మరింత సమన్వయంతో ఎన్నికలు

‘త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మరింత సమన్వయంతో పని చేయాలని నిర్ణయించాయి.

Updated : 16 Apr 2024 06:45 IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: ‘త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మరింత సమన్వయంతో పని చేయాలని నిర్ణయించాయి. గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, అంతర్‌ రాష్ట్ర చెక్‌పోస్టుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ ‘’రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల స్థాయిలో సమన్వయ సమావేశాలు జరిగాయి. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండడంతో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కర్ణాటక, గోవా రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాలు అక్రమ రవాణా కాకుండా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాపెంచాలి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి’’అని శాంతికుమారి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నందున తెలంగాణ రాష్ట్రంతో పూర్తి సమన్వయంతో పని చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి వివరించారు. ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని... ఆపరేషన్‌ పరివర్తన పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, అడిషినల్‌ డీజీలు శివధర్‌రెడ్డి, మహేశ్‌భగవత్‌, అటవీ శాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియాల్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అడిషినల్‌ డీజీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి, వాణిజ్యపన్నులు, ఆబ్కారీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌భార్గవ, అటవీ శాఖ పీసీసీఎఫ్‌ చిరంజీవి చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని