వ్యవసాయం అన్నం పెడుతోందా?
భారత జనాభాలో నేటికీ దాదాపు 60శాతం ఉపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడుతోంది. హరిత, శ్వేత, నీలి తదితర విప్లవాల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాయి.
భారత జనాభాలో నేటికీ దాదాపు 60శాతం ఉపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడుతోంది. హరిత, శ్వేత, నీలి తదితర విప్లవాల ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి చెందాయి. పంటల దిగుబడి అధికమైంది. అయితే, భారత్‌లో అన్నదాతల ఆదాయం ఎంత మేరకు పెరిగింది? నేటికీ సరైన మద్దతు ధర కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
గ్రామాల్లో వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, చేపలు పట్టడం వంటివీ ఉంటాయి. ఇవన్నీ కలిపినా దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా క్రమేపీ తగ్గుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి మెరుగుపడాలంటే వైవిధ్యభరితమైన మన దేశంలో స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విభిన్న వ్యవసాయ విధానాలు, పరిష్కారాలను అన్వేషించాలి. అరణ్య ప్రాంతాలు, శీతల, ఉష్ణ ఎడారులు, తీర, మైదాన ప్రాంతాలు, నీరు నిలవని పర్వత ప్రాంతాలు, సాగు నీరు పుష్కలంగా అందే మాగాణి భూములు, మెట్ట పొలాలు, చవిటి నేలలు... ఇలా భారత్‌లో పలు రకాల భూములు ఉన్నాయి. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లు- వీటన్నింటికీ కలిపి ఒకే రకమైన వ్యవసాయ విధానాలు అనుసరించడం సరికాదు. ఇలాంటి వైవిధ్యభరితమైన ప్రాంతాలను దేశవిదేశాల్లో చూసి అధ్యయనం చేసే అవకాశం నాకు కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పని చేసే రోజుల నుంచి కలిగింది. 1994లో కేంద్ర సర్వీసుకు వెళ్దామని అనుకున్నప్పుడు, రాష్ట్రంలో చాలాకాలం పని చేసిన వ్యవసాయ శాఖలోనే వేశారు. మళ్ళీ అదేనా అని మొదట్లో అనుకున్నా, దేశం మొత్తం మీద సాగు రంగం స్థితి ఎలా ఉందో తెలుసుకునే అవకాశం రావడంతో మరింత ఉత్సాహం కలిగింది. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ)తో కలిసి పనిచేయడం వల్ల 28 దేశాల్లో సాగు విధానాలను క్షుణ్నంగా పరిశీలించే భాగ్యం కలిగింది.
మారాల్సిన విధానం
భారత్‌లో వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలను పర్యవేక్షించే సంస్థలు, మంత్రిత్వ శాఖలు కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటన్నింటి మధ్యా సమన్వయ లేమి పెద్ద సమస్యగా ఉంటోంది. వైవిధ్యభరితమైన భారత్ మొత్తానికీ ఒకే సాగు విధానం ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ భావించడం అనేక చిక్కులు తెస్తోంది. అంతర్జాతీయ సంస్థలైన ఎఫ్‌ఏఓ, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లతో కార్యకలాపాలను కేంద్రం సమర్థంగా నెరపాలి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్), వ్యవసాయ అనుబంధ నిర్వహణా సంస్థ (మేనేజ్) వంటి వాటిని సరిగ్గా నిర్వహించాలి. ఎగుమతి-దిగుమతి విధానాలను కాలానుగుణంగా సవరించాలి. రైతులకు రుణం, పంట బీమా వ్యవస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వీటిని మాత్రమే కేంద్రం తన వద్ద అట్టిపెట్టుకొని, మిగిలిన విధులను రాష్ట్రాలకు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పని చేసే సంస్థలకు వదిలివేయాలి. ప్రపంచంలోని చాలా దేశాల్లో కేంద్ర ప్రభుత్వాలు ఇదే విధానాన్ని పాటిస్తున్నాయి. ఇండియాలో మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఈ విధానం మారాలి.
భారత్‌లో సాగు పరిశోధన, వ్యవసాయ అనుబంధ రంగాలు, పంట రుణాలు, బీమా, విపణి వ్యవస్థలన్నీ ప్రస్తుతం సరఫరా ఆధారిత పద్ధతి (సప్లై డ్రివెన్ మోడ్)లోనే పని చేస్తున్నాయి. అవి వెంటనే గిరాకీ ఆధారిత పద్ధతి (డిమాండ్ డ్రివెన్ మోడ్)లోకి మారాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థలు అన్నదాతలకు ఏం కావాలో అది అందించకుండా, తమకు తోచినవి, సాధ్యపడేవి మాత్రమే చేసి, రైతును వాటిలోంచి ఎంపిక చేసుకొమ్మంటున్నాయి. ఇక మన ఉత్పాదనలను అంతర్జాతీయ విపణిలో విక్రయించి రైతులు లాభాలు కళ్లజూడాలంటే నాణ్యతలో పోటీ పడటమే కాదు, అక్కడి అవసరాలకు అనుగుణంగా పంటలను తీర్చిదిద్దాలి. ఉదాహరణకు, మన దగ్గర రుచిగా ఉంటే మామిడిపండు బాగుందని అంటాం. పారిస్‌లో మామిడిపండు కొనే వ్యక్తి దాని రంగు, సైజు, తొక్క మందం, గుజ్జు చిక్కదనం, సాగులో ఏ నీరు వినియోగించారు, ఏయే ఎరువులు వాడారు వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటాడు. కొనేవాళ్ల అభిరుచికి తగ్గట్టుగా విక్రయించే వ్యక్తి సరకు తయారు చేయడం వ్యాపార ధర్మం కదా! ఈ క్రమంలో మేలిమి వ్యవసాయ విధానాల పేరిట 360 అంశాలు అంతర్జాతీయంగా రూపొందాయి. వాటిలో 90 మన దేశానికి వర్తిస్తాయి.
పాలకుల అలక్ష్యం
ఇండియా వ్యవసాయ రంగంలో బ్యాంకులు వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేవారికన్నా, ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించేవారే అధికం. ప్రాంతాలు, పంటలను బట్టి రైతుల అవసరాలు మారుతుంటాయి. రుణాలిచ్చే సంస్థలు కొన్ని నిబంధనలు ఏర్పరచుకుని, గిరి గీసుకుని, రైతు కోరినంత కాకుండా తాము ఇవ్వదలచుకున్నంతే ఇస్తున్నాయి. పైగా దాన్నీ సరైన సమయానికి అందించడం లేదు. అందువల్ల రైతు అవసరాలు తీరడం లేదు. ఇక బీమా విషయంలో చాలా మార్పులే చేయాల్సి ఉంది. ప్రస్తుతం బీమా చేసిన రైతు వ్యక్తిగతంగా నష్టపోయాడా లేదా అన్నది చూడకుండా, ఆ ప్రాంతంలోని అందరికీ కలిపి నష్టం వచ్చిందా లేదా అని చూసి పరిహారపు సొమ్ము చెల్లిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సబబు కాదు. సాగు రంగంలో ఈ సమస్యలపై దశాబ్దాలుగా ఎందరో నిపుణులు గళం విప్పుతున్నా, ప్రభుత్వాలు మొక్కుబడి చర్యలు తీసుకుంటూ, కాలక్షేపం చేస్తూ వచ్చాయి. ఈ నిర్లక్ష్యానికి మనం చెల్లించిన మూల్యమేమిటో పంట విరామ సంఘం (క్రాప్ హాలిడే కమిటీ) చైర్మన్‌గా 2011లో కోనసీమలో పర్యటించినప్పుడు నాకు అర్థమైంది. నిక్కచ్చిగా చెప్పాలంటే- సాగు రంగంలో మనకు కనబడుతున్న అనర్థం రవ్వంత, వాస్తవంగా మేట వేసింది కొండంత. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది.
ప్రాథమిక స్థాయిలోనే...
ఇండియాలో ఒకేడాది వర్షపాతం బాగుంటుందని వాతావరణ శాఖ చెప్పిందంటే, అది దేశం మొత్తం సగటుకు సంబంధించిందని అర్థం. కొన్నిచోట్ల అతివృష్టి, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి తలెత్తవచ్చు. అకాల వర్షాలు సైతం కురవవచ్చు. వర్షం ఒక పంటకు మేలు చేయవచ్చు, మరోదాన్ని దెబ్బతీయవచ్చు. ఈ అంశాలను విస్మరించి వాతావరణ శాఖ ప్రకటన మేరకు సాగు అంతా బాగుంటుందని అనుకోవడం, దాన్ని బట్టి అంచనాలు వేయడం సరికాదు. ఇండియాలో పరిశోధనల ద్వారా అనేక కొత్త వంగడాలు ఆవిష్కృతమయ్యాయి. వాటి వల్ల ఆహారోత్పత్తి పెరిగింది. అయితే, మన దగ్గర సాగులో పరిశోధన ప్రాథమిక, లేదా సరికొత్తదాన్ని ఊహించి, సాధించడానికి ప్రయత్నించడం (బ్లూ స్కై) అనే ధోరణి వద్దే ఉండిపోయింది. వీటిలో కొన్ని ఆచరణాత్మకంగా ఉండవు. అందువల్ల కొన్నింటిని ఉత్పత్తి చేయడం ఆర్థికపరంగా గిట్టుబాటు కాక వదిలివేస్తున్నారు. 1994లో నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడి వ్యవసాయ పరిశోధనా సంస్థ పరిశోధనల్లో 90శాతం దాకా ఆచరణయుక్తంగా ఉండటం గమనించాను. వారి పరిశోధనలు గిరాకీకి అనుగుణంగా, సులభ పరిష్కారాలు కనుగొనేలా సాగుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
General News
kishan reddy: హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటి: కిషన్ రెడ్డి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
-
India News
Odisha Train Accident: రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిల్..
-
India News
Odisha Train Accident: 1,000 మంది సిబ్బంది.. భారీ యంత్రాలతో ట్రాక్ పునరుద్ధరణ..
-
Sports News
Virat Kohli: విరాట్‌ను అడ్డుకోవడం అంత సులువేం కాదు: ఆసీస్ ఆల్‌రౌండర్