పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనమెంత?

దేశం నుంచి నల్లధనాన్ని ఏరివేసేందుకు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ ‘క్లీన్‌ నోట్‌’ విధానంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) తాజాగా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించిన గడువు ముగిసినప్పటికీ, మిగిలిపోయిన నోట్లను తమ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది.

Updated : 15 Oct 2023 17:11 IST

దేశం నుంచి నల్లధనాన్ని ఏరివేసేందుకు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ ‘క్లీన్‌ నోట్‌’ విధానంలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) తాజాగా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించిన గడువు ముగిసినప్పటికీ, మిగిలిపోయిన నోట్లను తమ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం 2016లో ఉన్నఫళంగా పెద్ద నోట్లను రద్దు చేసింది. అప్పుడు 500, 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకొంది. దాంతో ఏర్పడ్డ కరెన్సీ కొరతను తీర్చడానికి రూ.2000 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, వాటినీ వినియోగం నుంచి ఉపసంహరించింది. 2016లో చేసిన నోట్ల రద్దు, తాజా నోట్ల ఉపసంహరణ ఒకటి కాదు. ఈ విషయంలో మూడు కీలక అంశాలు ఉన్నాయి. ఒకటోది: నాడు కేంద్రం ఎలాంటి కాలవ్యవధి ఇవ్వకుండానే అనూహ్యంగా పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ సారి మాత్రం సుమారు 130 రోజుల గడువు ఇచ్చింది. రెండోది: నాడు రద్దయిన నోట్ల విలువ అప్పుడు చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీలో 86శాతం. తాజాగా ఉపసంహరించిన రూ.2000 నోట్ల విలువ 10.5శాతమే. అందువల్లే ఈసారి ప్రజలకు పెద్ద అసౌకర్యమేమీ కలగలేదు. మూడోది: అప్పట్లో నోట్ల రద్దు సందర్భంగా డబ్బుల కోసం ప్రజలు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏటీఎంలు, బ్యాంకుల వద్ద బారులుతీరారు. గంటల తరబడి క్యూలో నిలబడినవారిలో సుమారు 150 మంది చనిపోయినట్టు సమాచారం. ఈసారి తగినన్ని రూ.50, 100, 200, 500 నోట్లు చలామణీలో ఉండటం, డిజిటల్‌ చెల్లింపులు విరివిగా జరుగుతుండటంతో ఆర్థిక కార్యకలాపాలకు ఎటువంటి విఘాతం కలగలేదు.

డిజిటల్‌ చెల్లింపుల జోరు

రిజర్వ్‌ బ్యాంకు 2018-19 తరవాత రూ.2000 నోట్ల ముద్రణను నిలిపేసింది. 2017, మార్చి నాటికి వాడుకలో ఉన్న రూ.2000నోట్ల సంఖ్య 32,850 లక్షలు. వాటి విలువ రూ.6,57,000 కోట్లు. మొత్తం కరెన్సీ విలువైన రూ.13,10,200 కోట్లలో ఇది 50.2 శాతం. ఈ ఏడాది మార్చి చివరి నాటికి చలామణీలో ఉన్న రూ.2000నోట్లు విలువ రూ.3.62లక్షల కోట్లు. మొత్తం కరెన్సీ నోట్లలో ఇవి 10.8 శాతమే. దీన్నిబట్టి, ఆర్‌బీఐ ఉద్దేశపూర్వకంగానే ఈ నోట్ల చలామణీని క్రమేణా తగ్గించి ఉండాలి. లేదంటే రాజకీయ నాయకులు తదితరులు భారీస్థాయిలో వాటిని నిల్వ చేసైనా ఉండాలి. రెండూ జరిగి ఉండవచ్చు కూడా.

డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థ వాడుకలోకి రావడంవల్ల కరెన్సీ నోట్ల అవసరం ప్రజానీకానికి బాగా తగ్గింది. 2020-21లో పరిమాణం పరంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ 26.7శాతమే ఉండేది. 2021-22 నాటికి అది 63.6 శాతానికి ఎగబాకింది. పంపిన వెంటనే డబ్బులు ఖాతాల మధ్య బట్వాడా కావడం (రియల్‌టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌- ఆర్‌టీజీఎస్‌) వల్లే డిజిటల్‌ వేదికల వినియోగం గణనీయంగా పెరిగింది. 2020-21లో రూ.1414.59లక్షల కోట్ల విలువైన డిజిటల్‌ లావాదేవీలు జరిగాయి. ఆ మరుసటి ఏడాది అవి రూ.1,744.14లక్షల కోట్లకు చేరాయి. ఆ మేరకు నోట్ల చలామణీ తగ్గిపోయింది. డిజిటల్‌ చెల్లింపు వ్యవస్థ విస్తరించడానికి కొవిడ్‌ మహమ్మారి సైతం ఒకింత దోహదపడింది. భవిష్యత్తులో డిజిటల్‌ చెల్లింపులు మరింతగా విస్తరించే అవకాశముంది. నోట్ల అవసరం తగ్గుతున్న తరుణంలోనే ప్రభుత్వం రూ.2000 నోట్లను ఉపసంహరించింది. కాబట్టి, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇతర చిల్లర నోట్లను కొత్తగా ఎంతెంత పరిమాణంలో ముద్రించాలన్నది ఆర్‌బీఐ నిర్ణయించుకోవాలి. ఇప్పటికే రూ.22,77,340 కోట్ల విలువైన రూ.500 నోట్లు, రూ.1,20,881 కోట్ల విలువైన రూ.200 నోట్లు, రూ.1,81,421 కోట్ల విలువచేసే రూ.100 నోట్లు వాడుకలో ఉన్నాయి.

సాధారణంగా తక్కువ విలువ ఉన్న నోట్లే ఎక్కువగా చేతులు మారుతుంటాయి. రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన తరవాత... వ్యాపారులు వాటిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. పైగా ఈ నోట్లు వెనక్కి వచ్చిన తరవాత విలువ కోల్పోతాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ వెల్లడించారు. కాబట్టి, రూ.2000 నోట్లను అట్టే పెట్టుకోవడంవల్ల ప్రయోజనమేమీ ఉండదు. వాస్తవానికి పేద, మధ్యతరగతి ప్రజల వద్ద ఈ నోట్లు పెద్దగా ఉండవు. కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, అవినీతిపరుల వద్ద అవి పెద్దమొత్తంలో పోగుపడి ఉండవచ్చు. ఆర్‌బీఐ తాజాగా చేపట్టిన నోట్ల ఉపసంహరణ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా- ఆశించిన స్థాయిలో రూ.2000 నోట్లు వెనక్కి వస్తే బ్యాంకుల్లో నగదు భారీగా పెరుగుతుంది. దానివల్ల తక్కువ వడ్డీకి రుణాలివ్వడం వీలవుతుంది. బ్యాంకుల్లో డిపాజిట్లూ పెరుగుతాయి. ఖరీదైన గృహోపకరణాలు, వెండి, బంగారంతో పాటు స్తిరాస్థి రంగంలోనూ గిరాకీ ఎక్కువవుతుంది. పన్ను ఎగవేతదారుల వివరాలు ఆదాయపన్ను అధికారుల దృష్టికి వస్తాయి.

బహుముఖ చర్యలు

రిజర్వ్‌ బ్యాంకు 2016లో రూ.2000 నోట్ల ముద్రణకు భారీగా వెచ్చించింది. 2021, మార్చి చివరి నాటికి దేశంలో చలామణీలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.28.27లక్షల కోట్లు. అది 2022, మార్చి నాటికి రూ.31.06లక్షల కోట్లకు పెరిగింది. అయితే, నల్లధనాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ చర్యలు చేపడుతోంది. వాటిలో ఎన్నికల సంస్కరణలు, పన్ను సంస్కరణలు, డిజిటలైజేషన్‌, హవాలా కార్యకలాపాలపై నిఘాను తీవ్రతరం చేయడం, అసంఘటిత రంగాల్లో లావాదేవీలను లెక్కల్లోకి తీసుకురావడం వంటివి ఎంతో కీలకంగా నిలుస్తున్నాయి.


ఆర్థిక వృద్ధిపై ప్రభావం

నల్లధనాన్ని ఏరివేసేందుకు 2016లో చేపట్టిన నోట్ల రద్దువల్ల ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరలేదనే చెప్పాలి. అయితే, ఎవరెవరు పెద్ద నోట్లను భారీయెత్తున బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారన్నది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దొంగ నోట్ల చలామణీ, ఉగ్రవాద కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటివి తగ్గుముఖం పట్టాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. దాచిపెట్టిన పెద్ద నోట్లు వెలుగులోకి వచ్చాయి. అయితే, నోట్ల రద్దు నిర్ణయంవల్ల ఆర్థిక వృద్ధి నెమ్మదించింది. దానికి కరోనా మహమ్మారి తోడవడంతో ఇబ్బందులు తప్పలేదు. అయినప్పటికీ, ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలతో ఆర్థిక వ్యవస్థ ప్రగతి బాట పట్టడంతో పాటు వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.