రాష్ట్రంలో డీసీసీబీల సేవల విస్తరణ

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ల సేవలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో డీసీసీబీలున్నాయి.

Published : 31 Mar 2023 04:08 IST

కొత్త జిల్లాల వారీగా ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)ల సేవలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో డీసీసీబీలున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్‌ సన్నాహాలు చేస్తోంది. వీటి ద్వారా పాలనను వికేంద్రీకరించనుంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు 2020లో ఎన్నికలు జరిగాయి.కొత్త జిల్లాలకు అనుగుణంగా జిల్లా పరిషత్‌లు ఏర్పడ్డాయి. కానీ డీసీసీబీలు ఏర్పాటు కాలేదు. నాబార్డు అనుమతితో పాటు ఇతరత్రా సమస్యలున్నందున ప్రభుత్వం పాత వ్యవస్థనే కొనసాగిస్తోంది. రాష్ట్రంలో సహకార సేవల విస్తరణ కోసం అన్ని జిల్లాల్లోనూ డీసీసీబీ బ్రాంచీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వస్తోంది. కొత్త డీసీసీబీల ఏర్పాటులో జాప్యం దృష్ట్యా ప్రత్యామ్నాయంగా అన్ని కొత్త జిల్లాల్లోనూ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది.

అధికారులు, సిబ్బంది నియామకాలు

డీసీసీబీలకు గల సహకార కేంద్రబ్యాంక్‌ బ్రాంచి కార్యాలయాలు లేదా ఇతర భవనాల్లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభిస్తారు. వీటిలో అధికారులు, సిబ్బందిని ప్రస్తుతం ఉన్న డీసీసీబీల నుంచి సర్దుబాటు చేస్తారు. సేవలను వికేంద్రీకరిస్తారు.ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతులు తమ సమస్యలపై డీసీసీబీలను సంప్రదించాల్సి వస్తోంది. ఇకపై వారు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా సేవలు పొందవచ్చు. భవిష్యత్తులో డీసీసీబీల సంఖ్య 33కి పెరిగితే దానికి అనుగుణంగా ప్రాంతీయ కార్యాలయాలను డీసీసీబీ కేంద్ర కార్యాలయాలుగా మారుస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని