కలవరపెడుతున్న ముడిచమురు ధరలు

పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు, ప్రజా జీవనం సాఫీగా సాగడానికి ఇంధనమే చోదకశక్తి. కొన్ని నెలలపాటు నిలకడగా ఉన్న ముడి చమురు ధరలు ఇటీవల మళ్ళీ ఎగబాకాయి. దాంతో చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో కలవరం మొదలైంది.

Updated : 09 Oct 2023 17:32 IST

పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు, ప్రజా జీవనం సాఫీగా సాగడానికి ఇంధనమే చోదకశక్తి. కొన్ని నెలలపాటు నిలకడగా ఉన్న ముడి చమురు ధరలు ఇటీవల మళ్ళీ ఎగబాకాయి. దాంతో చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో కలవరం మొదలైంది.

రష్యా, సౌదీ అరేబియాలు ఈ ఏడాది డిసెంబరు వరకు తమ చమురు ఉత్పత్తిని రోజుకు 13లక్షల పీపాల చొప్పున తగ్గించాలని గత జులైలో నిశ్చయించాయి. అప్పటి నుంచి వాటి ధరలు పెరుగుతున్నాయి. నిరుడు అక్టోబరు నుంచి 75-85 డాలర్లుగా ఉన్న పీపా చమురు ధర సెప్టెంబరు చివరిలో 94 డాలర్లకు పెరిగింది. దాంతో అది 100 డాలర్లకు చేరనుందన్న విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. చమురు గిరాకీని తగ్గించడానికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతాయనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఇంధన ధరల జోరు కాస్త నెమ్మదించింది.

ఇండియాకు చేదు గుళికలు...

తమ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యీకరించడానికి ఉద్దేశించిన విజన్‌-2030 అమలు కోసం భారీగా నిధులు అవసరమని, అందుకే చమురు ధరలను పెంచక తప్పడంలేదని సౌదీ అరేబియా చెబుతోంది. ఇది అమెరికాకు రుచించడంలేదు. మిత్రదేశం సౌదీపై ఆంక్షలు విధించే అవకాశమున్నట్లు సంకేతాలు ఇస్తోంది. అధిక చమురు ధరలు ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగించడానికి కావలసిన ఆర్థిక దన్నును రష్యాకు ఇస్తాయి. భారతదేశానికి మాత్రం అధిక చమురు ధరలు చేదు గుళికల వంటివి. గడచిన కొన్ని త్రైమాసికాల్లో పెరిగిన తమ లాభాలు అధిక ఇంధన ధరలవల్ల ఆవిరైపోవడం భారతీయ కంపెనీలను కలవరపెడుతోంది. మరోవైపు, వినియోగదారుల నుంచి వస్తుసేవలకు గిరాకీ తగ్గిపోవడం కంపెనీల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది. ఎన్నికల ముందు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు. కాబట్టి, వాహనదారులపై ప్రస్తుతానికి అదనపు భారం పడకపోవచ్చు. మార్కెట్‌లో 90శాతం వాటా ప్రభుత్వ రంగ చమురు సంస్థలదే. పైగా ద్రవ్యోల్బణం ఇప్పుడిప్పుడే కాస్త దిగివస్తోంది. ఇటువంటి తరుణంలో చమురు ధరలను పెంచితే ద్రవ్యోల్బణం మళ్ళీ పెరిగిపోతుంది. దాన్ని విపక్షాలు అస్త్రంగా మార్చుకుని ప్రభుత్వంపై విరుచుకుపడతాయి. వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు.

2022 మే నెలలో పీపా చమురు ధర 85డాలర్లుగా ఉన్నప్పుడు కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. ఇటీవలి నెలల్లో చమురు ధర 80డాలర్లకు దిగివచ్చినా పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించలేదు. తద్వారా పాత నష్టాలను పూడ్చుకోవడానికి, భావి నష్టాలను తట్టుకోవడానికి చమురు సంస్థలకు అవకాశం ఇచ్చినట్లయింది. తన చమురు అవసరాల్లో 85శాతాన్ని దిగుమతి చేసుకునే ఇండియాకు అధిక చమురు ధరలు నష్టదాయకం. పెరిగిన దిగుమతుల బిల్లు చెల్లించడానికి ప్రభుత్వం వద్దనున్న విదేశ మారక ద్రవ్య నిల్వలను కరిగించాల్సి వస్తుంది. అదే సమయంలో కుటుంబాల ఆదాయానికీ గండి పడుతుంది. అసలే పెరిగిన ఆహార ధరలతో సతమతమవుతున్న భారతీయులు అధిక చమురు ధరలవల్ల మరిన్ని అగచాట్ల పాలవుతారు. చేతిలో డబ్బు మిగలక ఇతర వస్తుసేవలపై ఖర్చులను తగ్గించుకుంటారు. ఫలితంగా గిరాకీ తగ్గిపోయి కంపెనీల ఉత్పత్తి క్షీణిస్తుంది. ఇది ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. దీన్ని నివారించడానికి ప్రభుత్వం అధిక చమురు ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా తానే భరించాల్సి వస్తుంది. గతంలో పీపా చమురు ధర 60డాలర్ల లోపునకు దిగివచ్చినప్పుడు ఆదా అయిన మొత్తంలో కొద్ది భాగాన్ని మాత్రమే ప్రభుత్వం వినియోగదారులకు పంచింది. కాబట్టి, ఇప్పుడు అధిక ధరలతో వస్తున్న నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. నిరుడు ఆర్జించిన లాభాలను నష్టాల భర్తీకి వెచ్చించాలి.

అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గుల నుంచి మన ఆర్థిక వ్యవస్థను కాపాడే దీర్ఘకాలిక వ్యూహాన్ని ప్రభుత్వం చేపట్టాలి. చమురుకు ప్రత్యామ్నాయాలు కనుక్కోవడం ఈ వ్యూహానికి పునాది కావాలి. ముఖ్యంగా జీవ ఇంధనాలకు, ఎలెక్ట్రిక్‌ వాహనాలకు మారడం ద్వారా ఈ వ్యూహాన్ని విజయవంతం చేసుకోవాలి. దేశంలో విక్రయమవుతున్న మొత్తం డీజిల్‌లో 70శాతాన్ని రవాణా రంగమే వినియోగిస్తోంది. ఈ రంగంలో పెద్దయెత్తున ఎలెక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కులను ప్రవేశపెట్టాల్సిన అవసరముంది. ఎలెక్ట్రిక్‌ బస్సు ధరలో 60శాతం రాయితీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన వంతు ప్రోత్సాహమిస్తోంది. ఈ బస్సుల కోసం విరివిగా ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేసి, నగరాల్లో ప్రత్యేక రూట్లను కేటాయించాలి. ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న బస్సుల్లో ఎలెక్ట్రిక్‌ బస్సుల వాటా అయిదు శాతంకన్నా తక్కువే ఉంది.

జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే...

సహజ వాయువు, ఏవియేషన్‌ ఇంధనాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం మంచి పద్ధతి అవుతుంది. దీనివల్ల రాష్ట్రాలకు పెద్ద ఆదాయ నష్టం ఉండదు. తరవాత క్రమంగా ఇతర ఇంధనాలనూ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఇది వినియోగదారులపై భారాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇంధన ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగిస్తే ప్రైవేటు మదుపరుల్లో నమ్మకం పెరిగి దేశార్థికంలోకి కొత్త పెట్టుబడులు ప్రవహిస్తాయి. దీనికి తోడు సౌర, పవన విద్యుత్‌ వంటి పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచాలి. అది వాతావరణ మార్పుల కట్టడికి దోహదపడటంతో పాటు చమురుపై ఆధారపడాల్సిన అగత్యాన్ని నివారిస్తుంది. ఇంధన దిగుమతుల కోసం వెచ్చిస్తున్న విదేశ మారక ద్రవ్యాన్ని పునరుత్పాదక ఇంధనాల ద్వారా ఆదా చేయవచ్చు. ఆ నిధులను మౌలిక వసతుల విస్తరణకు, జీడీపీ వృద్ధికి వినియోగించవచ్చు.


మేలైన ప్రత్యామ్నాయం

దేశంలో వంట గ్యాస్‌, రవాణా సాధనాల కోసం జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచితే చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం జీవ ఇంధనమైన ఇథనాల్‌ను శిలాజ ఇంధనాలతో కలిపి వినియోగిస్తున్నారు. ఇథనాల్‌ను ప్రధానంగా చెరకు మొలాసిస్‌ నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. చెరకు పంటకు నీటిని అధికంగా వాడాలి. వాతావరణ మార్పులతో నీటి లభ్యత తగ్గిపోతున్న సమయంలో మొలాసిస్‌ లభ్యత మీద నమ్మకం పెట్టుకోలేం. దీనికన్నా బొగ్గు నుంచి తీసే మెథనాల్‌ను పెట్రోలు, డీజిల్‌లో కలిపి వినియోగించడం మేలైన ప్రత్యామ్నాయం. జన్యు మార్పులు చేసిన జట్రోఫా పంట సాగును పెంచడం ద్వారా జీవ ఇంధనాన్ని పెద్దయెత్తున ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలు చమురు దిగుమతులను 20శాతం తగ్గించినా, ఏటా 2,000 కోట్ల డాలర్ల విదేశ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.