మింగుడు పడని ముద్ద

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల శాతం క్రమంగా పడిపోతోంది. గత విద్యా సంవత్సరమే 19 శాతం మంది మధ్యాహ్న భోజనానికి దూరంగా ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 23 శాతం మంది తినకపోవచ్చనేది విద్యాశాఖ అంచనా.

Published : 28 Mar 2023 04:24 IST

మధ్యాహ్న భోజనానికి దూరంగా 23 శాతం మంది
విద్యాశాఖ అంచనా
రుచిగా లేకపోవడమే కారణమంటున్న విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల శాతం క్రమంగా పడిపోతోంది. గత విద్యా సంవత్సరమే 19 శాతం మంది మధ్యాహ్న భోజనానికి దూరంగా ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 23 శాతం మంది తినకపోవచ్చనేది విద్యాశాఖ అంచనా. భోజనం నాణ్యంగా, రుచికరంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమనే ఆరోపణ విద్యార్థుల నుంచి వినిపిస్తోంది.

రాష్ట్రంలో 1-10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. 1-8 తరగతులకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 శాతం భరిస్తున్నాయి. 9, 10 తరగతుల పిల్లలకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఒంటిపూట బడులు నడుస్తున్నా మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తారు.  రాష్ట్రంలో పథకాన్ని వినియోగించుకునే వారిశాతం నానాటికీ తగ్గుతుండటంపై కేంద్రం ఏటా ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) సమావేశం సందర్భంగా హెచ్చరిస్తూనే ఉంది. కారణాలను విశ్లేషించి, ప్రతి ఒక్కరూ తినేలా చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. అయినా విద్యాశాఖ పథకం అమలు, భోజన నాణ్యతపై సమీక్షించిన దాఖలాలు లేవు. పైపెచ్చు మధ్యాహ్న భోజనంలో భాగంగా విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు రాగి జావ, పల్లీ పట్టీలు ఇస్తామని గత మూడు, నాలుగేళ్లుగా కేంద్రానికి హామీ ఇస్తూ వస్తున్న విద్యాశాఖ, దాన్నీ అమలు చేయడం లేదు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఈ ఏడాది స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాగి జావ అందజేస్తున్నారు.

ఉప్పు..పప్పు లేదంటున్న లబ్ధిదారులు

చాలా బడుల్లో విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకొని తింటున్నారు. ఉదాహరణకు కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని సప్తగిరి కాలనీ ఉన్నత పాఠశాలను ‘ఈనాడు’ పరిశీలించగా ఓ బృందంలోని ఎక్కువ మంది ఇళ్ల నుంచి తెచ్చుకున్న భోజనమే తినడం కన్పించింది. ‘వంటలు రుచిగా ఉండటం లేదని, ఉప్పు, కారం సమపాళ్లలో ఉండవని, పప్పు సరిపడా లేని కారణంగా సాంబారు పలుచగా ఉంటుందని’ అధిక శాతం మంది విద్యార్థులు తెలిపారు. గుడ్డు మాత్రం తీసుకుంటున్నట్టు చెప్పారు.

సకాలంలో జరగని బిల్లుల చెల్లింపులతో

ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వండి పెట్టినందుకు ఒక్కొకరికి రూ.5.45, 6-10 తరగతులకు ఒక్కొకరికి రూ.8.17 చొప్పున విద్యాశాఖ చెల్లిస్తోంది. బియ్యాన్ని ప్రభుత్వమే ఇస్తుండగా...మిగిలిన సరకులను కార్మికులే సమకూర్చుకోవాల్సి ఉంది. సర్కారు చెల్లిస్తున్న ధరలతో మెనూ ప్రకారం నాణ్యంగా భోజనం వండలేకున్నామనేది వంట కార్మికుల వాదన. భోజనం తయారీ తాలూకూ బిల్లులు, గౌరవ వేతనం సకాలంలో చెల్లించడం లేదనీ వారు ఆరోపిస్తున్నారు. ‘కోడిగుడ్డుకు సంబంధించి గతేడు మే నెల వరకు విద్యాశాఖ రూ.4 చెల్లించేది. 2022 జూన్‌ నుంచి రూ.5 ఇస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.50గా ఉంది. కొన్నిసార్లు రూ.6కు చేరుతోంది. అంటే ఒక్కో గుడ్డుపై 50 పైసల నుంచి రూపాయి నష్టపోవాల్సి వస్తోంది. ఆ సొమ్ములు కూడా మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్నారు’ అని వారు వాపోతున్నారు. సకాలంలో బిల్లులు రాకపోవడం, సరైన ధరలు ఇవ్వకపోవడం వల్ల నాణ్యమైన భోజనం పెట్టాలంటూ కార్మికులపై ఒత్తిడి తేలేకపోతున్నామని ఓ హెచ్‌ఎం ‘ఈనాడు’కు తెలిపారు.


ఇంటి భోజనానికి అలవాటు పడిన వాళ్లే తినడం లేదు

బాబాయమ్మ, ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజనం కార్మికుల సంఘం

కొందరు విద్యార్థులు ఇంటి దగ్గర్నుంచి భోజనం తెచ్చుకుంటున్న మాట వాస్తవమే. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఇలా జరుగుతోంది. కొంతమంది ఇళ్ల వద్ద వేపుడు కూరలు తింటారు. బడుల్లో అవి ఉండవు. అలా ఇంటి భోజనానికి అలవాటు పడిన వాళ్లే.. మధ్యాహ్న భోజనానికి దూరంగా ఉంటున్నారు. పైపెచ్చు రుచిగా ఉండటం లేదంటూ నెపాన్ని కార్మికులపై నెట్టేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని