IT: ఐటీ ఉద్యోగులకు ఉద్వాసన
దిగ్గజ ఐటీ సంస్థలు తమ సిబ్బందికి భారీసంఖ్యలో ఉద్వాసన పలకడం మొదలుపెట్టాయి. ఒకవైపు ఉన్న ఉద్యోగాలు పోతుంటే, కొలువుల వేటలో ఉన్న కొత్త అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది.
దిగ్గజ ఐటీ సంస్థలు తమ సిబ్బందికి భారీసంఖ్యలో ఉద్వాసన పలకడం మొదలుపెట్టాయి. ఒకవైపు ఉన్న ఉద్యోగాలు పోతుంటే, కొలువుల వేటలో ఉన్న కొత్త అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. మరోవైపు భారత్‌లో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ట్విటర్, మెటా(ఫేస్‌బుక్), అమెజాన్, భారత్‌లో బైజూస్ వంటివి తమ ఉద్యోగులను పెద్దమొత్తంలో తొలగిస్తున్నాయి. కాస్త లాభాలు తగ్గే సంకేతాలు రాగానే ఐటీ సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ ఉద్వాసన పర్వం భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికన్ సంస్థలు యాభై రెండు వేల మందికి పైగా సాంకేతిక నిపుణులపై వేటు వేశాయి. కంటితుడుపు చర్యగా అయిదారు వారాల జీతమిచ్చి, ఇక ఉద్యోగానికి రానవసరం లేదంటూ చిన్న మెయిల్ పెడుతున్నాయి. ప్రస్తుతం మాంద్యం ముంగిట కంపెనీలు తమ ఖర్చులపై కోతలు విధిస్తున్నాయి. ఈ ప్రక్రియలో సిబ్బందిలో కొందరిని ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నాయి.
మిన్నకుండిపోతున్న సంస్థలు
సంస్కరణల శకం మొదలైన తరవాత ఐటీ రంగం వృద్ధిని వేగంగా అందిపుచ్చుకొన్న దేశాల్లో భారత్ ఒకటి. అమెరికా, ఐరోపా దేశాల్లోని సంస్థల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. వారిలో అత్యధికులు అగ్రస్థానాల్లో ఉన్నారు. ఐటీ సంస్థల్లో కొలువుల కోతలతో అమెరికాలో హెచ్1బీ వీసాతో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 60 రోజుల్లో వేరొక కొలువు పొందకపోతే వారు కుటుంబంతో పాటు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. సంస్థలు ఉన్నపళాన ఉద్యోగులను తొలగించడం వల్ల వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి తారుమారవుతుంది. ఆర్థిక రంగానికి అది శరాఘాతమవుతుంది. మరోవైపు భారత ఐటీ రంగంలో ప్రస్తుతం పాశ్చాత్య దేశాల మాదిరిగా ప్రతికూల ప్రభావం లేకపోయినా, నియామకాలు మందగించాయి. వేతనాల పెంపు, ప్రోత్సాహకాలు, బోనస్‌లు వంటివాటిపై సందిగ్ధత నెలకొంది. గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈసారి ఐటీ రంగంలో నియామకాలు 18శాతం తగ్గినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాంగణ ఎంపికలు సైతం 30శాతం దాకా తెగ్గోసుకుపోయాయి. ఆపిల్ లాంటి కంపెనీలు అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు ఆఫర్ లెటర్లు ఇచ్చి, ఆ తరవాత పట్టించుకోవడం మానేశాయి. నిరుడు ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టిన సంస్థలు, ఆ తరవాత వారి నియామకాలపై మిన్నకుండిపోయాయి.
అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు సజావుగా కొనసాగినన్నాళ్లూ భారత ఐటీ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఒకవేళ ఆర్థిక వ్యవస్థలో చిన్న లేదా మధ్యస్థాయి కుదుపులు వచ్చినా ఇండియా ఐటీ రంగానికి కొంత లాభమే. ఎందుకంటే కష్టకాలంలో విదేశాల్లో ఉన్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి చూస్తాయి. ఆ క్రమంలో స్థానిక సిబ్బందికి ఉద్వాసన పలికి భారత్‌లోని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొంటాయి. ఇక్కడి నిపుణులను తమ అవసరాలకు వినియోగించుకొంటాయి. అమెరికా, ఐరోపాలతో పోలిస్తే భారత్‌లో మానవ వనరులు చౌకగా లభించడమే దానికి కారణం. తద్వారా సంస్థలకు ఖర్చులు తగ్గుతాయి. దానివల్ల ఇండియాలో యువతకు భారీగా ఉపాధి దొరుకుతుంది. నిజానికి ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు సహజం. ఆ ప్రభావం స్వల్పకాలమే ఉంటుంది. ప్రభుత్వాలు తీసుకునే చర్యల వల్ల పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. 2008 ఆర్థిక సంక్షోభం, కొవిడ్ కష్టకాలమే దానికి నిదర్శనం. పైగా కరోనా విజృంభణ కాలంలో ఐటీ రంగం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఆ సమయంలో డిజిటలైజేషన్ బాగా పెరగడంతో కొత్త నియామకాలు ఊపందుకొన్నాయి.
