Adani: అప్పుల కొండపై ఎదిగిన అదానీ

షేర్ల ధరల్లో విన్యాసాలు, ఖాతా పుస్తకాల్లో మోసాలు తదితర అవకతవకల ద్వారా అదానీ గ్రూప్‌ కార్పొరేట్‌ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందనేది న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ ఆరోపణ. దాంతో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ భారీగా కోసుకుపోయింది. ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ...

Updated : 23 Feb 2023 13:32 IST

షేర్ల ధరల్లో విన్యాసాలు, ఖాతా పుస్తకాల్లో మోసాలు తదితర అవకతవకల ద్వారా అదానీ గ్రూప్‌ కార్పొరేట్‌ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిందనేది న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ ఆరోపణ. దాంతో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ భారీగా కోసుకుపోయింది. ఈ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ  జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

దానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు దేశంలో రాజకీయ, ఆర్థిక దుమారానికి దారితీశాయి. భారత్‌లో, ఆసియాలో అతి సంపన్నుల జాబితాలో గౌతమ్‌ అదానీ తనకున్న ర్యాంకును పోగొట్టుకున్నారు. ఈక్విటీ వాటాల విక్రయాన్ని రద్దు చేసి, మదుపరులకు వారి సొమ్ము వెనక్కి ఇస్తామని సైతం ప్రకటించారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని భారత సెక్యూరిటీస్‌, ఎక్స్చేంజి బోర్డు (సెబి) సుప్రీంకోర్టుకు తెలిపింది. అదానీ సంస్థలకు ఏ మేరకు రుణాలిచ్చినదీ తెలపాలని రిజర్వు బ్యాంకు భారతీయ ఆర్థిక సంస్థలను, బ్యాంకులను కోరింది. కొన్ని బ్యాంకులు ఆ మేరకు వివరాలను సమర్పించాయి. అదానీ గుట్టును హిండెన్‌బర్గ్‌కన్నా ముందు బయటపెట్టిన సంస్థ- ఫిచ్‌ గ్రూపునకు చెందిన క్రెడిట్‌ సైట్స్‌. అతిగా అప్పుల మీద ఆధారపడి వ్యాపారాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్‌ మున్ముందు సమస్యల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. రేవులు, హరిత ఇంధనాలు, విమానాశ్రయాలు, రహదారులు, సిమెంటు ఉత్పత్తి వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆ గ్రూప్‌ అప్పుల ఆధారంగానే నడిపిస్తోంది. భారతదేశ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఈ గ్రూపునకు సుమారు రూ.21 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చింది. అదానీ సంస్థలకు అన్ని భారతీయ బ్యాంకులు కలిసి దాదాపు రూ.80,000 కోట్ల మేరకు రుణాలు ఇచ్చినట్లు అంచనా. ఇది అదానీ గ్రూపు మొత్తం రుణాలు రెండు లక్షల కోట్ల రూపాయల్లో 40 శాతానికి సమానం. ఈ రుణ కేంద్రిత వ్యాపారాభివృద్ధి వల్ల అదానీ ప్రపంచంలో నాలుగో అతి సంపన్నుడిగా ఆవిర్భవించగా, ఆయన వ్యాపార సామ్రాజ్యం మార్కెట్‌ విలువలో అంబానీ గ్రూపుకన్నా పెద్దదిగా నిలిచింది. టాటాల తరవాత అదానీ సంస్థలు రెండో అతిపెద్ద వ్యాపార గ్రూపుగా అవతరించాయి.

వేగంగా వృద్ధి

టాటా, అంబానీల సంస్థలు అగ్రస్థాయికి చేరుకోవడానికి ఎన్నో తరాలు పట్టగా- అదానీ గ్రూపు అతి కొద్ది సంవత్సరాల్లోనే శిఖరాగ్రానికి చేరుకుంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలు తోడయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలు చేపడుతూ వచ్చిన విద్యుత్‌, రేవులు, రహదారులు, విమానాశ్రయాల వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులను అదానీ గ్రూప్‌ చేజిక్కించుకోవడం మొదటిది. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని, అది ప్రైవేటు రంగం ద్వారానే జరగాలన్న నయా ఉదారవాద విధానంలో- ప్రైవేట్‌ పరిశ్రమలకు, కొద్దిమంది వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం దక్కుతోంది. ఈ క్రమంలో అదానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు వేగంగా సులభంగా అనుమతులు, భూమి లభించాయి. అడిగినదే తడవుగా అప్పులు లభించడం అదానీ సంస్థల శీఘ్ర వృద్ధికి రెండో కారణం. అదానీ గ్రూపు ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే కాకుండా భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) వంటి సంస్థల నుంచీ భారీగా నిధులు సేకరించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో గ్రూపు మొత్తం రుణాలు రూ.2.20 లక్షల కోట్ల రూపాయలు. గడచిన సంవత్సరంలోనే గ్రూపు మొత్తం రుణభారం 42 శాతం పెరిగింది. గ్రూపు బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు కేవలం రూ.26,983 కోట్లు. అయినా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పోటీపడి అదానీ సంస్థలకు రుణాలు ఇచ్చాయి. స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూపు వాటాల విలువ విపరీతంగా పెరిగిపోవడం ఆర్థికంగా ఎదగడానికి మూడో కారణం. అదానీ గ్రూపు కంపెనీల్లో వాటాదారుల స్వభావం వల్ల మార్కెట్‌ రేటు విపరీతంగా పెరిగిపోయి ఉండవచ్చు. ఈ గ్రూపులో పెట్టుబడి పెట్టిన అతికొద్ది విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) వివరాలు బయటికి తెలియవు. ఈ మదుపరులు అదానీ గ్రూప్‌ షేర్ల ధరలు పైపైకి దూసుకుపోయేలా విన్యాసాలు చేశారు. అక్కడికీ జాతీయ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ సంస్థ మూడు ఎఫ్‌పీఐ కంపెనీల ఖాతాలను స్తంభింపజేసింది.

ముందుజాగ్రత్త మేలు

భారతీయ బ్యాంకులు గతంలో చేసిన పొరపాట్ల నుంచి కొత్త పాఠాలేమీ నేర్చుకున్నట్లుగా కనిపించడం లేదు. అందుకే 2009లో 4.7 శాతంగా ఉన్న భారతీయ బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2016 వచ్చేసరికి 32.6 శాతానికి పెరిగిపోయాయి. మరోవైపు హర్షద్‌ మెహతా కుంభకోణం (1992), కేతన్‌ పరేఖ్‌ కుంభకోణం (2001), సత్యం కుంభకోణం (2008)లో మదుపరులు భారీగా డబ్బు పోగొట్టుకున్న తరవాత కూడా అదానీ ఉదంతం చోటుచేసుకోవడం నియంత్రణ సంస్థల పనితీరును పట్టి చూపుతోంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో 70 శాతం అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి అందినవేనని రూఢి అయింది. మొత్తానికి ఆర్థిక రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎంత ముఖ్యం అనేది అదానీ ఉదంతం చాటిచెబుతోంది. ఈ గ్రూపు కుప్పకూలడం దేశార్థికానికి నష్టమనే అభిప్రాయాలూ కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే ఆ వైఫల్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవలసిన దుస్థితి పట్టకుండా ముందు నుంచే జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం గుర్తుచేస్తోంది.


భారీగా నిధుల సేకరణ

దానీ గ్రూపు ఈక్విటీల ద్వారా కాకుండా అప్పుల ద్వారా పెట్టుబడుల సేకరణకు ప్రాధాన్యం ఇచ్చింది. పన్ను ఎగవేతదారులకు ఆశ్రయం ఇచ్చే విదేశాల్లో తమ మిత్రులు ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూపు నిధులు సమీకరించిందని హిండెన్‌బర్గ్‌ సంస్థ ఆరోపించింది. స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన కంపెనీలు కనీసం 25 శాతం వాటాలను ప్రజలకుగాని, ప్రభుత్వరంగ సంస్థలకుగాని కేటాయించాలన్న నిబంధననూ పాటించలేదనే విమర్శలున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వర్గాలుగాని, స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థలుగాని జోక్యం చేసుకోకుండా మిన్నకుండిపోయాయని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. వివిధ విన్యాసాల ద్వారా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన గ్రూపు షేర్లను పూచీకత్తుగా చూపి దేశవిదేశీ బ్యాంకులు, మదుపరి సంస్థల నుంచి అదానీ సంస్థలు భారీగా నిధులు సేకరించగలిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.