ఆదాయాల తెగ్గోత... పొదుపులో క్షీణత

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఇటీవలి నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం భారతదేశ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు-దేశ మొత్తం జీడీపీలో 5.1శాతం. ఇది గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే దీనికి ప్రధాన కారణాలు.

Updated : 15 Oct 2023 17:14 IST

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఇటీవలి నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం భారతదేశ కుటుంబాల నికర ఆర్థిక పొదుపు-దేశ మొత్తం జీడీపీలో 5.1శాతం. ఇది గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువ. ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే దీనికి ప్రధాన కారణాలు.

భారత్‌లో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు గత దశాబ్ద కాలంలో ఏ సంవత్సరమూ ఏడు శాతానికి తగ్గలేదు. 2021-22లో అది 7.2శాతం. గత ఆర్థిక సంవత్సరం మాత్రం ఆ పొదుపు 5.1శాతానికి పడిపోయింది. సంవత్సర కాలంలో ఒక కుటుంబం సమకూర్చుకున్న ఆస్తులు, చేసిన అప్పుల మధ్య వ్యత్యాసాన్ని నికర ఆర్థిక పొదుపుగా పరిగణిస్తారు. వీటిలో బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు, ఎల్‌ఐసీ, ప్రావిడెంట్‌, మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌ తదితరాల్లో పెట్టుబడులు, వాటి నుంచి చేసిన అప్పులు ముఖ్యమైనవి. వాస్తవ మొత్తంలో చూడాలంటే, 2021-22లో దేశీయ కుటుంబాల నికర పొదుపు రూ.16.9 లక్షల కోట్లు. 2022-23లో అది రూ.13.75 లక్షల కోట్లకు పడిపోయింది. 2021-22లో కుటుంబాల ఆస్తులు జీడీపీలో దాదాపు 11 శాతం ఉంటే, 2022-23లో 10.9శాతానికి తగ్గాయి. అప్పులు మాత్రం ఆ రెండేళ్లలో 3.8శాతం నుంచి 5.8శాతానికి పెరిగాయి.

మౌలిక వసతుల కల్పనకు విఘాతం

గత దశాబ్దకాలంలో ఇలా ఒక్కసారిగా భారత్‌లో కుటుంబాల నికర పొదుపు తగ్గిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది, ముఖ్యమైంది ద్రవ్యోల్బణం. సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అయ్యాయి. అనేక వస్తువుల సరఫరాలకు అడ్డంకులు ఏర్పడి, వాటి కొరతతో ప్రతి దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. భారత్‌పైనా ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా పెట్రో ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో చిల్లర ధరల ద్రవ్యోల్బణం దాదాపు 6.8శాతంగా ఉంది. రిజర్వు బ్యాంకు విధించుకున్న ద్రవ్యోల్బణ పరిమితి రెండు నుంచి ఆరు శాతం. పరిమితులు దాటిన ద్రవ్యోల్బణం ప్రజల నికర ఆదాయాలను తగ్గించి, వారి కొలుగోలు శక్తిని దెబ్బతీస్తుంది. ఇక ప్రజల పొదుపు తగ్గిపోవడానికి రెండో కారణం- నిరుద్యోగం. జాతీయ శాంపిల్‌ సర్వే లెక్కల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశీయంగా నిరుద్యోగం 6.8శాతంగా ఉంది. కొవిడ్‌ కాలంలో మిన్నంటిన నిరుద్యోగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రెండూ కలిసి కుటుంబాల ఆర్థిక స్థితిని దెబ్బతీశాయి. పొదుపు తగ్గిపోవడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల దేశార్థికంపైనా ప్రభావం పడుతుంది. తగినంత ధనం పొదుపు ఖాతాల్లో లేకుంటే వివాహాలు, అకస్మాత్తు అనారోగ్యం, పిల్లల చదువులు తదితరాలకు కుటుంబాలు మరింతగా అప్పులు చేయాల్సి వస్తుంది. బడ్జెట్లలో ఆర్థిక లోటును అధిగమించడానికి బ్యాంకులు, ఎల్‌ఐసీ, పోస్టాఫీస్‌ తదితరాల్లో ప్రజలు దాచుకున్న సొమ్మును ప్రభుత్వాలు అప్పుగా తీసుకుంటాయి. ఈ ఏడాది కేంద్ర పద్దులో ఆర్థిక లోటు జీడీపీలో 5.9శాతంగా లెక్కించారు. దీన్ని పూడ్చడానికి మార్కెట్‌ నుంచి రూ.11.8 లక్షల కోట్లు, చిన్న పొదుపు మొత్తాల నుంచి రూ.3.6 లక్షల కోట్లు అప్పుగా తీసుకోవాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. కుటుంబాల పొదుపు తగ్గిపోయినందువల్ల ప్రభుత్వాలకు సరిపడా రుణాలు సేకరించడం సాధ్యం కాదు. దానివల్ల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు వేసుకున్న ప్రణాళికలకు విఘాతం కలుగుతుంది.

ఆర్థిక అసమానతలు

మన ఆర్థిక వ్యవస్థ త్వరలోనే అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత జీడీపీ వృద్ధి ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఒక వైపు మన జీడీపీ పెరుగుతుంటే, మరోవైపు ప్రజల్లో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. ఆక్స్‌ఫామ్‌ సంస్థ నివేదిక ప్రకారం దేశ సంపదలో 77శాతం పై అంచెలో ఉన్న 10శాతం ధనవంతుల చేతిలో ఉంది. ప్రస్తుతం ఇండియాలో 119 మంది శత కోటీశ్వరులు ఉన్నారు. వారి సంపద గత పదేళ్లలో 10 రెట్లు పెరిగింది. మరోవైపు వైద్య ఖర్చులు భరించలేక దేశీయంగా ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. ఇండియాలో ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలపైనా సరైన దృష్టి సారించాలి. లేకుంటే, ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి. ప్రభుత్వ ఆదాయాలూ పడిపోయి, దేశ ఆర్థిక పురోగతి దెబ్బతింటుంది.


తీవ్ర భారం

భారత్‌లో కుటుంబాల అప్పులు పెరగడానికి కారణం వినియోగదారుల ప్రాధాన్యాలు మారడమేనని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. ప్రజలు అప్పులు చేసి మరీ ఇళ్లు, కార్లు తదితర ఆస్తులు సమకూర్చుకుంటున్నారని ఆ శాఖ అంటోంది. అందులో కొంత నిజం లేకపోలేదు. కొవిడ్‌ తరవాత బ్యాంకులు దూకుడుగా ఇళ్లు, కార్ల లోన్లు ఇస్తున్నాయి. బ్యాంకులు ఇచ్చిన మొత్తం అప్పుల్లో గృహ రుణాల వాటా 2012లో 8.6శాతం. 2023 నాటికి అది 14.2శాతానికి పెరిగింది. 2021-22లో విక్రయమైన ప్రయాణికుల వాహనాలు 30.70 లక్షలు. 2022-23లో అవి 38.90 లక్షలకు పెరిగాయి.కేవలం గృహాలు, వాహనాల కొనుగోళ్లు మాత్రమే పెరిగిన కుటుంబాల అప్పులకు, తగ్గిన పొదుపునకు కారణం కాదు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో తగ్గుతున్న నిజ ఆదాయాలు, కుటుంబ అవసరాలకు చేసే రుణాలు సైతం నికర పొదుపు మొత్తాల్లో క్షీణతకు దారితీస్తున్నాయి. దేశీయంగా విద్య, వైద్యం క్రమేణా ప్రైవేటు పరం అవుతున్నాయి. వాటిపై వ్యయం వల్ల కుటుంబాల అప్పులు పెరుగుతున్నాయి. వైద్య వ్యయంలో ప్రభుత్వ ఖర్చు 47.1శాతం. ప్రజలు తమ జేబుల నుంచి 47శాతానికి పైగా భరించాల్సి వస్తోంది. ప్రైవేటు బడుల అధిక ఫీజులపైనా ఇటీవల చాలాచోట్ల గగ్గోలు రేగుతోంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం దేశంలో ప్రజలు తీర్చాల్సిన విద్యారుణాలు 2021-22లో రూ.82,723 కోట్లు. 2022-23లో అవి రూ.96,847 కోట్లకు పెరిగాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.