ఏ దేశమేగినా... ప్రవాస ఖజానా

మానవుడు మెరుగైన జీవనాన్ని అన్వేషిస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళడం అనాదిగా జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ వలసలు-2024’ నివేదిక... 2020 నాటికి వివిధ దేశాల నుంచి సుమారు 28 కోట్ల మంది ఇతర దేశాలకు వలస పోయినట్లు వెల్లడించింది. వీరిలో అత్యధికులు భారతీయులే! ప్రవాసులవల్ల దేశానికి కొన్నిప్రయోజనాలు చేకూరుతున్నాయి.

Updated : 24 May 2024 06:42 IST

మానవుడు మెరుగైన జీవనాన్ని అన్వేషిస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్ళడం అనాదిగా జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ వలసలు-2024’ నివేదిక... 2020 నాటికి వివిధ దేశాల నుంచి సుమారు 28 కోట్ల మంది ఇతర దేశాలకు వలస పోయినట్లు వెల్లడించింది. వీరిలో అత్యధికులు భారతీయులే! ప్రవాసులవల్ల దేశానికి కొన్నిప్రయోజనాలు చేకూరుతున్నాయి.

భారత విదేశాంగశాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 1,36,01,780 మంది ప్రవాస భారతీయులు, మరో 1,86,83,645 మంది భారత మూలాలు కలిగిన విదేశీ పౌరులు మొత్తం 210 దేశాల్లో నివసిస్తున్నారు. కేవలం ప్రవాస భారతీయులనే పరిగణనలోకి తీసుకుంటే... యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో 34,19,875 మంది, సౌదీ అరేబియాలో 25,92,166 మంది, అమెరికాలో 12,80,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. అసలు మాతృదేశాన్ని వీడి ఇంత మంది విదేశాలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మెరుగైన చదువులు, ఉద్యోగ అవకాశాలు, జీవన స్థితిగతులు, అధిక ఆదాయం కోసమే చాలామంది వలస వెళ్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే యువకులు, మధ్య వయస్కులు, వృద్ధుల జనాభాలో వ్యత్యాసాలు సైతం వలసలకు కారణమవుతున్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. యువకులు అధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి... మధ్య వయస్కులు, వృద్ధులు ఎక్కువగా ఉన్న అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పెరుగుతున్నాయి. భారతీయుల సగటు వయసు 29.5 సంవత్సరాలు. అది ఆస్ట్రేలియాలో 37.9, అమెరికాలో 38.5, బ్రిటన్‌లో 40.6, కెనడాలో 42.4 సంవత్సరాలుగా ఉంది. పనిచేయగల యువకులు అధికంగా ఉన్న దేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలు లేనప్పుడు వారు సహజంగానే అవకాశాలను వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్ళిపోతుంటారు. పర్యావరణ మార్పులతో పాటు తెగలు, సమూహాల మధ్య ఎడతెగని సంఘర్షణలు సైతం వలసలకు దారితీస్తాయి.

దేశాల మధ్య వారధులు

మానవ వలసలను మానవ వనరుల ఎగుమతులుగా పరిగణించవచ్చు. వలస వెళ్ళినవారు ఆర్థికంగా ఎదగడంతోపాటు మాతృదేశానికి కొంత లాభం చేకూరుస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందనేది ఆసక్తికరం. ప్రవాస భారతీయులు మాతృదేశానికి చేకూర్చే అతి పెద్ద ప్రయోజనం వారు స్వదేశానికి పంపే డబ్బు చెల్లింపులు. ప్రపంచ దేశాలన్నింటితో పోలిస్తే మన దేశానికి వచ్చే చెల్లింపులే ఎక్కువ. 2023లో రూ.10లక్షల కోట్ల చెల్లింపులతో ఇండియా ప్రథమ స్థానంలో నిలిచింది. రూ.5.5 లక్షల కోట్లతో మెక్సికో, నాలుగు లక్షల కోట్ల రూపాయలతో చైనా ఆ తరవాతి స్థానాలను ఆక్రమించాయి. ఈ చెల్లింపులు రెండు విధాలుగా ఉంటాయి. మొదటిది: మాతృదేశంలోని తమ కుటుంబాల పోషణకు క్రమం తప్పకుండా పంపే డబ్బులు. రెండోది: మాతృగడ్డపై ఆస్తుల కొనుగోలు, ఇతర పెట్టుబడులకు పంపే సొమ్ము. మొదటి తరహా చెల్లింపులు కుటుంబాల కొనుగోలుశక్తిని పెంచుతాయి. రెండోరకం, దేశంలో మూలధన ఆస్తులను బలోపేతం చేస్తాయి. భారత్‌కు ఇటువంటి చెల్లింపులు ఎక్కువగా అమెరికా, గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్నాయి. వీటివల్ల దేశ కరెంటు ఖాతా లోటు తగ్గుతోంది. కరెంటు ఖాతా అంటే ఎగుమతులు, ప్రవాసులు పంపే డబ్బులు, ఇతర దేశాల్లో పెట్టుబడులపై వడ్డీ రూపంలో దేశానికి సమకూరే మొత్తాలకూ... దిగుమతులు, ఇతర దేశాలకు వడ్డీ చెల్లింపులు, డివిడెండ్ల రూపంలో దేశం నుంచి బయటకు పోయే డబ్బుకూ మధ్య వ్యత్యాసం. ఎన్నారైలు భారత్‌కు పంపే డబ్బులు కరెంటు ఖాతా లోటును తగ్గించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయి. చెల్లింపులకు అయ్యే రుసుములను తగ్గిస్తే ఈ మొత్తాలు మరింతగా పెరుగుతాయి. ప్రస్తుతం చెల్లింపు లావాదేవీల ఖర్చు చెల్లింపు మొత్తంలో ఆరు శాతంగా ఉంది. దాన్ని మూడు శాతానికి తగ్గించాలని ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్దేశించింది. ప్రవాసులు మాతృదేశానికి, వలస దేశాలకు మధ్య బలమైన వారధులుగా పనిచేస్తారు. కీలక రంగాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ వలసదేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతారు. ఆయా దేశాల ప్రజలు, ప్రభుత్వాల అభిమానాన్ని చూరగొనడం ద్వారా తమ మాతృదేశం పట్ల వారికి సానుకూల భావన కలిగేలా చేస్తారు.

భారత ప్రభుత్వం ప్రవాసుల బాగోగుల కోసం అనేక దేశాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటోంది. ఇటువంటి ఒప్పందాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి: లేబర్‌ మ్యాన్‌పవర్‌ ఒప్పందం (ఎల్‌ఎమ్‌ఏ). రెండోది: మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ ఒప్పందం (ఎమ్‌ఎమ్‌పీఏ). మొదటి రకం ఒప్పందం భారతీయ కార్మికులు ఇతర దేశాల్లోకి ప్రవేశించి, పనిచేసుకునే సౌలభ్యం కల్పిస్తాయి. కతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈ వంటి గల్ఫ్‌ దేశాలతో భారత్‌కు ఇటువంటి ఒప్పందాలున్నాయి. ఎమ్‌ఎమ్‌పీఏలు వీసాలు, నివాసం, ఉద్యోగ అవకాశాలు మొదలైన అంశాలకు సంబంధించి ఉంటాయి. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీలతో భారత్‌ ఇటువంటి ఒప్పందాలు చేసుకుంది. అక్రమ వలసల నిరోధానికి, వలసలు క్రమపద్ధతిలో జరగడానికి 1983లోనే వలస చట్టం అమలులోకి వచ్చింది. భారతీయ వలస కార్మికుల ప్రయోజనాలను కాపాడటం దీని ప్రధాన ఉద్దేశం.

దిగిరాని నిరుద్యోగ సమస్య...

సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు వంటివారు విదేశాలకు వెళ్ళిపోవడం వల్ల దేశానికి నష్టం జరుగుతుందనే వాదన ఎప్పటినుంచో ఉన్నది. చదువు, నైపుణ్యాలకు తగిన అవకాశాలు దేశంలో లభించకపోవడంవల్లే వారు విదేశాలకు వెళ్తున్నారనేది వాస్తవం. వలసవెళ్ళిన వారిలో కొందరు ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో శిఖరాగ్రాలకు చేరుకుంటున్నారు. దేశార్థికం వేగంగా పెరుగుతున్నప్పటికీ, నిరుద్యోగ సమస్య మాత్రం ఆశించినంతగా తగ్గడంలేదు. కాబట్టి భారత్‌ నుంచి వలసలు ఇక ముందూ కొనసాగుతాయి. అవి కొనసాగినంతకాలం, ప్రవాస భారతీయులకు ప్రభుత్వం అన్నిందాలా సహాయపడాలి. వారి చెల్లింపులతో దేశార్థికం లాభపడుతోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.


మున్ముందు విదేశాల్లో కొలువు కష్టమే!

బ్యాంకుల్లో ‘ఎన్నారై డిపాజిట్‌’ రూపంలో దేశానికి డబ్బులు సమకూరుతున్నాయి. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో ఎన్నారై డిపాజిట్లు సుమారు రూ.12.30లక్షల కోట్లకు చేరాయి. ప్రవాసుల చెల్లింపులు కొన్ని ఒడుదొడుకులకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధిరేటు తక్కువగా ఉండటంవల్ల ఆర్థిక వ్యవస్థలు కుంటువడుతున్నాయి. దేశాలన్నీ తమ పరిశ్రమలను బయటి ఉత్పత్తుల నుంచి రక్షించుకోవడానికి, ఉద్యోగాలు కాపాడుకోవడానికి దిగుమతి సుంకాలను పెంచుతున్నాయి. వలసలకు గరిష్ఠ పరిమితులు విధించడం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి మున్ముందు భారతీయులు విదేశాల్లో కొలువులు పొందడం కొంత కష్టతరం కావచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.