పరిష్కారమా.. సాగదీతా?

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారానికి సంబంధించి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయడమా? లేదా ప్రస్తుతం విచారిస్తోన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కే అప్పగించడమా? అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Updated : 04 Feb 2023 06:46 IST

కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌పై ఇప్పటికీ వెలువడని నిర్ణయం
తాజాగా సొలిసిటర్‌ జనరల్‌  అభిప్రాయం కోరిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాద పరిష్కారానికి సంబంధించి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయడమా? లేదా ప్రస్తుతం విచారిస్తోన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కే అప్పగించడమా? అనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ అంశంపై సొలిసిటర్‌ జనరల్‌ అభిప్రాయాన్ని కోరినట్లు తెలిసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులపై సరైన వాదన వినిపించలేదని, ఈ కారణంగా కృష్ణా జలాల పంపకాల్లో తమకు అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రానికి అనేక లేఖలు రాసింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, ఇద్దరు ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ సీఎం కేసీఆర్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు. సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తున్నందున తాము ఏమీ చేయలేమని, పిటిషన్‌ ఉపసంహరించుకునే పక్షంలో న్యాయశాఖ అభిప్రాయం తీసుకుని ముందుకెళ్తామని జల్‌శక్తి మంత్రి ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ ప్రకారం సుప్రీంకోర్టులో ఉన్న కేసును తెలంగాణ ఉపసంహరించుకున్న మీదట సదరు దస్త్రాన్ని జల్‌శక్తి మంత్రిత్వశాఖ న్యాయశాఖ పరిశీలనకు పంపింది. సంవత్సరానికి పైగా సమయం తీసుకున్న అనంతరం న్యాయశాఖ..దీనిపై అటార్నీ జనరల్‌ (ఏజీ) అభిప్రాయం  కోరినట్లు తెలిసింది. అక్కడ దస్త్రం చాలాకాలం పెండింగ్‌లో ఉండిపోగా, ఇటీవల కొత్తగా వచ్చిన అటార్నీ జనరల్‌ తాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున కొన్ని కేసుల్లో హాజరైనందున ఈ విషయంలో అభిప్రాయం చెప్పలేనని పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా దస్త్రాన్ని సొలిసిటర్‌ జనరల్‌కు పంపించినట్లు తెలిసింది. దీనిపై జల్‌శక్తి మంత్రిత్వశాఖ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన లేదు.  ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఇప్పటివరకు నిర్ణయం రాకపోవడంతో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ సర్కారు  నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులతోనూ నీటిపారుదల శాఖ అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు. పరిణామాలను పరిశీలిస్తున్నామని, పరిస్థితిని బట్టి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని