హలధారికి అండ

రాష్ట్ర బడ్జెట్‌లో రైతులపై వరాల వర్షం కురిసింది. సాగు విస్తీర్ణం, దిగుబడుల పెంపు కోసం సాయం చేసే పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది.

Updated : 07 Feb 2023 07:46 IST

వ్యవసాయానికి రూ.26 వేల కోట్లకుపైగా కేటాయింపులు
రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమాకు భారీగా నిధులు
రూ.90 వేల వరకూ ఉన్న పంటరుణాల మాఫీకి అవకాశం
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్ర బడ్జెట్‌లో రైతులపై వరాల వర్షం కురిసింది. సాగు విస్తీర్ణం, దిగుబడుల పెంపు కోసం సాయం చేసే పథకాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. ఈ మూడు పథకాల్లోనూ రైతు కుటుంబాల వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. మొత్తం రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకు రైతుబంధు పథకానికి రికార్డు స్థాయిలో రూ.15,075 కోట్లు కేటాయించారు. 2022-23 బడ్జెట్‌లో కంటే దాదాపు రూ.వెయ్యి కోట్లు పెంచారు. గతేడాది వానాకాలంలో ఈ పథకం కింద 65 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమచేయగా వచ్చే వానాకాలంలో 70 లక్షల మందికి పైగా రైతులుంటారని నిధులు పెంచినట్లు తెలుస్తోంది. ఏటా వానాకాలం, యాసంగి(రబీ) సీజన్లలో ఎకరానికి రూ.5 వేల చొప్పున మొత్తం కలిపి రూ.10 వేలను ఇవ్వడానికి ఈ నిధులు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని శాఖల పథకాలను విడివిడిగా గమనిస్తే దళితబంధు తరవాత అత్యధిక  నిధులు కేటాయించిన రెండో పథకంగా రైతుబంధు నిలిచింది. ఈ పథకం వల్ల వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతున్నందున దీనికి నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యమిచ్చారు.


రుణ మాఫీకి రూ.6,385 కోట్లు

గత శాసనసభ ఎన్నికల సందర్భంగా 2018 డిసెంబరు 11 నాటికి బ్యాంకులో రూ.లక్ష వరకూ పంటరుణం బాకీ ఉంటే మాఫీ చేస్తామని అప్పట్లో తెరాస(ప్రస్తుత భారాస) హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరవాత ఇప్పటికే రెండు దఫాలుగా రూ.37 వేల వరకూ బాకీ ఉన్న రైతుల రుణాల మాఫీకి ప్రభుత్వం బ్యాంకులకు నిధులు చెల్లించింది. తాజా బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించింది. ఈ సొమ్మునంతా ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తే రూ.90 వేల వరకూ బకాయి ఉన్న రైతులందరి పంటరుణాలు మాఫీ అవుతాయని ప్రభుత్వ అంచనా. రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకూ బాకీ ఉన్నవారి రుణాల మాఫీకి అవసరమైన నిధుల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.


భూమి ఉన్న రైతుల్లో 18 నుంచి 59 ఏళ్ల వయసు గల రైతులందరికీ రూ.5 లక్షల జీవితబీమా కల్పించడానికి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లిస్తోంది. రైతుబీమా పేరుతో అమలుచేస్తున్న ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.1,589 కోట్లు కేటాయించింది. ఏదైనా కారణంతో రైతు మరణిస్తే నామినీకి రూ.5 లక్షలను ఎల్‌ఐసీ అందజేస్తుంది.


విత్తనాల ధరలో కొంత సొమ్మును వ్యవసాయశాఖ భరించాల్సిన రాయితీ పద్దు కింద రూ.25 కోట్లే కేటాయించారు. దీనిప్రకారం కొత్త పంటలకు రాయితీపై విత్తనాలు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.


యంత్రాలకు రూ.500 కోట్లు...

* కూలీల కొరతను అధిగమించేందుకు వ్యవసాయ యంత్రాలను రాయితీపై ఇవ్వడానికి రూ.500 కోట్లను కేటాయించారు.

* శ్రీ కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి క్రితం బడ్జెట్‌లో రూ.92.50 కోట్లు నిర్దేశించగా ఈసారీ అంతే కేటాయించారు.

* పంటలను మద్దతు ధరకు కొనేందుకు ఉద్దేశించిన మార్కెట్‌ జోక్యం పథకానికి గత బడ్జెట్‌లో రూ.100 కోట్లు ఇవ్వగా ఇప్పుడూ అంతే ఉంది.

* ఉద్యానశాఖలో బిందుసేద్యం పథకానికి ‘కేంద్ర ప్రాయోజిత పథకం’ కింద రాష్ట్రవాటాగా రూ.114.50 కోట్లను నిర్దేశించారు.

* రాష్ట్రంలో వంటనూనెల కొరతను దృష్టిలో పెట్టుకుని పామాయిల్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఆయిల్‌పాం తోటల సాగుకు రాయితీల పద్దు కింద ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో మరే పంట సాగుకు విడిగా ఇంత భారీగా రాయితీ నిధులు కేటాయించలేదు.

* సహకార శాఖకు గత బడ్జెట్‌లో రూ.129 కోట్లు పెట్టగా ఈసారి రూ.141.19 కోట్లు ఉంది. వీటిలో ఈ శాఖ ఉద్యోగుల జీతభత్యాలు, శిక్షణ కార్యక్రమాలకే ఎక్కువగా ఖర్చుచేయనున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈ శాఖ పద్దులో ప్రత్యేకంగా నిధులేమీ ప్రత్యేకించలేదు.

* పశుసంవర్ధకశాఖకు గత బడ్జెట్‌లో రూ.1,495.13 కోట్లు నిర్దేశించగా ఈసారి రూ.1,560.32 కోట్లు కేటాయించారు. మత్స్యరంగం అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.100 కోట్లు పెట్టారు.

* గొర్రెల పంపిణీ పథకం అమలుకు రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి సమాఖ్య గతంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు రూ.757.89 కోట్లు కేటాయించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని