వరద విధ్వంసం... అభివృద్ధికి విఘాతం

వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో కుండపోత వానలు, వరదల ముప్పు అధికమవుతోంది. ఆకస్మిక వరదల వల్ల మూడేళ్లలో ఇండియాలో ఆరు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.59వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇది దేశంలో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించే బడ్జెట్‌లో మూడో వంతుకు సమానం...

Published : 16 Aug 2022 00:40 IST

పర్యావరణ మార్పుల దుష్పరిణామం

వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో కుండపోత వానలు, వరదల ముప్పు అధికమవుతోంది. ఆకస్మిక వరదల వల్ల మూడేళ్లలో ఇండియాలో ఆరు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.59వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఇది దేశంలో మౌలిక వసతుల కల్పనకు వెచ్చించే బడ్జెట్‌లో మూడో వంతుకు సమానం. ఈ మేరకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రాష్ట్రాల నుంచి సేకరించిన గణాంకాల ఆధారంగా పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. మహారాష్ట్ర, తమిళనాడు వంటి అరడజనుకు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వరద విధ్వంస వివరాలను అందించలేదు. వాటినీ కలిపితే నష్టం మరింత అధికంగా ఉంటుంది. భారీ వర్షాలు, వరదల వల్ల 2020లో 1815 మంది మరణించినట్లు కేంద్రం గతేడాది పార్లమెంటులో ప్రకటించింది. అంతకు ముందు ఏడాది 2,754 మంది అసువులు బాశారు. 1952-2018 మధ్య కాలంలో భారత్‌లో వరదల వల్ల లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సీడబ్ల్యూసీ తేల్చింది. 25 కోట్ల హెక్టార్లలో పంటలు, ఎనిమిది కోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 4.69 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది.

తీవ్ర ముప్పు

జనాభా పెరుగుదల, పట్టణీకరణ, వరద మైదానాల్లో అభివృద్ధి ఇతర ఆర్థిక కార్యకలాపాలు పెరగడం, భూతాపం వంటివి వరదలకు ప్రధాన కారణాలు. వాటిలో భూతాపం పాత్ర ప్రధానమైంది. శిలాజ ఇంధనాల వాడకం, మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు విపరీతంగా విడుదలవుతున్నాయి. ఫలితంగా భూగోళం వేడెక్కి నీరు ఆవిరవడం అధికమవుతోంది. 1981 నుంచి ఒక దశాబ్ద కాలానికి సగటున 0.18 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున భూ ఉష్ణోగ్రతలు పైకి ఎగబాకుతున్నట్లు అంచనా. ఒక డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ, వాతావరణంలోకి చేరే నీటి ఆవిరి ఏడు శాతం అధికమవుతుంది. అది కుండపోత వానలు, వరదలకు కారణమవుతుంది. బంగ్లాదేశ్‌, ఈశాన్య భారతంలో ఈ ఏడాది జూన్‌లో ముందస్తు వర్షాలు, ఆకస్మిక వరదల పాపం పర్యావరణ మార్పులదేనని శాస్త్రవేత్తలు తేల్చారు. అదే సమయంలో ఉత్తర, వాయవ్య, మధ్య భారతంలో వర్షపాతంలో లోటు నెలకొంది. వాతావరణ మార్పుల వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్రస్థాయి వరదలు అధికమవుతున్నాయని, అదే సమయంలో మధ్యస్థాయి వరదలు క్రమంగా తగ్గిపోతున్నాయని గతేడాది ఒక పరిశీలన తేటతెల్లం చేసింది. సముద్రాలు, నదులు వంటి వాటికి దూరంగా ఉన్న ప్రాంతాల్లోనూ ఆకస్మిక వరదల ముప్పు కొన్నేళ్లుగా అధికమైంది. ఇటీవలి వరదలకు తెలంగాణలో రూ.1,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ గోదావరి వరదల   కారణంగా ఇరవై లక్షల మంది ప్రభావితమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పంటలు నీట మునిగి, వ్యవసాయ భూముల్లో ఇసుక, రాళ్లు మేట వేసి రైతులకు తీవ్ర కడగండ్లు మిగిలాయి.

పర్యావరణ మార్పుల వల్ల సముద్ర ఆవరణ వ్యవస్థల్లోనూ తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అరేబియా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల నుంచి 1.4 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగాయి. దానివల్ల తుపానులు 50 శాతం అధికమయ్యాయి. అవి తీవ్ర వరదలకు దారితీస్తున్నాయి. కర్బన ఉద్గారాలను తగ్గించకుంటే ఈ శతాబ్దం చివరి నాటికి హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 3.8 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జడివానలు, భీకర వరదలతో పెను విలయం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు ఈ దశాబ్దం చివరి నాటికి 2.6 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. దానివల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, వ్యవసాయ భూముల నష్టం, తద్వారా ఆహార భద్రతకు ముప్పు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించింది.

కలిసికట్టుగా కృషి

వరదల వల్ల ప్రజలు ప్రాణాలను కోల్పోవడంతో పాటు ఆస్తులు, మౌలిక వసతులు, జీవనోపాధి వ్యవస్థలు దెబ్బతింటాయి. పేదరిక నిర్మూలనలో దశాబ్దాలుగా సాధించిన ఫలితాలను వరదలు నీరుగార్చేస్తాయి. వాటి నుంచి విముక్తి పొందాలంటే వాతావరణ మార్పులను కట్టడి చేయాల్సిందే. అందుకోసం ప్రపంచం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలి. కర్బన ఉద్గారాల కట్టడిలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని దేశాలూ పనిచేయాలి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసి, ప్రజలను అప్రమత్తం చేసేలా ఇండియాలో మెరుగైన సాంకేతిక వ్యవస్థలను రూపొందించుకోవడం కీలకం. పంటలు దెబ్బతిన్న రైతులకు సరైన నష్టపరిహారం అందించడంతోపాటు అధిక వర్షాలకు తట్టుకొనే వంగడాలను అభివృద్ధి చేసుకోవడమూ తప్పనిసరి.

- ఎం.అక్షర

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని