KTR: వైద్య ఉపకరణాల ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ

వైద్య పరికరాల తయారీలో దేశానికే తెలంగాణ కేంద్రంగా మారుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ అవసరాల కోసం 78 శాతం మేర ఉపకరణాలను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

Updated : 16 Dec 2021 04:50 IST

స్టెంట్‌ల తయారీలో అతి పెద్ద పరిశ్రమకు మేలో శ్రీకారం: కేటీఆర్‌
సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్కులో ఏడు సంస్థలను ప్రారంభించిన మంత్రి

వైద్య పరికరాల పార్కులో ఏడు కొత్త పరిశ్రమల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి కేటీ రామారావు, వేదికపై జయేశ్‌రంజన్‌, భూపాల్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, వివిధ సంస్థల ప్రతినిధులు

ఈనాడు, సంగారెడ్డి: వైద్య పరికరాల తయారీలో దేశానికే తెలంగాణ కేంద్రంగా మారుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ అవసరాల కోసం 78 శాతం మేర ఉపకరణాలను దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో స్థానికంగానే వాటిని తయారుచేసేలా సుల్తాన్‌పూర్‌లో ‘వైద్య ఉపకరణాల పార్కు’కు 2017లో శంకుస్థాపన చేశామన్నారు. ఈ ప్రాంత రూపురేఖలు నాలుగేళ్ల వ్యవధిలోనే మారాయన్నారు. 50 సంస్థలు ఇక్కడ నిర్మాణాలు చేపట్టడంపై సంతోషం ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌లోని వైద్య ఉపకరణాల పార్కులో ఏడు సంస్థలను మంత్రి బుధవారం ప్రారంభించారు. అవి తయారుచేసే ఉపకరణాలు, వివిధ ఉత్పత్తుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టెంట్‌ల తయారీలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమను 2022 మేలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ముచ్చర్లలో ప్రపంచంలోనే పెద్ద ఫార్మా క్లస్టర్‌ నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే వ్యాక్సిన్లలో 35శాతం తెలంగాణలోనే తయారవుతున్నాయన్నారు. వ్యాక్సిన్‌ తయారీ సంస్థలను మరింతగా ప్రోత్సహిస్తామని ఆయన వివరించారు. త్వరలోనే జీనోమ్‌ వ్యాలీని విస్తరిస్తామన్నారు. ఉపకరణాల పార్కులో ప్రస్తుతం ఏడు సంస్థలు కార్యకలాపాలు మొదలెట్టాయని, త్వరలోనే మరో ఏడు ప్రారంభిస్తాయని కేటీఆర్‌ తెలిపారు. ఇక్కడ అన్ని సంస్థలు రూ.1,424 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని, తద్వారా 7,000 మందికి ప్రత్యక్షంగా, 15,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. స్థానికంగానే ఉపకరణాల తయారీ వల్ల వాటి ఉత్తత్తికి అయ్యే ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.

బుధవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పార్కులో ఏడు కొత్త పరిశ్రమల ప్రారంభోత్సవంలో ఆయా సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌

గతంలో బయో-ఆసియా సదస్సు సందర్భంగా కొన్ని సంస్థల ప్రతినిధులతో మాట్లాడగా.. మాస్కులు, చేతి తొడుగులు ఇక్కడ తయారుచేయడం కంటే చైనా నుంచి తెప్పించుకుంటే తక్కువ ధరకే వస్తున్నాయని వారు వివరించారని కేటీఆర్‌ తెలిపారు. వారి మాటల ద్వారా ఇక్కడ తయారీదారులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారో అర్థమైందన్నారు. అందుకనే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జీవ ఔషధ రంగంలో తెలంగాణను కేంద్రంగా చేయాలనే ప్రణాళికలు అమలుచేస్తూ ముందుకెళుతున్నామన్నారు. 2030 కల్లా 100 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా దీని అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. మెడికల్‌ డివైజెస్‌ పార్కులో సంస్థలను నెలకొల్పుతున్నవారు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులను తయారుచేసి ప్రపంచంతో పోటీపడాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టరు రాజర్షిషా, ఎంపీ రంజిత్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌తో జేఎల్‌ఎల్‌ సీఈవో, ఎండీల భేటీ
ప్రముఖ స్థిరాస్తి సంస్థ జేఎల్‌ఎల్‌ సీఈవో, భారత విభాగాధిపతి రాధా ధిర్‌, ఎండీ సందీప్‌ పట్నాయక్‌లు బుధవారం తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు, విస్తరణ గురించి మంత్రితో చర్చించారు. ప్రభుత్వపరంగా అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని