Hyderabad: విషం తాగిన యువకుడికి.. ఊపిరితిత్తుల మార్పిడి

షణికావేశంలో కలుపు నివారణ మందు తాగి మృత్యుముఖం వరకు వెళ్లిన ఓ యువకుడికి సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.

Updated : 14 Oct 2023 09:17 IST

పునర్జన్మ ప్రసాదించిన యశోద వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌: క్షణికావేశంలో కలుపు నివారణ మందు తాగి మృత్యుముఖం వరకు వెళ్లిన ఓ యువకుడికి సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. పల్మనరీ ఫైబ్రోసిస్‌కు గురికావడంతో  సంక్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడిచేశారు. డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్‌ హరికిషన్‌ గోనుగంట్ల ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహబూబాబాద్‌ జిల్లా ముర్రాయిగూడెంకు చెందిన రోహిత్‌(23) వ్యక్తిగత కారణాలతో గత నెల కలుపు నివారణ మందు తాగాడు. విషప్రభావం వల్ల అతని మూత్రపిండాలు, కాలేయంతో పాటు ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఊపిరితిత్తులు పల్మనరీ ఫైబ్రోసిస్‌కు గురికావడంతో సికింద్రాబాద్‌ యశోదకు తరలించగా.. వైద్యులు ఊపిరితిత్తులను మార్చాలని నిర్ణయించారు. జీవనదాన్‌ ద్వారా అవయవాలు సేకరించి ఈ యువకుడికి అమర్చారు. ఈ శస్త్రచికిత్సకు ఆరు గంటలపాటు సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. ప్రపంచంలో ఇప్పటికి నలుగురికే ఊపిరితిత్తుల మార్పిడి జరిగిందని, భారతదేశంలో ఇదే మొదటిదని డాక్టర్‌ హరికిషన్‌ వెల్లడించారు. బతుకుపై ఆశలు లేని తనకు వైద్యులు మళ్లీ ఊపిరి పోశారని రోహిత్‌ కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని