‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం

చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది.

Updated : 28 Apr 2024 05:51 IST

20 వసంతాలు పూర్తిచేసుకున్న ప్రచురణ సంస్థ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా తార్నాకలోని సెయింట్‌ ఆన్స్‌ జనరలేట్‌లో శనివారం వేడుక నిర్వహించారు. నగరంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పుస్తక ప్రియులు, చిన్నారులు పాల్గొన్నారు. ప్రదర్శనను వీక్షించి.. పుస్తక పఠనం ఆవశ్యకతపై తమ అభిప్రాయాలను ‘ఈనాడుతో’ పంచుకున్నారు.


పుస్తక పఠనంతో సృజనాత్మకత..
- వి.శైలజ, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌, హైదరాబాద్‌

పుస్తక పఠనంతో చిన్నారుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. ప్రస్తుతం పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలకు కథల పుస్తకాలు, నవలలు పరిచయం చేస్తున్నారు. రోజూ కనీసం 30 నిమిషాలు తమకు నచ్చిన పుస్తకాన్ని చదివేలా చూడాలి. నైతిక విలువలను తెలియజేసే పుస్తకాలను ఇప్పటివరకు 50 పాఠశాలల్లో పంపిణీ చేశాను. ‘మంచి పుస్తకం’లో కౌమార దశకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చదివేలా టీనేజీ పిల్లలకు సూచిస్తుంటా.


జీతంలో 33 శాతం వాటికే..
- కె.రవికుమార్‌, ప్రభుత్వ ఆంగ్ల అధ్యాపకుడు, వరంగల్‌

నాది వరంగల్‌ జిల్లా నర్సంపేట. దాదాపు 20 వేల పుస్తకాలతో లీడ్‌ చిల్డ్రన్స్‌ లైబ్రరీ, లిటరరీ సెంటర్‌ను ఏర్పాటు చేశా. గ్రామీణ విద్యార్థుల్లో పాఠకాసక్తి పెంచేందుకు 17 సంవత్సరాలుగా లీడ్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక ప్రాంతాల్లో పుస్తకాలు పంపిణీ చేశా. నా కారును మొబైల్‌ లైబ్రరీగా మార్చి.. వివిధ ప్రాంతాలకు వెళ్తూ పుస్తకాల ఆవశ్యకత, మాతృభాష ప్రాధాన్యం తెలియజేస్తున్నా. నా జీతంలో 33 శాతం పుస్తకాల కొనుగోలుకు వెచ్చిస్తున్నా. మంచి పుస్తకం ప్రచురణ సంస్థ పుస్తకాలు నేటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి.


ఒకసారి పరిచయం చేస్తే..
- పవిత్ర, మంత్ర ఫర్‌ ఛేంజ్‌ ఫౌండేషన్‌ సభ్యురాలు, హైదరాబాద్‌

పిల్లలకు పుస్తకాలను పరిచయం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఒక్కసారి పరిచయం చేస్తే అది వారికి అలవాటుగా మారుతుంది. ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ పుస్తకాలు చిన్నారులకు అర్థమయ్యే రీతిలో సరళమైన పదాలతో ఉంటాయి. చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి.


ఆటలు, పాటలు, కథలు చదువులో భాగం..
- సీఏ ప్రసాద్‌, ప్రకాశం

విద్యాసంస్థలు ఆటలు, పాటలు, కథలను చదువులో భాగంగా చూడాలి. మావంతుగా ఎన్నారైలతో మాట్లాడి వారి ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని 350 పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ చేశాం.


పిల్లల పుస్తకాలకు ప్రసిద్ధి
- కొసరాజు సురేశ్‌, మంచి పుస్తకం సంస్థ ట్రస్టీ

‘మంచి పుస్తకం’ సంస్థ పిల్లల పుస్తకాలకు ప్రసిద్ధి. చిన్నారులను ఆకట్టుకునేలా.. వారికి తెలుగు భాషపై మక్కువ పెరిగేలా చేసేందుకు ప్రత్యేకమైన కథల పుస్తకాలను ముద్రించే ప్రయత్నంలో ఉన్నాం. మంచి పుస్తకం 20 వసంతాల వేడుకకు అనూహ్య స్పందన లభించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని