పట్టణ ప్రణాళికల్లో సంస్కరణలు కీలకం

దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లోనూ ప్రాధాన్యమిచ్చింది. కొత్తగా రూ.10,000 కోట్లతో ‘పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ వార్షిక నిధిని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తుంది. కీలక రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా ఈ సొమ్మును వినియోగించనున్నారు.

Published : 08 Feb 2023 00:41 IST

దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లోనూ ప్రాధాన్యమిచ్చింది. కొత్తగా రూ.10,000 కోట్లతో ‘పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ వార్షిక నిధిని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తుంది. కీలక రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధుల కొరత లేకుండా ఈ సొమ్మును వినియోగించనున్నారు.

నగరాల సుస్థిరాభివృద్ధికి పట్టణ ప్రణాళికల్లో సంస్కరణలు అవసరమని బడ్జెట్‌ ఉద్దేశిస్తోంది. ముఖ్యంగా సమర్థ భూవినియోగం, అందరికీ అందుబాటులో పట్టణ భూములు, ఆస్తి పన్ను విధింపు, పట్టణ మౌలిక సదుపాయాల వినియోగానికి సుంకాల విధింపు వంటి సంస్కరణలు చేపట్టాలని నిర్దేశిస్తోంది. మున్సిపల్‌ బాండ్ల వినియోగానికి వీలుగా తమ పరపతి సామర్థ్యాన్ని పెంచుకునే పురపాలికలకు ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు 2022-23 బడ్జెట్‌లోనూ దాదాపు ఇవే ప్రతిపాదనలు చేసింది. మౌలిక వసతుల కల్పన, పర్యవేక్షణకు పట్టణ ప్రణాళిక నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రసిద్ధ సంస్థల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఆ కమిటీ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరలేదని, నగరాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన జరగలేదని అధ్యయనాలు వివరిస్తున్నాయి.

జీవన నాణ్యత అంతంత మాత్రమే...

జనాభా పెరుగుతున్నా, ఆ మేరకు వసతులు లేకపోవడంతో నగరాల్లో జీవన ప్రమాణాలు తీసికట్టుగా ఉంటున్నాయి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం, ‘స్వచ్ఛభారత్‌ మిషన్‌-అర్బన్‌’కు నిధులను పెంచింది. 2022-23లో స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ.2,300 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5,000 కోట్లను ప్రత్యేకించింది. సెప్టిక్‌ ట్యాంకులను మనుషులతో కాకుండా వందశాతం యంత్రాలతోనే చేపట్టాలంటూ ‘మ్యాన్‌హోల్‌ టు మెషిన్‌హోల్‌’ నినాదాన్ని బడ్జెట్‌ పేర్కొనడం హర్షణీయం. ఈ పథకానికి ‘నమస్తే (నేషనల్‌ యాక్షన్‌ప్లాన్‌ ఫర్‌ మెకనైజ్డ్‌ శానిటేషన్‌ ఎకోసిస్టమ్‌)’గా పేరు పెట్టి, రూ.100 కోట్లు ప్రతిపాదించారు. దీని ద్వారా మురుగునీటి శుద్ధి యంత్రాలు, పారిశుద్ధ్య సామగ్రి, కార్మికుల శిక్షణ నిమిత్తం పెట్టుబడి రాయితీ, రుణ సబ్సిడీలను అందిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు ఈసారి భారీగా నిధులు కేటాయించారు. ఇందుకు క్రితంసారి రూ.48వేల కోట్లు కేటాయించగా, తాజాగా రూ.79వేల కోట్లు ప్రతిపాదించారు. ఇందులో పట్టణ ప్రాంతాలకు రూ.25,103 కోట్లు ప్రత్యేకించారు. ప్రస్తుత బడ్జెట్‌లో పేర్కొన్న గృహనిర్మాణ లక్ష్యంలో సగం మాత్రమే నెరవేరింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాల్సిన అవసరముంది.

పట్టణాల్లో వీధి వ్యాపారుల అభివృద్ధికి ఉద్దేశించిన ‘పీఎం స్వనిధి’ పథకానికి నిరుడు రూ.150 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.458 కోట్లు ప్రతిపాదించారు. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవగా, రాష్ట్రంలో వరంగల్‌ నగరం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇక అమృత్‌ రెండో దశలో భాగంగా అమృత్‌ నగరాలకు తాజాగా రూ.16వేల కోట్లు ప్రత్యేకించారు. తాజా బడ్జెట్‌లో మౌలికాభివృద్ధి కోసం మూలధన పెట్టుబడులను రూ.7లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు పెంచారు. నగరాల్లో ప్రజారవాణాకు కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టులకు తాజాగా రూ.19,518 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో రూ.600 కోట్లు హైదరాబాద్‌ బహుళ నమూనా రవాణా వ్యవస్థ (ఎంఎంటీఎస్‌) రెండో దశ నిర్మాణానికి కేటాయించారు. పట్టణాభివృద్ధికి పోయినసారి (సవరించిన అంచనాలు) రూ.74,545.64 కోట్లు; తాజా బడ్జెట్‌లో రూ.76431.60 కోట్లు ప్రత్యేకించారు. కేటాయింపులు చేయగానే సరిపోదు. మూలధన వ్యయ సామర్థ్యం పెంచుకునే దిశగా పట్టణ ప్రణాళికలను రూపొందించి, అమలు చేయాలి.  ఇప్పుడున్న పట్టణీకరణ వేగాన్ని గమనిస్తే- నగరాలు ఆర్థిక చోదక శక్తులుగా ఎదగడానికి తాజా కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. 2012-31 మధ్య ఆశించిన మేర పట్టణాభివృద్ధి జరగడానికి రూ.39లక్షల కోట్లు అవసరమవుతాయని పట్టణ మౌలిక వసతుల కల్పన-పెట్టుబడుల సంస్థ స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెట్టుబడులను మూలధన గ్రాంట్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలి. సరిపడా వనరులు, మౌలిక వసతులు, పౌరసేవల లేమితో నగర జీవనం నరకప్రాయంగా మారింది. పురపాలికల్లో పాలనను మెరుగుపరచి, వాటిని స్వయం సమృద్ధం చేయకపోతే- మౌలిక వసతుల పరికల్పన ఎండమావే అవుతుంది! నగరాల్లో పౌరసేవల నిర్వహణకు సాంకేతికతను జోడించి ప్రత్యేకంగా జాతీయ పట్టణ సాంకేతిక మిషన్‌ను నెలకొల్పాలని కేంద్రం యోచిస్తోంది. దీన్ని వీలైనంత త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలి. పునరుత్పాదన ఇంధన ప్రాజెక్టులను చేపట్టేలా నగరాలను ప్రోత్సహించాలి. వాతావరణ మార్పులను, విపత్తులను తట్టుకునేలా వాటిని రూపుదిద్దాలి.

బాండ్లు, పెట్టుబడులతో...

కొవిడ్‌ కారణంగా తీవ్ర పేదరికంలోకి జారిపోయిన పట్టణ పేదలను ఆదుకోవడానికి తాజా బడ్జెట్‌లో ఉపాధి హామీ వంటి పథకాన్ని ప్రకటించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. మౌలిక వసతులతో పాటు పట్టణాల్లో విద్య, వైద్య సేవలను మెరుగుపరచి, నైపుణ్యాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటేనే నగరాలు సుస్థిరాభివృద్ధి బాటపడతాయి. భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 52శాతం నగరాల నుంచే వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో వీటి వాటా 70శాతం దాకా ఉంటోంది. పట్టణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు మున్సిపల్‌ బాండ్లు, రుణాలు, ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కేంద్రం స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించినప్పుడే- దేశ లక్ష్యమైన అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనలో నగరాలు ముఖ్య భూమిక పోషిస్తాయి.


ఆకర్షణీయ నగరాలకు తగ్గిన నిధులు

జూన్‌లో ముగియనున్న ఆకర్షణీయ నగరాల అభివృద్ధికి కేంద్రం గతసారి రూ.8,800 కోట్లు కేటాయించగా ఈసారి రూ.7,634 కోట్లను మాత్రమే ప్రతిపాదించింది. దేశంలోని మొత్తం 100 ఆకర్షణీయ నగరాల్లో చాలా నగరాలు నిర్దేశిత ప్రాజెక్టుల లక్ష్య సాధనలో వెనకబడి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో నిధులను తెగ్గోయడం వల్ల వాటి అభివృద్ధికి విఘాతం ఏర్పడి, ప్రతిష్ఠాత్మక ఆకర్షణీయ నగరాల కార్యక్రమ ఉద్దేశం నీరుగారిపోతుంది. చాలా రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుకు తమ వాటాగా ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయడంలేదు. ఈ ప్రాజెక్టు కాలావధిని కనీసం మరో అయిదేళ్లయినా పొడిగించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.