తలసరి ఆదాయంలో మనమెక్కడ?

ప్రపంచ ప్రజల సగటు తలసరి ఆదాయం 13,800 డాలర్లు. ఇది చైనా తలసరి ఆదాయానికి దాదాపు సమానం. భారత్‌లో తలసరి ఆదాయం 2,600 డాలర్లే! పైగా డ్రాగన్‌ దేశ జనాభాను ఇండియా మించిపోయింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నభారత్‌- అందుకు ఎంతగానో కృషి చేయాల్సి ఉంది.

Updated : 15 Oct 2023 17:15 IST

ప్రపంచ ప్రజల సగటు తలసరి ఆదాయం 13,800 డాలర్లు. ఇది చైనా తలసరి ఆదాయానికి దాదాపు సమానం. భారత్‌లో తలసరి ఆదాయం 2,600 డాలర్లే! పైగా డ్రాగన్‌ దేశ జనాభాను ఇండియా మించిపోయింది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నభారత్‌- అందుకు ఎంతగానో కృషి చేయాల్సి ఉంది.

స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పరంగా అగ్రగాములుగా ఉన్న దేశాలు వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థలతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతంగా వెలుగొందుతున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో ఆ దేశాల వాటా చాలా ఎక్కువ. ఏటికేడు వాటి ర్యాంకులు మారుతూ ఉండవచ్చుకానీ, ప్రపంచ ఆర్థికాన్ని తీర్చిదిద్దడంలో వాటి పాత్ర చాలా ప్రబలమైనది. ఆర్థికంగా అమెరికా, చైనా, జపాన్‌లు ప్రపంచంలో తొలి మూడు స్థానాలను ఆక్రమిస్తున్నాయి. 2022 నాటి గణాంకాల ప్రకారం- అమెరికా జీడీపీ సుమారు 25.5లక్షల కోట్ల డాలర్లు. చైనాది 18.1లక్షల కోట్ల డాలర్లు. జపాన్‌ జీడీపీ 4.2లక్షల కోట్ల డాలర్లు. తలసరి ఆదాయం విషయానికి వస్తే 76,399 డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికా జనాభా 33.83కోట్లు. 142 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనా తలసరి ఆదాయం 12,670 డాలర్లు. 12.33కోట్ల జనాభా కలిగిన జపాన్‌ తలసరి ఆదాయం 33,815 డాలర్లు. ఈ మూడు దేశాల్లో ఎలెక్ట్రానిక్స్‌, ఆటొమొబైల్‌, ఫైనాన్స్‌, పారిశ్రామికోత్పత్తి, సాంకేతికతలు, ఆరోగ్య సేవల రంగాలు ఎంతో పటిష్ఠంగా ఉన్నాయి. విస్తృతస్థాయిలో మౌలిక వసతులు, సానుకూల వ్యాపార వాతావరణం, నిపుణ మానవ వనరులు వాటి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

నిధుల కొరత

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు సమానమైన తలసరి ఆదాయం కలిగి ఉండి, వెనకబడిన దేశాలుగా గుర్తింపు పొందిన మూడింటిని పరిశీలిద్దాం. వాటిలో 69లక్షల జనాభా కలిగిన నికరాగువా వ్యవసాయ ప్రధాన దేశం. ఇది మధ్య అమెరికాలో ఉంది. ఆ దేశ తలసరి ఆదాయం 2,590 డాలర్లు. నిరంకుశ పాలన, ప్రాంతీయ అసమానతలతో నికరాగువా కునారిల్లుతోంది. 9.76 కోట్ల జనాభా గల డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో తలసరి ఆదాయం 2,580డాలర్లు. ఈ ఆఫ్రికా దేశానికి ఆదాయం ప్రధానంగా గనుల నుంచే వస్తోంది. రాగి, కోబాల్ట్‌ ఖనిజాల ఉత్పత్తిలో కాంగో అగ్రగామి. మధ్య ఆసియాలో 3.49 కోట్ల జనాభా కలిగిన ఉజ్బెకిస్థాన్‌ తలసరి ఆదాయం 2,560 డాలర్లు. బంగారు గనులు, పత్తి ఎగుమతులు దీని ప్రధాన ఆదాయ వనరులు. ఎన్నో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసిన భారత్‌లో మాత్రం తలసరి ఆదాయం 2,600 డాలర్లకు మించి పెరగ లేదు!

వనరులను సమర్థంగా ఉపయోగించి వస్తుసేవల ఉత్పత్తి, పంపిణీ, వినియోగాలను పెంచగలిగే దేశాలే ఆర్థికంగా ముందంజ వేస్తాయి. ముడిసరకులను విలువ జోడించిన వస్తువులుగా మార్చినప్పుడు ఎక్కువ ఆదాయం లభిస్తుంది. భారత్‌ దీనిపై దృష్టి సారించాలి. 2026-27 నాటికి జపాన్‌, జర్మనీలను మించిపోయి అయిదు లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని ఇండియా లక్షిస్తోంది. ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే- విధానపరంగా పలు మార్పులు చేర్పులు అవసరం. ముఖ్యంగా, డిజిటల్‌ సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగిస్తూనే సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి. ఆ దిశగా కేంద్రం సరైన అడుగులు వేస్తోంది. ఇప్పటికే 84,000 గుర్తింపు పొందిన అంకుర సంస్థలతో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థగా నిలుస్తోంది. అయితే, నేటికీ కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉండిపోయారు. కొనుగోలుశక్తి తక్కువగా ఉండటంవల్ల వస్తుసేవలపై వారు పెద్దగా ఖర్చు చేయలేకపోతున్నారు. దాంతో వస్తు వినియోగం, ఉత్పత్తి తక్కువగా ఉంటున్నాయి. మరోవైపు, రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి కోసం ఉచితాలపై మితిమీరి ఖర్చు చేస్తున్నాయి. పర్యవసానంగా ఉత్పత్తి కార్యకలాపాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. పెట్టుబడులు పుష్కలంగా లభించినప్పుడు పరిశ్రమలు, వ్యాపార సంస్థలు విస్తరిస్తాయి. వస్తుసేవల ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా ఉపాధి అవకాశాలు విస్తరించి వ్యక్తులు, కుటుంబాల చేతికి డబ్బులు వస్తాయి. అవసరాలు తీర్చుకోగా మిగిలిన సొమ్మును పొదుపు చేస్తారు. ఆ మొత్తాలే పారిశ్రామిక అభివృద్ధికి పెట్టుబడులవుతాయి.

బహుళజాతి సంస్థలు ఏవీ?

గత దశాబ్దంలో చైనా వాస్తవ జీడీపీ వృద్ధి రేటు భారత్‌ కన్నా ఏటా 1.5శాతం ఎక్కువ. పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి, ఎగుమతిలో చైనా అగ్రగామిగా నిలుస్తోంది. మౌలిక వసతుల నిర్మాణం, అధునాతన సాంకేతికతల్లో చైనా సర్కారు భారీగా పెట్టుబడులు పెట్టింది. నేడు అమెరికా, జపాన్‌ల మాదిరిగానే చైనా సైతం అనేక బహుళజాతి సంస్థలకు పుట్టిల్లు. అమెరికాకు చెందిన ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, జపాన్‌కు చెందిన టొయోటా, మిత్సుబిషి, చైనాకు చెందిన లెనోవో, హువావై, హేయర్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో లేవు. జౌళి, ఆభరణాలు, ప్లాస్టిక్‌ వంటి సంప్రదాయ ఎగుమతులకన్నా ఔష ధాలు, ఎలెక్ట్రానిక్స్‌ వంటి ఆధునిక ఎగుమతుల వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడే ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా అభివృద్ధి చెందుతాయి.


గిట్టుబాటు ధరలు కరవు

రానున్న మూడు నాలుగేళ్లలో భారత స్థూల దేశీయోత్పత్తి మూడు లక్షల కోట్ల డాలర్ల నుంచి అయిదు లక్షల కోట్ల డాలర్లకు పెరగాలంటే ఏటా 10శాతం వృద్ధిరేటు సాధించాల్సి ఉంటుంది. అందుకు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు మూడూ కలిసికట్టుగా ముందుకు సాగాలి. ప్రపంచ జీడీపీలో వ్యవసాయ రంగం సగటు వాటా 6.8శాతం. భారత్‌లో అది 20.2శాతం. దేశార్థికానికి ముఖ్యమైన వ్యవసాయంలో ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారికి కనీసం గిట్టుబాటు ధరలైనా అందడంలేదు. ప్రపంచ జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా 30శాతం. భారత్‌లో అది 24.6శాతమే. ఇక సేవా రంగం వాటా ప్రపంచంలో 63శాతం ఉంటే, మన దేశంలో అది 54.8శాతంగా నమోదైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.