ప్రత్యామ్నాయ ఇంధనం... భవిత భద్రం

ఇటీవలి కాలంలో వాతావరణ కాలుష్యం ప్రపంచానికి పెను సమస్యగా పరిణమించింది. చాలా దేశాలు రెండు దశాబ్దాలుగా కశ్మల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌ సైతం దానిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఏడు ప్రాధాన్య అంశాల్లో హరిత ఇంధనాన్నీ చేర్చారు...

Updated : 07 Feb 2023 05:37 IST

ఇటీవలి కాలంలో వాతావరణ కాలుష్యం ప్రపంచానికి పెను సమస్యగా పరిణమించింది. చాలా దేశాలు రెండు దశాబ్దాలుగా కశ్మల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌ సైతం దానిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ఏడు ప్రాధాన్య అంశాల్లో హరిత ఇంధనాన్నీ చేర్చారు.

విద్యుత్‌ ఉత్పాదనకు బొగ్గు, రవాణాకు పెట్రోల్‌, డీజిల్‌ లాంటి శిలాజ ఇంధనాలపై అధికంగా ఆధారపడటం పర్యావరణ కాలుష్యానికి దారితీస్తోంది. వాటి వాడకాన్ని తగ్గించకపోతే భావితరాల మనుగడ మరింత ఆందోళనమయం అవుతుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఇండియా- వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడంలో, భూతాపాన్ని తగ్గించడంలో తనవంతు కర్తవ్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవలి కేంద్ర బడ్జెట్లో హరిత ఇంధనంపై దృష్టి సారించింది. శిలాజేతర ఇంధనాల వినియోగాన్ని పెంచడానికి, ప్రత్యామ్నాయ ఇంధనాల అన్వేషణకు, పర్యావరణ హితకరమైన జీవనశైలికి రూ.35,000 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో అయిదు వేల కోట్ల రూపాయలనే ప్రత్యామ్నాయ ఇంధనాల అన్వేషణకు కేటాయించింది. ఈ అరకొర నిధులతో 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థత సాధించాలన్న కేంద్ర లక్ష్యం ఎలా నెరవేరుతుందో స్పష్టత లేదు. ఇటీవల ప్రారంభించిన జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌కు రూ.297 కోట్లు ప్రత్యేకించారు. 2030 నాటికి ఏటా 50 లక్షల మెట్రిక్‌ టన్నుల హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తిని సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. అయితే, హైడ్రోజన్‌ ఉత్పత్తికి ముఖ్యమైన ఎలెక్ట్రోలైజర్ల దిగుమతులపై సుంకాన్ని తగ్గించలేదు.

సౌర విద్యుత్తుపై శీతకన్ను

అత్యధిక సూర్యరశ్మికి అవకాశం ఉన్న లద్దాఖ్‌లో 13000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పాదన, సరఫరా వ్యవస్థకు కేంద్ర బడ్జెట్లో రూ.20,700 కోట్లు కేటాయించారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 2030 నాటికి అయిదు లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. నిరుడు సౌర ఫలకాల దిగుమతిపై 40శాతం సుంకం పెంచారు. అది సౌర విద్యుత్తు వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా బడ్జెట్లో ఆ దిగుమతి సుంకం తగ్గింపు గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. దేశీయంగా భవనాల పైకప్పులపై 2,10,000 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా సౌర ఫలకాల ఏర్పాటుకు అవకాశం ఉంది. వాటిని ప్రోత్సహించేందుకు కేంద్ర పద్దులో ఎలాంటి రాయితీలనూ ప్రకటించలేదు. సౌర విద్యుత్తు ఉత్పత్తి కోసం ప్రత్యేకంగా భూమి అవసరం లేదు. ఎక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అక్కడే వినియోగించడం వల్ల సరఫరాకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు ఖర్చూ ఉండదు. అయినా, దాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం శీతకన్ను వేసింది. ప్రస్తుతం దేశీయంగా 6,100 మెగావాట్ల సౌర విద్యుత్తు ఫలకాలే గృహాల పైకప్పులపై ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యుత్తు, పర్యావరణం, జల మండలి నివేదిక వెల్లడించింది. సౌర విద్యుత్తు కేవలం పగటి పూటే లభిస్తుంది. ఫలితంగా విద్యుత్‌ గ్రిడ్‌ సుస్థిరతకు సవాళ్లు ఎదురవుతాయి. దాన్ని అధిగమించడానికి 40 లక్షల యూనిట్ల బ్యాటరీ నిల్వలకు, జల విద్యుత్తును నిల్వచేసే ప్లాంట్లకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ప్రభుత్వాల పరిధిలోని పాత వాహనాలను మార్చేందుకు నిధుల కేటాయింపు, లిథియం-అయాన్‌ బ్యాటరీలపై సుంకం తగ్గింపు వంటివి విద్యుత్తు వాహనాల కొనుగోలుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. దేశీయంగా లిథియం-అయాన్‌ బ్యాటరీలకు కావాల్సిన ముడిసరకు దొరక్కపోవడంతో విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది భవిష్యత్తులో దేశీయ ఇంధన భద్రతకు సవాలుగా మారవచ్చు. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద గ్రీన్‌ క్రెడిట్‌ అనే కార్యక్రమం అమలుతో సంస్థలు, వ్యక్తులు, స్థానిక సంస్థల దృష్టిని పర్యావరణ పరిరక్షణ వైపు మరలిస్తామని బడ్జెట్లో ప్రకటించడం హర్షణీయం. సముద్ర తీర ప్రాంతాల్లో మడ అడవుల పెంపకానికి మిష్టీ, చిత్తడి నేలల సమర్థ వినియోగానికి అమృత్‌ ధరోహర్‌ పథకాలను 2023-24 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధికంగా వాయు కాలుష్యం బారిన పడిన నగరాలు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలియజెబుతోంది. ఇటీవలి బడ్జెట్లో ప్రత్యేకించి వాయు కాలుష్య కట్టడికి ఎలాంటి కేటాయింపులూ జరపలేదు. పైగా ఎల్పీజీ గ్యాస్‌ వాడకాన్ని ప్రోత్సహించేందుకు తెచ్చిన ప్రధానమంత్రి ఉజ్జ్వల పథకానికి కేటాయింపులు తగ్గాయి.

ఉద్యోగావకాశాల సృష్టి

బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ విశ్లేషించినట్లు- హరిత ఇంధనాల వాడకం, సహజ ఎరువులతో వ్యవసాయం, కాలుష్య రహిత వాహనాల వినియోగం, హరిత భవనాల నిర్మాణం ఊపందుకొంటే... దేశీయంగా పెద్దయెత్తున ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కర్బన ఉద్గారాలను కట్టడి చేయడానికి అవకాశం దక్కుతుంది. దానివల్ల వాతావరణ కాలుష్యం అదుపులోకి వచ్చి ప్రజల ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది. భవిష్యత్తు తరాలకూ స్వచ్ఛమైన పర్యావరణం అందివస్తుంది. ఏది ఏమైనా, ఇటీవలి కేంద్ర బడ్జెట్‌ సౌర విద్యుత్తు ప్లాంట్లకు అదనంగా ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించకపోయినా, హరిత వాతావరణ సాధనపై అధికంగా దృష్టి సారించింది. బడ్జెట్లో ప్రకటించిన కార్యక్రమాలూ పథకాల అమలుకు, క్షేత్ర స్థాయిలో అవి మెరుగైన ఫలితాలను అందించడానికి పాలకుల నిబద్ధతతో పాటు ప్రజల భాగస్వామ్యమూ అత్యంత కీలకం.


సిరిధాన్య సంవత్సరం

వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేలా, ప్రకృతి సేద్యానికి ఊతమిచ్చేలా ఇటీవలి కేంద్ర బడ్జెట్లో రెండు ముఖ్యమైన పథకాలను ప్రకటించారు. వాటిలో మొదటిది గోబర్‌-ధన్‌ పథకం. ఇందులో భాగంగా వ్యవసాయ వ్యర్థాల నుంచి సంపద సృష్టికోసం 500 ప్లాంట్లను, ముఖ్యంగా 200 బయోగ్యాస్‌ కర్మాగారాలను నెలకొల్పడానికి ప్రోత్సాహం అందిస్తారు. తదనంతర కాలంలో వాటికి గిట్టుబాటు ధర కల్పించడానికి ఆయా కర్మాగారాలు అయిదు శాతం బయోగ్యాస్‌ను వినియోగించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇక రెండోది పీఎం-ప్రణామ్‌ పథకం. ఇందులో భాగంగా రాబోయే మూడేళ్లలో సేంద్రియ ఎరువుల ద్వారా కోటి మంది రైతులు ప్రకృతి సేద్యాన్ని అందిపుచ్చుకొనేలా పది వేల జీవ ఎరువుల తయారీ కేంద్రాలను నెలకొల్పనున్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పాటిస్తున్నాం. ఈ క్రమంలో దేశీయంగా తృణధాన్యాల పంటలను ప్రోత్సహిస్తామనీ బడ్జెట్లో హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.