. జనవరి 128, ఫిబ్రవరి 85, మార్చి 123, ఏప్రిల్‌ 112, మే 113, జూన్‌ 88, జులై 70, ఆగస్టు 55, సెప్టెంబరు 46, అక్టోబరు 53, నవంబరు 85, డిసెంబరు 104... డిసెంబరు, జనవరిల నుంచి ఆకులు రాలే కాలం మొదలవుతుంది. వేసవిలో చెట్లు ఎండిపోయినప్పుడు వేటగాళ్లకు జంతువులు సులభంగా కనిపిస్తాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం పెద్దపులుల్లో నాలుగింట మూడొంతులకుపైగా మనదేశంలోనే ఉన్నాయి. కొన్నేళ్లుగా వీటిసంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో వేటగాళ్ల బారిన పడి వ్యాఘ్రాలు చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని