తెలంగాణకు మరిన్ని జాతీయ రహదారులు!

రాష్ట్రంలో మరిన్ని జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.40 వేల కోట్ల మేర రహదారి విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి.

Published : 02 Apr 2023 03:32 IST

కేంద్రం తుది పరిశీలనలో  సుమారు రూ.40 వేల కోట్ల పనులు
భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రానికి సూచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరిన్ని జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.40 వేల కోట్ల మేర రహదారి విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి. భారత్‌మాల-2 పథకం కింద రూ.25 వేల కోట్లు, ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద మరో రూ.15 వేల కోట్ల విలువ చేసే పనులు ఇందులో ఉన్నాయి. మొత్తం 1,575 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణకు సంబంధించి రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనలు కేంద్ర పరిశీలన తుది జాబితాలో చేరినట్లు సమాచారం. ఇందులో వెయ్యి కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. వీటికి సంబంధించి పెండింగులో ఉన్న భూ సేకరణను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించినట్లు తెలిసింది.

భారత్‌మాల-2లో ఆర్‌ఆర్‌ఆర్‌ రెండో దశ

ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) తొలిదశ భూ సేకరణ నిధుల విడుదల పీటముడి వీడనప్పటికీ రెండో దశను భారత్‌మాల-2లో చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. సుమారు 187 కిలోమీటర్ల మేర ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని ఆ పథకం కింద మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. తుది జాబితాలో చేర్చినప్పటికీ ఉత్తర భాగంలో భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేశాకే దక్షిణ భాగానికి అనుమతి ఇవ్వడంతో పాటు సవివర నివేదికకు ఆమోద ముద్ర వేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. మరో నాలుగు మార్గాలను భారత్‌మాల-2లో చేర్చాలన్న ప్రతిపాదనలకు త్వరలో ఆమోదం లభించనుంది. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద మంచిర్యాల-విజయవాడ, హైదరాబాద్‌-రాయ్‌పుర్‌, హైదరాబాద్‌-బెంగళూరు మార్గంలో తెలంగాణ సరిహద్దు వరకు విస్తరణ పనులు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మంజూరు చేయనుంది.

భూ సేకరణతోనే చిక్కులు

జాతీయ రహదారుల విస్తరణకు భూ సేకరణ ఆటంకంగా మారినట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. గత నాలుగైదేళ్ల వ్యవధిలో రాష్ట్రానికి మంజూరు చేసిన 11 జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణ నత్తనడకన సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ఒత్తిళ్లతో పాటు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత దీనికి కారణం. సుమారు 4,332 హెక్టార్ల మేరకు భూసేకరణ చేపట్టాల్సి ఉండగా ఇప్పటికి కేవలం 284 కిలోమీటర్ల భూమిని సేకరించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి సంబంధించి 4,760 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. సింహభాగం భూ సేకరణను రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం పూర్తి చేసింది. నిధులు విడుదల కాకపోవటంతో అది కాగితాల్లోనే ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు