దేశంలో వాణిజ్య ఒప్పందాల జోరు

ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏల) పరంగా భారత్‌ కొన్నేళ్లుగా దూకుడు పెంచింది. వాటి విషయంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నాయి. ఆచితూచి అడుగు వేయకుంటే ఎఫ్‌టీఏల వల్ల నష్టమే అధికంగా సంభవించే ప్రమాదం ఉంది.

Updated : 19 Jun 2023 17:21 IST

ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏల) పరంగా భారత్‌ కొన్నేళ్లుగా దూకుడు పెంచింది. వాటి విషయంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నాయి. ఆచితూచి అడుగు వేయకుంటే ఎఫ్‌టీఏల వల్ల నష్టమే అధికంగా సంభవించే ప్రమాదం ఉంది.

గత మూడేళ్లలో భారత్‌ అనేక దేశాలతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కుదుర్చుకుంది. త్వరలో   ఇజ్రాయెల్‌తోనూ ఎఫ్‌టీఏ కుదరనుంది. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా వెయ్యి కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నిర్వహించాలని లక్షిస్తున్నారు. 90 రోజుల చర్చల తరవాత భారత్‌-యూఏఈ ఎఫ్‌టీఏ కుదిరింది. గత డిసెంబరు నుంచి భారత్‌-ఆస్ట్రేలియా ఎఫ్‌టీఏ అమలులోకి వచ్చింది. అప్పటికి మొత్తం 13 దేశాలతో భారత్‌ ఎఫ్‌టీఏలు కుదుర్చుకుంది. మరో ఆరు దేశాలతో ప్రాధాన్య ప్రాతిపదికపై వాణిజ్య ఒప్పందాలనూ ఇండియా పట్టాలకెక్కించింది. ఐరోపా సమాఖ్య (ఈయూ)తోనూ వాణిజ్య ఒప్పందానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చైనా ఆధ్వర్యంలోని ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందానికి (ఆర్‌సీఈపీ) భారత్‌ దూరం జరిగింది. ఇండో-పసిఫిక్‌ ఆర్థిక ఒప్పందంలో భాగస్వామ్యం తీసుకొంటోంది. ఈయూతోపాటు గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ), బ్రిటన్‌, కెనడాలతోనూ వాణిజ్య ఒప్పందాలను ఇండియా కుదుర్చుకోదలచింది.

ఉభయతారకమేనా?

గత పదేళ్ల నుంచి ఎఫ్‌టీఏల విషయంలో భారత్‌ జోరుగా ముందుకెళ్తోంది. ఇండియా విదేశీ వాణిజ్య విధానంలో వచ్చిన ప్రధాన మార్పు ఇది. ఎఫ్‌టీఏలలో భాగంగా ఇండియాలోకి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను తగ్గించడమో, తొలగించడమో జరుగుతుంది. దానివల్ల ప్రభుత్వ ఆదాయం కోసుకుపోతుంది. స్వదేశంలో ఉత్పత్తిని, తద్వారా ఎగుమతులను పెంచడానికి ఉద్దేశించిన ఆత్మనిర్భర్‌ భారత్‌, మేక్‌ ఇన్‌ ఇండియా పథకాలతో ఎఫ్‌టీఏలకు పొసగదని చెప్పవచ్చు. అనేక వస్తువులపై అధిక సుంకాలు విధించడం ద్వారా వాటి దిగుమతులను తగ్గించి, స్వదేశంలో ఉత్పత్తి పెంచాలని భారత్‌ చూస్తోంది. ఎఫ్‌టీఏల వల్ల విదేశాల నుంచి దిగుమతులు వెల్లువెత్తి స్వదేశీ పరిశ్రమలు దెబ్బతింటాయి. అయితే, చైనా నుంచి ఉత్పత్తి కార్యకలాపాలను తరలించాలనుకుంటున్న సంపన్న దేశాలు, వాటి కంపెనీలకు ఎఫ్‌టీఏల వల్ల భారత్‌ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుంది. బహుళజాతి సంస్థల నుంచి పెట్టుబడులను సాధించడానికి ఎఫ్‌టీఏలు తోడ్పడతాయని, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఎగుమతులను పెంచుకునే ఉద్దేశంతోనే భారత్‌ ఎఫ్‌టీఏలను కుదుర్చుకుంటోంది. ఆ మేరకు ఫలితాలూ కనిపిస్తున్నాయి. అయితే, తక్కువ ధరలకు ఎగుమతులు చేయడం వల్లనే పెరుగుదల కనిపించింది. అదేసమయంలో ఎగుమతులకన్నా వేగంగా దిగుమతులూ అధికమయ్యాయి. ఎఫ్‌టీఏ రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండాలి. ఆ భరోసా లేకపోవడం బ్రిటన్‌, ఈయూలతో ఎఫ్‌టీఏల సంప్రతింపుల్లో విఘాతకరంగా మారింది. తన ఐటీ సేవల ఎగుమతులను పెంచడానికి బ్రిటన్‌, ఈయూలు అంగీకరించాలని, ఆ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళే భారతీయ నిపుణ సిబ్బందికి మరిన్ని వీసాలు ఇవ్వాలని ఇండియా కోరుతోంది. బ్రిటన్‌, ఈయూలు మాత్రం తమ పాడి ఉత్పత్తులు, మద్యాలను మరింతగా భారత్‌కు ఎగుమతి చేసే వెసులుబాటు ఉండాలని పట్టుపడుతున్నాయి. చౌక ధరల్లో రేషన్‌ సరకులను ఇండియా అందించడంపైనా అభ్యంతరం తెలుపుతున్నాయి. మద్యం, పాడి ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలని అనేక ఇతర దేశాలూ డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం విదేశీ మద్యం దిగుమతులపై ఇండియా భారీగా సుంకాలు విధిస్తోంది. మద్యం వ్యాపారం రాష్ట్రాల పరిధిలోని అంశం. బ్రిటన్‌, ఈయూలు భారతీయ రాష్ట్రాల్లోనూ స్వేచ్ఛావాణిజ్యం జరగాలని కోరుతున్నాయి. మద్యాన్ని రాష్ట్రాల జాబితా నుంచి కేంద్ర జాబితాకు మార్చాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. మూడింట రెండు వంతుల రాష్ట్రాలు దానికి ఒప్పుకొంటూ శాసనసభల్లో తీర్మానాలు చేయాలి. 2024లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నందువల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు. పాడి ఉత్పత్తుల దిగుమతిపై సుంకాలు తగ్గిస్తే విదేశీ పాలు, పాల ఉత్పత్తులు వెల్లువెత్తి మన గ్రామీణుల జీవనాధారం దెబ్బతింటుంది.

పోటీలో వెనకంజ

భారత్‌ ప్రధానంగా ముడి సరకులను, పాక్షికంగా ఉత్పత్తి అయిన వస్తువులను ఎగుమతి చేస్తోంది. ఈ పద్ధతి మారకపోతే విదేశాల నుంచి పూర్తిగా ఉత్పత్తి అయిన సరకులను అధికంగా దిగుమతి చేసుకోవలసి వస్తుంది. ఇండియా ఎగుమతి చేసే సాఫ్ట్‌వేర్‌ సేవలూ దిగువ, మధ్యస్థ స్థాయికి చెందినవే. భారత్‌లో పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి వ్యయం ఎక్కువ కావడంవల్ల అంతర్జాతీయ విపణిలో ఇతర దేశాల సరకులతో పోటీపడలేక పోతోంది. రవాణా వ్యయం అధికంగా ఉండటం, ప్రభుత్వం ధరలను ప్రత్యక్షంగా పరోక్షంగా నియంత్రించడం వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఎగుమతులను పెంచలేకపోతున్నాయి. ఇతర దేశాలు చిన్న పరిశ్రమలకు సబ్సిడీలు ఇస్తున్నాయి. భారత్‌ బడా కంపెనీలకు వరాలిస్తోంది. తక్కువ వ్యయంతో మేలైన వస్తువులను ఉత్పత్తి చేయగల పరిశ్రమలకే ఎఫ్‌టీఏ ప్రయోజనకరంగా ఉంటుంది. చైనా మాదిరిగా నాణ్యమైన శ్రామిక శక్తిని అందించడం ద్వారా విదేశీ మార్కెట్లలో ఇండియా పాగా వేయాలి. అధునాతన సాంకేతికతలతో మన పరిశ్రమల ఉత్పాదకతను పెంచాలి. డాలర్లలో కాకుండా రూపాయల్లో వాణిజ్యానికి ఇతర దేశాలను ఒప్పించడమూ తప్పనిసరి. లేదంటే ఎగుమతులకన్నా దిగుమతులు ఎక్కువైపోయి మన డాలర్‌ నిల్వలు హరించుకుపోతాయి. ఏదిఏమైనా ముందువెనకలు ఆలోచించి తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ఎఫ్‌టీఏల వల్ల మేలు కన్నా కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.


పారిశ్రామిక దేశాలకే లాభం

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్‌ సైతం భాగస్వామి. దాని పరిధికి వెలుపలే ఎఫ్‌టీఏలు కుదురుతున్నాయి. ఈ ద్వైపాక్షిక ఒప్పందాలు రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించినా, కొన్ని నష్టాలూ ఉన్నాయి. ఎఫ్‌టీఏలను దశలవారీగా అమలు చేయకపోతే అవి రెండువైపులా పదునైన కత్తుల్లా మారతాయి. ఎఫ్‌టీఏల ద్వారా ఉన్నపళాన విదేశాల నుంచి దిగుమతులను అనుమతిస్తే స్థానిక పరిశ్రమలు కుదేలవుతాయి. అందువల్ల, కొత్త మార్పులకు అవి సర్దుకునేందుకు తగినంత వ్యవధి ఇవ్వాలి. ఎఫ్‌టీఏలను క్రమక్రమంగా అమలు చేస్తే స్థానిక పరిశ్రమలు నిలదొక్కుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. సంపన్న పారిశ్రామిక దేశాలు ఆధునిక సాంకేతికతలతో ఉత్పాదకతను పెంచుకొంటాయి. అందువల్ల వాటి ఉత్పత్తులు నాణ్యంగా ఉండి వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఏతావతా ఎఫ్‌టీఏలు పారిశ్రామిక దేశాలకే లాభసాటిగా మారే అవకాశం ఉంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.