నైపుణ్యాలే రక్ష
ఐటీ రంగంలో నియామకాలు, ఉద్వాసనలు రెండూ భారీ స్థాయిలో ఉంటాయి. ఈ రంగం స్థితిగతులు పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచ ఆర్థిక వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఐటీ రంగం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ప్రస్తుత మాంద్యం ఏ మలుపు తీసుకుంటుందో అర్థమైన తరవాతే ఐటీ భవిష్యత్తుపై ఒక స్పష్టత వస్తుంది. ఇంత సంక్షోభంలోనూ నిపుణుల కొరత ఉందని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి వాటిలో భారీగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నాయి. ఐటీ రంగంలోకి కొత్తగా వచ్చినవారికి, అనుభవం లేనివారికి ప్రస్తుత సంక్షోభం సమస్యగా మారవచ్చు. అధిక వేతనాలు అందుకొంటున్న వారినీ ఉద్వాసన భయం వెంటాడవచ్చు. సృజనాత్మక ప్రతిభ కలిగిన ఉద్యోగులకు గిరాకీ ఎప్పుడూ ఉంటుందన్నది నిపుణుల మాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధ(ఏఐ), బ్లాక్‌చైన్ సాంకేతికత వంటివి ఐటీ రంగాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తుంటాయి. మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా అభ్యర్థులు నూతన నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. సరికొత్త సాంకేతికతలపై పట్టు సాధించాలి. ఉద్యోగ భద్రతకు అవే రక్షగా నిలుస్తాయి.
భారీగా కొలువుల సృష్టి
ప్రస్తుతం దీర్ఘకాలిక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారత ఉద్యోగులకు మాంద్యం వల్ల ఇప్పటికిప్పుడు వాటిల్లే నష్టమేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. భారత ఐటీ సంస్థల్లో రాబోయే రోజుల్లో రెండు లక్షల కొలువులు కొత్తగా పుట్టుకొస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు క్రిస్ గోపాలకృష్ణన్ విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభం తాత్కాలికమేనని, ఈ రంగానికి ఇలాంటి ఒడుదొడుకులు సహజమేనని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియాకు ఐటీ, దాని అనుబంధ రంగాల ద్వారా ఇరవై రెండు వేల కోట్ల డాలర్లకు పైగా వార్షిక ఆదాయం లభిస్తోంది. ఈ రంగంలో ఏటా 8-10శాతం వృద్ధి నమోదవుతోంది. ఒక్క తెలంగాణలోనే సుమారు అయిదు లక్షల మంది ఇందులో ఉపాధి పొందుతున్నారు. ఇండియా జీడీపీలో ఐటీ సేవల రంగం వాటా ఎనిమిది శాతం. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం 51 లక్షల మందికి నేరుగా ఉపాధి కల్పించింది. 2026 నాటికి ఈ సంఖ్య 95 లక్షలకు చేరుతుందని సాఫ్ట్‌వేర్, సేవారంగ సంస్థల జాతీయ సంఘం (నాస్‌కామ్) అంచనా. ప్రపంచ ఐటీ కంపెనీల ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 2.1శాతం దిగజారింది. భారత్‌లోని సంస్థల రాబడి అదే కాలంలో ఒక శాతం పెరిగింది. ఇది ఆశాజనక పరిణామం.
భరత్‌సాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Ustaad bhagat singh: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అప్డేట్ను షేర్ చేసిన హరీశ్ శంకర్..
-
Botsa satyanarayana: పాత పెన్షన్ విధానం అనేది కష్టసాధ్యమైన వ్యవహారం: బొత్స
-
Miss Shetty Mr Polishetty ott: ఓటీటీలో మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Shardul Thakur: ఒకే ఒక్క వీక్ లింక్.. ఆందోళన రేకెత్తిస్తున్న శార్దూల్ ఫామ్!
-
Cricket News: అనుష్కను ఆటపట్టించిన విరాట్.. వరల్డ్‌కప్ జట్టులో చాహల్ ఉంటే బాగుండేదన్న యువీ!
-
Hyderabad: తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. పెట్టెలో రూ.2 కోట్ల నగదు