లోపాలపై స్పందించరా?

విజిలెన్స్‌ నివేదికతో నీటిపారుదల శాఖ మేల్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్వహణలో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత ఇంజినీర్లకు నోటీసులు ఇచ్చింది.

Published : 09 Apr 2024 06:23 IST

కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి
ఇంజినీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు
విజిలెన్స్‌ నివేదికతో ఎట్టకేలకు కదలిక
ఈనాడు - హైదరాబాద్‌

విజిలెన్స్‌ నివేదికతో నీటిపారుదల శాఖ మేల్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్వహణలో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత ఇంజినీర్లకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణం పూర్తయి మూడేళ్లపాటు నిర్వహించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగినా, ప్రారంభించిన కొద్దికాలానికే బ్యారేజీల్లో సీపేజీ సమస్య ఏర్పడినా ఇన్నాళ్లూ చర్యలకు ఉపక్రమించని నీటిపారుదల శాఖలో.. విజిలెన్స్‌ నివేదికతో కదలిక వచ్చింది. ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం)కు ప్రత్యేక విభాగం ఉంది. నాణ్యత తనిఖీలకు ప్రత్యేక విభాగాలున్నాయి. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ ఉంది. నిర్వహణలోని లోపాలపై దిగువస్థాయి ఇంజినీర్లు ఎప్పటికప్పుడు అటు గుత్తేదారులు, ఇటు ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజినీర్ల దృష్టికి తెస్తూనే ఉన్నా చూసీచూడనట్లుగా వ్యవహరించారు. తాజాగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో వెల్లడైన లోపాల ఆధారంగా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలంటూ కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌(రామగుండం)కు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) నోటీసు ఇవ్వగా, సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు చీఫ్‌ ఇంజినీర్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి కూడా దీనిపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ విభాగం, డ్యాం సేఫ్టీ అధికారులు ఏటా వర్షాకాలం ముందు, తర్వాత బ్యారేజీలను పరిశీలించి ఎక్కడెక్కడ సమస్యలున్నాయో, ఏం చర్యలు తీసుకోవాలో రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉండగా.. ఇందులో లోపం జరిగిందని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌.డి.ఎస్‌.ఎ.), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ లేవనెత్తిన అంశాల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. వాటిలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.

2019లోనే సమస్యను గుర్తించినా నిర్లక్ష్యం..

మేడగడ్డ బ్యారేజీపై ఫిబ్రవరి 13న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆ సమయంలో ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ సహా పలు వైఫల్యాలను ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. ఐ.ఎస్‌. కోడ్‌లోని నిబంధనల ప్రకారం ఏటా వర్షాకాలం తర్వాత ఆఫ్రాన్‌ ప్రాంతాన్ని పరిశీలించి ఎలా ఉందో అంచనా వేయాలి. బ్యారేజీ దిగువ ప్రాంతంలో నాన్‌ లాంచింగ్‌ ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా  పరీక్షించాలి. నీటిపారుదల శాఖ అధికారులు ఈ పని చేయలేదు. దీంతోపాటు బ్యారేజీ ప్రారంభమైన తర్వాత సీసీ బ్లాకులు, లాంచింగ్‌ ఆఫ్రాన్‌లను తనిఖీ లేదా మెయింటెనెన్స్‌ చేయలేదు. 2019-20లోనే నిర్వహణ సమస్యలు తలెత్తి సీసీ బ్లాకులు పక్కకెళ్లిపోయాయి. 2019 నవంబరులోనే గుర్తించిన సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల తదుపరి సమస్యలు తలెత్తాయి. బ్యారేజీ రక్షణ.. పటిష్ఠ నిర్మాణం, నాణ్యతపై ఆధారపడి ఉంటుందని ఐ.ఎస్‌. కోడ్‌ 12891 చెబుతోంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ లేవనెత్తిన అంశాల నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణ చర్యలు చేపట్టేందుకు, వెంటనే నిర్వహణలోకి తేవడానికి తదుపరి కార్యాచరణ ఏమిటో చీఫ్‌ ఇంజినీర్‌(రామగుండం) తెలపాలని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సూచించారు. సమస్య తీవ్రత దృష్ట్యా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. రాబోయే వర్షాకాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులు యుద్ధప్రాతిపదికన ఏమేం చేయాలో తెలపాలని, మే నెలాఖరు నుంచే ప్రాణహిత నదికి ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉన్నందువల్ల తదుపరి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఒప్పందం ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ చేపట్టనందుకు సంబంధిత ఎస్‌.ఇ.లకు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌లకు, గుత్తేదారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని చీఫ్‌ ఇంజినీర్‌కు నిర్దేశించారు. 2020 నుంచి ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ జరగలేదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేర్కొన్నందువల్ల దీనికి గుత్తేదారులు/నీటిపారుదల శాఖ కారణమన్నారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఓ అండ్‌ ఎం కార్యకలాపాలు జరగకపోయినా, నిర్ణీత వ్యవధిలోగా చర్యలు తీసుకొని బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోకపోయినా చీఫ్‌ ఇంజినీర్‌(రామగుండం) బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని