వాణిజ్యలోటును నియంత్రిస్తేనే...

స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత్‌లో 75శాతం ప్రజలు సాగుపైనే ఆధారపడి జీవించేవారు. తరవాత కొంతమేరకు పారిశ్రామికీకరణ జరిగింది. అయినప్పటికీ, 2021 నాటికి దేశ జనాభాలో 47శాతానికి వ్యవసాయమే జీవనాధారమని ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశ వాణిజ్యంలో నెలకొన్న లోటును తగ్గించుకుంటే పెట్టుబడులు ఊపందుకొంటాయి. ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

Updated : 19 Jun 2023 17:22 IST

స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత్‌లో 75శాతం ప్రజలు సాగుపైనే ఆధారపడి జీవించేవారు. తరవాత కొంతమేరకు పారిశ్రామికీకరణ జరిగింది. అయినప్పటికీ, 2021 నాటికి దేశ జనాభాలో 47శాతానికి వ్యవసాయమే జీవనాధారమని ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశ వాణిజ్యంలో నెలకొన్న లోటును తగ్గించుకుంటే పెట్టుబడులు ఊపందుకొంటాయి. ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

ఆంగ్లేయుల పాలనకు ముందు మనదేశంలో వ్యవసాయం, హస్తకళలు పరిఢవిల్లి ఆర్థిక వ్యవస్థకు జీవగర్రగా ఉండేవి. నాడు భారతీయ వస్త్రాలు, ఆభరణాలకు ప్రపంచంలో, ముఖ్యంగా ఐరోపాలో ఎంతో గిరాకీ ఉండేది. బ్రిటిష్‌ పాలకులు పనిగట్టుకుని మన జౌళి రంగాన్ని దెబ్బతీ శారు. భారత్‌ను కేవలం ముడిసరకులు ఎగుమతిచేసే దేశం స్థాయికి దిగజార్చారు. తమ పరిశ్రమలు ఉత్పత్తిచేసిన వస్తువులను భారతీయులకు అంటగట్టారు. భారత్‌లో అప్పటికే జనాభా ఎక్కువ కాబట్టి బ్రిటిష్‌ సరకులకు మన దేశం పెద్ద మార్కెట్‌గా ఉపయోగపడింది. దీన్నిబట్టి ఆర్థిక వ్యవస్థలో విదేశీ వాణిజ్యం పాత్రను అర్థం చేసుకోవచ్చు.

ఆర్థిక వ్యవస్థకు నష్టం

భారీయెత్తున ఎగుమతులు చేయడం ద్వారానే చైనా ప్రపంచంలో నేడు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. ఎగుమతులు, దిగుమతులు అంతర్జాతీయ వాణిజ్యంలో అంతర్భాగాలు. ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఉందా లేదా అనేది చెల్లింపుల సమతూకం ద్వారా తెలుస్తుంది. ఎగుమతుల ద్వారా ఆర్జించే ఆదాయం, దిగుమతులకు పెట్టే ఖర్చు మధ్యనున్న సంబంధాన్ని చెల్లింపుల సమతూకం (బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ లేదా బీఓపీ) తెలుపుతుంది. అందులో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు, విదేశీ ఆర్థిక సహాయం, ప్రవాసుల జమలు కలిసి ఉంటాయి. మరో విధంగా చెప్పాలంటే, ఒక సంవత్సరంలో మిగతా ప్రపంచంతో భారత్‌ జరిపిన అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను సూచించే ఖాతాను బీఓపీ అంటారు. ఒక దేశ దిగుమతులకన్నా ఎగుమతులు ఎక్కువైతే వాణిజ్య మిగులు ఏర్పడుతుంది. దిగుమతులే ఎక్కువైతే వాణిజ్య లోటు ఎదురవుతుంది. లోటు లేదా మిగులు బీఓపీలో నమోదవుతుంది.
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చేనాటికి విదేశ మారక ద్రవ్య నిల్వలు, ముఖ్యంగా పౌండ్‌ స్టెర్లింగ్‌ నిల్వలు బాగానే ఉండేవి. రెండో ప్రపంచయుద్ధంలో భారత్‌ నుంచి సరకుల ఎగుమతులు దండిగా జరగడమే దీనికి కారణం. 1949లో బ్రిటిష్‌ పౌండు విలువ తగ్గినా, దానితో భారతీయ రూపాయి మారక విలువ తగ్గకుండా యథాతథంగా నిలిచింది. 1950లోనూ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంవల్ల రూపాయి మారక విలువ చెక్కుచెదరలేదు. 1957 వచ్చేసరికి భారత్‌ తొలిసారిగా విదేశ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. దిగుమతులకు స్వదేశంలో ప్రత్యామ్నాయాలను సృష్టించాలనే ప్రయత్నంలో మన విదేశీ ద్రవ్య నిల్వలు ఖర్చవడం ఈ సమస్యకు దారితీసింది. అలా మొదటి పంచవర్ష ప్రణాళిక మధ్యలోనే బీఓపీ సంక్షోభం ఎదురైంది. మౌలిక వసతుల విస్తరణ, కొత్త పరిశ్రమల స్థాపన జరగకుండానే విదేశ మారకద్రవ్య నిల్వలు హరించుకుపోతున్నాయని ఆందోళన రేగింది. ఆ నిల్వలను అత్యంత పొదుపుగా వాడుకోక తప్పదనే గ్రహింపుతో తరవాతి మూడున్నర దశాబ్దాల పాటు దిగుమతులపై, విదేశ మారక ద్రవ్య లావాదేవీలపై కఠినమైన నియంత్రణలు విధించాల్సి వచ్చింది.
ఇండియాకు సానుకూల బీఓపీ ఉన్నది 1972-73 (రూ.104కోట్ల మిగులు), 1976-77 (రూ.68కోట్లు) సంవత్సరాల్లోనే. 1991లో విదేశీ కరెన్సీ లోటు తీవ్రస్థాయిలో ఏర్పడింది. కీలకమైన దిగుమతులకు, రుణ కిస్తీలు, వడ్డీల చెల్లింపునకు విదేశీ ద్రవ్యం లేక సంక్షోభం తలెత్తింది. అత్యవసర వస్తువులను భారీయెత్తున దిగుమతి చేసుకోవాల్సి వచ్చినప్పుడు బీఓపీ లోటు ఏర్పడుతుంది. ఉదాహరణకు మలేసియా, ఇండొనేసియాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌ ధరలు పడిపోతే- భారత్‌లోని హోటళ్లు, కుటుంబాలు పామాయిల్‌ వాడకాన్ని పెంచుతాయి. ఆ గిరాకీని తీర్చడానికి పామాయిల్‌ను పెద్దయెత్తున దిగుమతి చేసుకోవలసి వస్తుంది.

పెరిగిన దిగుమతులకు చెల్లింపులు జరపడానికి మన విదేశ మారకద్రవ్య నిల్వలు ఖర్చయిపోతుంటాయి. అది వాణిజ్య (బీఓపీ)లోటు పెరగడానికి దారితీస్తుంది. రాజకీయ అస్థిరతను, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల నుంచి పెట్టుబడులు పలాయనం చిత్తగిస్తాయి. దాంతో పెట్టుబడుల ఖాతా లోటు ఏర్పడుతుంది. 2015లో వెనెజువెలా భారీ పెట్టుబడుల ఖాతా లోటును ఎదుర్కొంది. స్పెక్యులేషన్‌ కోసం స్వల్పకాలంలో పెట్టుబడులు తరలిపోయినా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టమే. కరెన్సీ విలువ క్షీణించడం, పెట్టుబడిదారుల నమ్మకాన్ని కోల్పోవడం, ఉద్యోగావకాశాలు తగ్గిపోవడం వంటి విపరిణామాలు సంభవిస్తాయి. ఇటీవలి కాలంలో థాయ్‌లాండ్‌, ఇండొనేసియా, రష్యా, బ్రెజిల్‌ దేశాల్లో జరిగింది ఇదే. ఒక దేశం ఎగుమతుల ద్వారా ఎక్కువ విదేశ మారక ద్రవ్యం ఆర్జించినప్పుడు దాని కరెన్సీ విలువ పెరుగుతుంది. దిగుమతులు ఎక్కువై విదేశీ ద్రవ్యం ఖాళీ అవుతుంటే కరెన్సీ విలువ క్షీణిస్తుంది. బీఓపీ దీనంతటినీ ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం సరైన ఆర్థిక, వాణిజ్య విధానాలను చేపట్టి ఎగుమతులను ప్రోత్సహిస్తే కరెన్సీ విలువ దానంతట అదే పెరుగుతుంది.

విదేశీ పెట్టుబడులు ముఖ్యం

భారత్‌లో తయారీ లక్ష్యాన్ని ఇండియా చేరుకోవాలంటే పారిశ్రామికోత్పత్తి రంగంలో భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐలను) ఆకర్షించాలి. అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగానికి పెట్టుబడుల లభ్యతను పెంచితే యావత్‌ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అధిక వడ్డీని ఇవ్వడం ద్వారా ప్రవాస భారతీయుల నుంచి డిపాజిట్లను ఆకర్షించాలి. ఈ విషయంలో చైనా, అమెరికాల అనుభవం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. బీఓపీలో మిగులు ఏర్పడినప్పుడు రూపాయి విలువ పెరిగి భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి విదేశాలు ముందుకొస్తాయి.


దిగుమతుల భారం

ఒక దేశంలోకి విదేశ మారకద్రవ్య రాకపోకలను చెల్లింపుల సమతూకం(బీఓపీ) తెలుపుతుంది. పెట్టుబడి ఖాతా లోటును అధిగమించడానికి రిజర్వు బ్యాంకు స్వదేశంలో బాండ్ల విక్రయం ద్వారా, విదేశాల నుంచి వాణిజ్య రుణాల సమీకరణ ద్వారా అదనపు నిధులను సేకరిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నదో కచ్చితంగా తెలపగలిగేది బీఓపీ మాత్రమే. భారత ప్రభుత్వం ఎగుమతులను పెంచడంలో సఫలమవుతోంది. కానీ, దిగుమతులు అధికం కావడం వాణిజ్య లోటుకు దారితీస్తోంది. అదే సమయంలో విదేశ మారకద్రవ్య నిల్వలు పెరగడం ఊరటనిస్తోంది. 2023 జనవరిలో ఇండియా వద్ద దాదాపు తొమ్మిది నెలల దిగుమతులకు సరిపడా విదేశ మారక నిల్వలు ఉన్నాయి. మార్చి నాటికి బ్యాంకుల నిరర్థక ఆస్తులు నాలుగు శాతం తగ్గాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ఇచ్చిన రుణాల్లో నిరర్థక ఆస్తుల శాతం పెరిగే సూచన ఉండటం విచారకరం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.