పుస్తకాల్లేని చదువే!

ఇంటర్‌ పాఠ్య పుస్తకాలను ముద్రించి, సకాలంలో మార్కెట్లోకి తీసుకురావడంలో వరుసగా రెండో ఏడాది కూడా తెలుగు అకాడమీ నిర్లక్ష్యాన్ని వీడలేదు.

Published : 31 May 2023 04:38 IST

ఇంటర్‌ పాఠ్య పుస్తకాల ముద్రణలో తెలుగు అకాడమీ ఉదాసీనత
పదిరోజుల క్రితమే అందుబాటులోకి కాగితం
ఇప్పుడిప్పుడే మొదలైన ప్రింటింగ్‌
నెల తర్వాతే విద్యార్థులకు పంపిణీ
రేపటి నుంచే కళాశాలల ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌; ఇంటర్‌ పాఠ్య పుస్తకాలను ముద్రించి, సకాలంలో మార్కెట్లోకి తీసుకురావడంలో వరుసగా రెండో ఏడాది కూడా తెలుగు అకాడమీ నిర్లక్ష్యాన్ని వీడలేదు. ఫలితంగా లక్షల మంది విద్యార్థులు అవస్థలు పడనున్నారు. జూన్‌ ఒకటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని ఇంటర్‌ బోర్డు 40 రోజుల క్రితమే ప్రకటించినా అకాడమీ అధికారులు అప్రమత్తం కాలేదు. వీరి కారణంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు కనీసం నెల రోజులపాటు పుస్తకాలు అందేలా లేవు. మార్కెట్లో విక్రయానికీ 15 రోజుల వరకు ఎదురు చూడాల్సిందే.

అకాడమీకి శాశ్వత డైరెక్టర్‌ లేకపోవడం, ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ అకాడమీ వైపే వెళ్లకపోవడం, అందులోని కిందిస్థాయి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం... ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

ప్రభుత్వం ఎప్పుడో అనుమతిచ్చినా...

గత విద్యా సంవత్సరం(2022-23) పుస్తకాల ముద్రణకు అవసరమైన కాగితం కొనుగోలుకు టెండరును పిలవడం నుంచి ముద్రణ ఛార్జీల ఖరారు వరకు నిర్ణయాలను వేగంగా తీసుకోలేదు. కిందిస్థాయి అధికారులు దస్త్రాలు పెట్టినా ఉన్నతాధికారి సైతం పట్టించుకోకపోవడంతో ముద్రణలో తీవ్ర జాప్యమైంది.

అందుకే 2023-24 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు సకాలంలో పుస్తకాలను అందించాలనే లక్ష్యంతో తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 2022 ఆగస్టులోనే కాగితం కొనుగోలుకు అనుమతిచ్చారు.

అధికారులు టెండరు ప్రక్రియను రెండున్నర నెలలపాటు ముందుకు తీసుకెళ్లలేదు. మొత్తానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో 3,500 టన్నుల పేపర్‌ కోసం టెండరు పిలవగా పది రోజుల క్రితమే 2000 టన్నులు వచ్చింది. ప్రస్తుతం ముద్రణదారులకు కాగితాన్ని అందిస్తున్నారు. పుస్తకాలను ముద్రించి, జిల్లాల వారీగా కళాశాలలకు ఆర్టీసీ బస్సుల్లో పంపుతారు. అవి విద్యార్థులకు అందేసరికి కనీసం నెల రోజులు పడుతుంది.

కొంతమేరకు పుస్తకాలను తెలుగు అకాడమీనే విక్రయిస్తుంది. అవి కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి మరో 15 రోజులు పడుతుంది. రాష్ట్రంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి తొమ్మిది లక్షల మంది వరకు విద్యార్థులు ఉంటారు. వీరిలో రెండు లక్షల మంది పుస్తకాలను దుకాణాల్లో, తెలుగు అకాడమీ విక్రయ కేంద్రాల్లో కొంటారు.

ప్రభుత్వం 2.50 లక్షల మందికి ఉచితంగా అందజేస్తుంది. వీరంతా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతోపాటు కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో చదువుతున్నారు.

శాశ్వత డైరెక్టర్‌ నియామకాన్ని మరిచారా?  

2021 అక్టోబరులో అకాడమీ నిధులను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయగా రూ.65 కోట్ల గోల్‌మాల్‌ వ్యవహారం వెలుగు చూసింది. ఆ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలిగా ఉన్న శ్రీదేవసేనను అకాడమీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా నియమించారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన నాడు అకాడమీ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికి ఏడాదిన్నర గడిచినా అటువైపు కన్నెత్తి చూడటంలేదు. దాంతో సిబ్బందిపై పర్యవేక్షణ లోపించిందన్న విమర్శలు ఉన్నాయి. సకాలంలో పుస్తకాలు మార్కెట్లోకి రాకుంటే అకాడమీ కూడా ఆదాయాన్ని కోల్పోతుంది. అకాడమీకి ప్రభుత్వం బడ్జెట్‌ ఇవ్వదు. పుస్తకాల విక్రయాలతో వచ్చిన ఆదాయంతోనే అది నడుస్తుంది.

రూ.40 కోట్ల బకాయిలు చెల్లించేది ఎప్పుడో?

నాలుగేళ్లుగా ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఇంటర్‌ విద్యాశాఖ ఏటా ఎంతమందికి పుస్తకాలు కావాలో తెలుగు అకాడమీకి ఇండెంట్‌ ఇస్తుంది. ఆ మేరకు పుస్తకాలను ముద్రించి కళాశాలలకు పంపిస్తారు. అందుకు అకాడమీకి నిధులు ఇవ్వాల్సి ఉంటుంది.నాలుగేళ్లుగా ఇవ్వడం లేదు. రూ.40 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.


ఏప్రిల్‌ మూడో వారంలో ఇండెంట్‌ ఇచ్చినా

ఇంటర్‌ విద్యాశాఖ ఎంత మంది విద్యార్థులకు పుస్తకాలు కావాలో తెలుపుతూ గణాంకాలను ఏప్రిల్‌ మూడో వారంలోనే తెలుగు అకాడమీకి సమర్పించింది. అయినా సకాలంలో అందించలేకపోయారు. దానివల్ల జూన్‌ 1వ తేదీ నుంచి విద్యార్థులు కళాశాలలకు వెళ్లినా పుస్తకాలు మాత్రం ఉండవు. అంటే నెల రోజులపాటు సర్కార్‌ కళాశాలల్లో విద్యార్థులు పుస్తకాలు లేకుండానే తరగతులకు వెళ్లాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని