అభివృద్ధి ముసుగులో చైనా అప్పుల వల!

సిల్క్‌రూట్‌... రెండు వేల ఏళ్ల క్రితం ప్రసిద్ధ వాణిజ్య మార్గం. ప్రాచీన మార్గానికి సరికొత్త రూపంగా చైనా 2013లో ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)’ ప్రాజెక్టును చేపట్టింది.

Updated : 27 Sep 2023 09:39 IST

సిల్క్‌రూట్‌... రెండు వేల ఏళ్ల క్రితం ప్రసిద్ధ వాణిజ్య మార్గం. ప్రాచీన మార్గానికి సరికొత్త రూపంగా చైనా 2013లో ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ)’ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ఆధునిక చైనాకు ప్రతిరూపంగా నిలవాలని లక్షించింది. ఇప్పుడీ ప్రాజెక్టుకు పదేళ్లు నిండాయి. ఇందులో చేరిన దేశాలు రుణ ఊబిలో కూరుకుపోవడంతో బీఆర్‌ఐ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది.

చైనా నుంచి మధ్యాసియా మీదుగా ఐరోపా వరకు 4,000 మైళ్ల పర్యంతం సాగిన ప్రాచీన సిల్క్‌ రూట్‌ నేటి పాకిస్థాన్‌, భారత్‌లనూ కలిపేది. దాని స్థానంలో చేపడుతున్న బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) చైనాతోపాటు భాగస్వామ్య దేశాలకూ ఆర్థిక అభ్యున్నతిని తీసుకొస్తుందని బీజింగ్‌ భావించింది. బీఆర్‌ఐ అనేక దేశాలను రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా కలుపుతుంది. దీనికింద ఇప్పటికే అమలవుతున్న ప్రాజెక్టులకు తోడు 2,600 కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఖనిజ నిక్షేపాలతో సుసంపన్నమైన ఆఫ్రికా పైనే చైనా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. ఇంతవరకు 52 ఆఫ్రికా దేశాలు బీఆర్‌ఐలో పాలుపంచుకొంటున్నాయి.

అప్పుల గుదిబండగా...   

చైనా బీఆర్‌ఐ పేరిట పేద దేశాలను రుణ ఊబిలోకి లాగుతోందనే విమర్శలు ఆది నుంచే వినిపిస్తున్నాయి. 2000-20 మధ్య చైనా వివిధ ఆఫ్రికా దేశాలకు 16,000 కోట్ల డాలర్ల మేర రుణాలిచ్చింది. ఆ నిధులతో పది వేల చైనా కంపెనీలు బీఆర్‌ఐ కింద వేర్వేరు మౌలిక వసతుల నిర్మాణ పనులు చేస్తున్నాయి. చైనా ఇతర దేశాలకు ఇచ్చే రుణాలతో అక్కడ మళ్ళీ డ్రాగన్‌ దేశ సంస్థలే బీఆర్‌ఐ పనులు చేపడుతున్నాయి. చైనా కేంద్ర ప్రభుత్వానికి చెందిన 300 కంపెనీలు ఇతర దేశాలకు బీఆర్‌ఐ రుణాలు అందిస్తున్నాయి. వాటిలో సింహభాగం నిరుపేద ఆఫ్రికా దేశాలకు చేరుతున్నాయి. ఆ దేశాల నుంచి చైనా భారీగా వడ్డీ పిండుకొంటోందనే విమర్శలు వచ్చాయి. సాధారణంగా చైనా పదేళ్ల రుణానికి నాలుగు శాతం వడ్డీ వసూలు చేస్తుంది. అదే అమెరికా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల అండదండలున్న అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కేవలం ఒకటి నుంచి రెండు శాతం వడ్డీకి 20 లేదా 30 ఏళ్ల కాలానికి రుణాలిస్తాయి. రుణ ఊబిలోకి లాగాలనే ఉద్దేశంతోనే అప్పులు తీర్చే స్థోమత లేకున్నా పేద దేశాలకు ఉదారంగా చైనా రుణాలిచ్చేస్తోంది. బీఆర్‌ఐలో చేరడం వల్ల తమకు ఒరిగిందేమీ లేదని సంపన్న దేశం ఇటలీ చెబుతోంది. చైనా పెట్టుబడులతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఇటలీ కల నీరుగారిపోయింది. 2019లో బీఆర్‌ఐ కింద ఇటలీలోకి ప్రవహించిన పెట్టుబడులు 250 కోట్ల డాలర్లు. 2021లో అవి 80 కోట్ల డాలర్లకు పడిపోయాయి. చైనాతో సంబంధాలను పూర్తిగా తెంచుకోకుండా బీఆర్‌ఐ నుంచి వైదొలగడమెలాగని ఇటలీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ సమస్యకు కనుచూపు మేరలో పరిష్కారం కనిపించడం లేదు. బీఆర్‌ఐ అనేది నేడు ఇటలీలో రాజకీయ వివాదంగా మారింది. జర్మనీ రెండేళ్ల క్రితమే బీఆర్‌ఐకి వీడ్కోలు పలికింది. ఐరోపా సమాఖ్య (ఈయూ) సభ్య దేశాలేవీ బీఆర్‌ఐలో చేరకుండా నిషేధించాలని సూచించింది.

భవిష్యత్తు ఏమిటి?

రెండో ప్రపంచ యుద్ధంలో ఛిన్నాభిన్నమైన ఐరోపా దేశాల పునర్నిర్మాణం కోసం ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించాలని అమెరికా పట్టుపట్టలేదు. చైనా మాత్రం బలవంతంగా అప్పులు వసూలు చేసుకుంటోంది. డ్రాగన్‌ ఎన్నడూ ఏ దేశానికీ రుణమాఫీ చేయలేదు. రుణ చెల్లింపునకు కాలపరిమితిని మాత్రమే పొడిగిస్తోంది. ఇది పేద ఆఫ్రికా దేశాలకు ఏ మాత్రం ఉపయుక్తం కాదు. చైనా గుప్పిట్లోంచి వర్ధమాన దేశాలను బయట పడేయడానికి జీ7 దేశాలతో కలిసి అమెరికా 2021లో బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌ వరల్డ్‌ పథకం (బీ3డబ్ల్యూ) చేపట్టింది. దీనికింద, వచ్చే అయిదేళ్లలో పేద దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణానికి 60వేల కోట్ల డాలర్లు కేటాయించింది. 2023తో పదేళ్లు పూర్తి చేసుకుంటున్న చైనా బీఆర్‌ఐ నేడు సంక్లిష్ట దశను చేరుకుంది. భాగస్వామ్య దేశాలకు లబ్ధి చేకూర్చినట్లు రుజువు కాకపోతే, బీఆర్‌ఐ ఆకర్షణ కోల్పోతుంది. అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య కూటమితో విభేదాల వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ మందగతిలోకి జారిపోయింది. ఫలితంగా బీఆర్‌ఐలోకి చైనా పెట్టుబడులూ తగ్గిపోతున్నాయి. వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు బీఆర్‌ఐ కారణంగా పేద దేశాల్లో ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతులు వంటివాటి విషయంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తేనే ప్రయోజనం ఉంటుంది.  


  • బీఆర్‌ఐ కింద ఆఫ్రికా దేశాలకు చైనా రుణాలిచ్చి అక్కడి ఖనిజ వన రులను తవ్వుకుపోతోంది. 42 ఆఫ్రికా, ఆసియా దేశాలు తమ జీడీపీలో 10శాతాన్ని ఏటా డ్రాగన్‌ దేశం అప్పులు తీర్చడానికే వెచ్చించాల్సి వస్తోం దంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిబూటి, లావోస్‌, జాంబియా, కిర్గిజిస్థాన్‌ వంటి కడుపేద దేశాలైతే 20 నుంచి 25శాతం జీడీపీని చైనాకు సమర్పించుకుంటున్నాయి.

  • ఆర్థిక సంస్కరణలు, సరళీకరణను చేపట్టే దేశాలకే ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు రుణాలిస్తాయి. వాటిని అమలు చేసేందుకు మొగ్గుచూపని నిరంకుశ ప్రభుత్వాలు అప్పుల కోసం చైనా వలలో పడుతున్నాయి. 2020లో చైనా అప్పులు తీర్చలేక జాంబియా చేతులెత్తేసింది. తరవాత రుణ చెల్లింపునకు కాలపరిమితిని పొడిగించడానికి చైనా, జాంబియాల మధ్య ఒప్పందం కుదిరింది.

  • అప్పులు తీర్చలేక గడచిన రెండేళ్లలో 17 ఆఫ్రికా దేశాలు చైనాతో రుణ పునర్‌వ్యవస్థీకరణ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కఠిన ఒప్పందాలు కుదిరిన తరవాత కొన్ని దేశాల్లో బీఆర్‌ఐ పెట్టుబడులు నెమ్మదిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పాకిస్థాన్‌లోనూ చైనా పెట్టుబడులు గణనీయంగా తగ్గాయి. 

  • భారత్‌కు బీఆర్‌ఐ వల్ల ఆర్థికంగానే కాకుండా భౌగోళికంగా, రాజకీయంగానూ ప్రతికూల ప్రభావం ఎదురవుతోంది. పాకిస్థాన్‌ వంటి పొరుగు దేశాల్లో చైనా పెట్టుబడులు సైనికంగా సవాలు విసురుతున్నాయి. చైనా నుంచి ఎదురవుతున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి పాశ్చాత్య దేశాలతోపాటు ఇరుగు పొరుగులను కలుపుకొని పోవడం భారతదేశానికి తప్పనిసరి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.