పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ఇటీవల నార్వే, స్పెయిన్, ఐర్లాండ్‌ దేశాలు ప్రకటించాయి. తమ నిర్ణయం మే నెల 28 నుంచి అమలులోకి వస్తుందని అవి తెలిపాయి. దీంతో ఐరాసలోని 193 సభ్యదేశాల్లో 143 దేశాలు పాలస్తీనాను గుర్తించినట్లయింది. పాలస్తీనాకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇదే క్రమంలో శాంతిసాధనకు బాటలు పడాలి.

Published : 26 May 2024 00:34 IST

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ఇటీవల నార్వే, స్పెయిన్, ఐర్లాండ్‌ దేశాలు ప్రకటించాయి. తమ నిర్ణయం మే నెల 28 నుంచి అమలులోకి వస్తుందని అవి తెలిపాయి. దీంతో ఐరాసలోని 193 సభ్యదేశాల్లో 143 దేశాలు పాలస్తీనాను గుర్తించినట్లయింది. పాలస్తీనాకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇదే క్రమంలో శాంతిసాధనకు బాటలు పడాలి.

జెరూసలెం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనా ఏర్పడినట్లు పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్‌ఓ) అధ్యక్షుడు యాసిర్‌ అరాఫత్‌ 1988 నవంబరు 15న ప్రకటించారు. అప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు క్రమంగా పాలస్తీనాకు గుర్తింపునిస్తూ వచ్చాయి. 1948 మే నెలలో స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకొన్న ఇజ్రాయెల్‌- 1949లో అమెరికా తదితర దేశాల మద్దతుతో ఐరాసలో పూర్తిస్థాయి సభ్యదేశమైంది. ప్రస్తుతం పశ్చిమాసియాతో పాటు మిగతా ఆసియా, ఆఫ్రికా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాయి. ఐరోపా సమాఖ్య (ఈయూ)లో తొమ్మిది దేశాలే 1988లో పాలస్తీనాకు గుర్తింపునిచ్చాయి. అవి అంతకుముందు సోవియట్‌ కూటమిలో ఉండి తరవాత ఈయూలో చేరాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్‌ వంటి జీ7 దేశాలేవీ గుర్తింపునివ్వలేదు. ఇప్పుడు నార్వే, స్పెయిన్, ఐర్లాండ్‌లు పాలస్తీనాను గుర్తించడంతో మరికొన్ని ఐరోపా దేశాలు సైతం గుర్తింపునిచ్చే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా, జోర్డాన్, తుర్కియే, స్లొవీనియాలు మూడు దేశాల నిర్ణయాన్ని హర్షించాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించడానికి అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదని ప్రకటించాయి. పాలస్తీనాకు ఏకపక్షంగా స్వతంత్ర దేశ హోదా ఇవ్వడంకన్నా ఇజ్రాయెల్, పాలస్తీనాలు పరస్పరం సంప్రదించుకోవడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించడం ఉత్తమమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

ఇజ్రాయెల్‌ దమనకాండ

మొదట్లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పరిశీలక హోదా కలిగిన పీఎల్‌ఓకు 2012 నుంచి శాశ్వత పరిశీలక హోదా లభించింది. జనరల్‌ అసెంబ్లీలో పూర్తిస్థాయి సభ్యత్వం పొంది అంతర్జాతీయ సమాజంలో సమాన హోదా సాధించాలని పాలస్తీనా తపిస్తోంది. సమితి సభ్యదేశాల్లో అత్యధికం పాలస్తీనాకు గుర్తింపునిస్తున్నా, భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో కనీసం తొమ్మిది దేశాలు జనరల్‌ అసెంబ్లీకి సిఫార్సు చేయనిదే పూర్తిస్థాయి సభ్యత్వం లభించదు. భద్రతా మండలిలో మెజారిటీ దేశాలు సిఫార్సు చేసిన తరవాత ఐరాసలోని 193 సభ్య దేశాలు మూడింట రెండొంతుల మెజారిటీతో దాన్ని ఆమోదించాలి. ఈ ఏడాది ఏప్రిల్‌లో అరబ్‌ దేశాల తరఫున అల్జీరియా ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. పాలస్తీనాను ఐరాసలో పూర్తిస్థాయి సభ్య దేశంగా చేర్చుకోవాలని జనరల్‌ అసెంబ్లీకి భద్రతా మండలి సిఫార్సు చేస్తున్నట్లు ఆ తీర్మానం పేర్కొంది. ఏప్రిల్‌ 18న తీర్మానంపై ఓటింగ్‌ జరగ్గా భద్రతా మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 12 అనుకూలంగా ఓటువేశాయి. రెండు దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. చివరికి అమెరికా వీటోతో తీర్మానం వీగిపోయింది. 2011లోనూ భద్రతా మండలిలో ఏకాభిప్రాయం లోపించడంతో పాలస్తీనాకు సమితి సభ్యత్వం లభించలేదు. పాలస్తీనాకు సమితిలో పూర్తిస్థాయి సభ్యత్వం పొందే అర్హత ఉందంటూ ఈ ఏడాది మే తొమ్మిదిన జనరల్‌ అసెంబ్లీ 10వ అత్యవసర సమావేశం తీర్మానించడం పాలస్తీనాకు గొప్ప నైతిక బలాన్నిచ్చింది. తమ సిఫార్సును భద్రతా మండలి సానుకూలంగా పరిశీలించాలని కోరింది. ఈ తీర్మానానికి భారత్‌ సహా 143 దేశాలు మద్దతిచ్చాయి. ఇజ్రాయెల్, అమెరికా, అర్జెంటీనా, చెక్‌ రిపబ్లిక్, హంగరీ, మైక్రొనీసియా, నౌరూ, పలావ్, పాపువా న్యూగినీలు మాత్రమే తీర్మానాన్ని వ్యతిరేకించాయి. 25 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఏది ఏమైనా ప్రపంచ దేశాల్లో అత్యధికం పాలస్తీనాకు రాజకీయ మద్దతు ఇవ్వడం స్వాగతించాల్సిన పరిణామం.

నిరుడు అక్టోబరు ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రదాడిని ప్రపంచం ఖండించినా, దానికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న జాతిహననాన్ని అంతర్జాతీయ సమాజం హర్షించడం లేదు. అయినా జరుగుతున్న పరిణామాల్ని నిలువరించలేకపోతోంది. అందుకే గాజాలో ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. గాజాలో ప్రాణనష్టం, ఆస్తినష్టం నానాటికీ పెరిగిపోతున్నాయి. గాజా పౌరులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలు సైతం సక్రమంగా అందడం లేదు. ఈ ఘాతుకాలను ఆపాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్‌ పెడచెవిన పెడుతోంది. సామూహిక జన హననాన్ని నిషేధిస్తూ 1948లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘిస్తోందని దక్షిణాఫ్రికా చేసిన ఆరోపణలను సైతం ఇజ్రాయెల్‌ ఖాతరు చేయడం లేదు. రఫాపై భారీ దాడికి సమాయత్తమవుతున్న ఇజ్రాయెల్‌ను తన ప్రయత్నం విరమించాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు.

భారీగా ప్రాణనష్టం

ఆగని ఇజ్రాయెల్‌ దాడుల వల్ల పాలస్తీనా శరణార్థులకు ఆహారం, నిత్యావసరాలను ఐక్యరాజ్య సమితి అందించలేకపోతోంది. ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి 1947లో చేసిన తీర్మానాన్ని సైతం ఇజ్రాయెల్‌ ప్రస్తుత నాయకత్వం ఆమోదించడం లేదు. ఆ తీర్మానం పాలస్తీనాను అరబ్, యూదు రాజ్యాలుగా విడదీయాలని పేర్కొంటోంది. జెరూసలెం నగరాన్ని మాత్రం ప్రత్యేక అంతర్జాతీయ ప్రభుత్వం కింద ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలని నిర్దేశిస్తోంది. నిరుడు అక్టోబరులో ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిలో 1,139 మంది మరణించారు. చాలామంది ఇప్పటికీ బందీలుగా ఉన్నారు. తరవాత గాజాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులలో 35,709 మంది ప్రాణాలు కోల్పోయారు. 79,990 మంది గాయపడ్డారు. బందీలందరినీ విడుదల చేసి సంప్రదింపులు, దౌత్యంతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇజ్రాయెల్, పాలస్తీనాలకు భారత్‌  పిలుపిచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ప్రశాంత వాతావరణంలో సుహృద్భావ రీతిలో చర్చలు చేపట్టాలి. ఏళ్లనాటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాల్సిన తరుణమిదే!


బాసటగా భారత్‌

మొదటి నుంచీ పాలస్తీనా స్వతంత్ర ప్రతిపత్తికి ఇండియా మద్దతిస్తోంది. పాలస్తీనా, ఇజ్రాయెల్‌లు స్వతంత్ర దేశాలుగా సహజీవనం సాగించాలన్నది భారత ప్రభుత్వ విధానమని విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రకటించారు. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్‌ దురాక్రమ ణలను ఖండించిన ఐరాస తీర్మానానికి నిరుడు నవంబరులో ఇండియా మద్దతు పలికింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో అమాయక పౌరులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని, నష్టపోతున్నారని ఇటీవల ఐరాస సాధారణ సభ అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు