బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల

బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు.

Published : 20 Apr 2024 04:40 IST

త్వరలో మిగతావీ చెల్లించాలని సీఎం ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.351 కోట్ల బిల్లులు విడుదల కావాల్సి ఉంది. వీటి కోసం సిరిసిల్లలో కార్మికులు ఆందోళనలు చేపట్టారు. దీనిపై బీసీ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పలుమార్లు అక్కడి కార్మికులు, ఆసాములతో చర్చలు జరిపారు. వారు సీఎంను కలిసి బకాయిలు విడుదల చేయాలని కోరగా స్పందించిన ఆయన వెంటనే రూ.50 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు.  మిగతా బకాయిలను త్వరగా విడుదల చేయాలన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడు నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్‌ యూనిఫామ్‌ల తయారీకి సుమారు రూ.47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్‌కు రూ.14 కోట్లు విడుదల చేసింది. తాజాగా రూ.50 కోట్లు విడుదల చేసింది’ అని అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని