EPFO - Higher pension: అధిక పింఛను అర్హులకు వడ్డీ మోత

అధిక పింఛను ఎంత వస్తుందో ఈపీఎఫ్‌వో లెక్కించి చెప్పకుండా బకాయిల వసూలుకు వేసిన వడ్డీ లెక్కలు చూసి దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 17 Jun 2023 07:22 IST

దరఖాస్తుదారులకు  అందుతున్న నోటీసులు
బకాయిలను నిర్ధారిస్తున్న ఈపీఎఫ్‌వో
3 నెలల గడువు ఇస్తూనే  నెలనెలా వడ్డీ పోటు
సాలీనా లెక్కేస్తే 24 నుంచి  32 శాతం దాకా వసూలు

ఈనాడు, హైదరాబాద్‌: అధిక పింఛను ఎంత వస్తుందో ఈపీఎఫ్‌వో లెక్కించి చెప్పకుండా బకాయిల వసూలుకు వేసిన వడ్డీ లెక్కలు చూసి దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈపీఎఫ్‌వో ఇప్పటి వరకు అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై స్పష్టత ఇవ్వకుండానే బకాయిల వసూలుకు సిద్ధమైంది. పైగా మూడునెలల్లోపు బకాయిలు కట్టకుంటే అధిక పింఛను దరఖాస్తు తిరస్కరిస్తామని చెబుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఒక ఉద్యోగి ప్రభుత్వ రంగ సంస్థలో పదవీ విరమణ చేశారు. ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు దరఖాస్తు చేయగా ఆమోదం లభించింది. దరఖాస్తు ఆమోదం నాటికి (2023 మే 31వ తేదీ) ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌) బకాయి రూ.17,69,290గా ఈపీఎఫ్‌వో లెక్కకట్టింది. చెల్లించేందుకు మూడు నెలల గడువు ఇచ్చింది. మొదటి నెలలో చెల్లిస్తే వడ్డీతో కలిపి రూ.18,04,856 చెల్లించాలి. అంటే సుమారుగా నూటికి రూ.2 లెక్కన వసూలు చేస్తున్నట్టు. ఈ లెక్కన సాలీనా దాదాపు 24 శాతం వడ్డీ అవుతుంది. రెండో నెలలో చెల్లిస్తే రూ.18,52,278, మూడో నెలలో అయితే రూ.19,11,555 చెల్లించాలని నోటీసు పంపించింది. ఈ లెక్కన చూసుకుంటే మూడోనెలలో చెల్లిస్తే దాదాపు 32 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తోందని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా బకాయిలు చెల్లించిన ఎన్నిరోజుల్లో పింఛను మంజూరవుతుందో, పింఛను ఎంత వస్తుందో వెల్లడించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

నోటీసుల్లో కనిపించని వడ్డీ రేటు ప్రస్తావన

ఇచ్చిన నోటీసుల్లో ఎక్కడా ఈపీఎఫ్‌వో నేరుగా వడ్డీ విషయాన్ని ప్రస్తావించలేదు. నోటీసుల్లో పేర్కొన్న మొత్తాలను చూస్తే అది స్పష్టమవుతోంది. ఈపీఎస్‌కు భవిష్యనిధి ఖాతా నుంచి నిధులు మళ్లించే కేసుల్లోనూ ఇదేతరహా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పీఎఫ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యనిధి ఖాతాల నుంచి ఈపీఎస్‌ బకాయిల కింద నిధులు మళ్లించేందుకు సమ్మతిస్తూ సకాలంలో హామీ పత్రం ఇవ్వడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నాయి. ఈ వడ్డీ భారం ఇంతలా ఉండగా పీఎఫ్‌ ఖాతాలో నిల్వలపై 2022-23కి వడ్డీరేటు 8.15గా కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.

క్షుణ్నంగా దరఖాస్తుల పరిశీలన

అధిక పింఛనుకు అర్హత పొందిన వేతనజీవుల దరఖాస్తులను ఈపీఎఫ్‌వో క్షుణ్నంగా పరిశీలిస్తోంది. యాజమాన్యాలు సమర్పించిన వేతన వివరాలు, పీఎఫ్‌ ఖాతాల్లో ఉద్యోగులు, యాజమాన్యాలు చెల్లించిన చందా, పరిపాలన ఛార్జీల వివరాలకు ఆధారాలు చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులకు వేతన కమిషన్లు ఉంటాయి. ఈ కమిషన్ల సిఫార్సుల మేరకు వేతన సవరణ ఉంటుంది. అధిక పింఛను ఆమోద సమయంలో ఏదేని నెలలో వేతన పెరుగుదల ఎక్కువగా ఉంటే.. కారణాలు అడుగుతోంది. సరైన కారణాలు చెప్పిన తరువాతే ఈపీఎస్‌ బకాయిలను నిర్ధారిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని