ఒత్తిడిలో వైద్యులు

వైద్యుల్లో ఏటా పెరుగుతున్న ఆత్మహత్యలు కలవరపెట్టే పరిణామం. బలవన్మరణాలకు పాల్పడేవారిలో సాధారణ ప్రజానీకం కన్నా వైద్య రంగానికి చెందిన వారి సంఖ్యే అధికమని, ఆత్మహత్యకు ఉసిగొల్పే పరిస్థితులు వైద్యులు, వైద్య విద్యార్థుల్లో రెండున్నర రెట్లు అధికంగా ఉంటున్నట్లు పలు అధ్యయనాల

Published : 18 Aug 2022 01:38 IST

పెరుగుతున్న ఆత్మహత్యలు

వైద్యుల్లో ఏటా పెరుగుతున్న ఆత్మహత్యలు కలవరపెట్టే పరిణామం. బలవన్మరణాలకు పాల్పడేవారిలో సాధారణ ప్రజానీకం కన్నా వైద్య రంగానికి చెందిన వారి సంఖ్యే అధికమని, ఆత్మహత్యకు ఉసిగొల్పే పరిస్థితులు వైద్యులు, వైద్య విద్యార్థుల్లో రెండున్నర రెట్లు అధికంగా ఉంటున్నట్లు పలు అధ్యయనాల సారాంశం. 2016-18 మధ్య 18-30 వయసులోని పలు రంగాలకు చెందిన వృత్తి నిపుణుల్లో 3,100 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, వీరిలో అత్యధికంగా వైద్యులేనని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. వైద్య కళాశాలల్లో తరచూ ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నా వాటికి సంబంధించిన గణాంకాలు లేకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం.

కారణాలు అనేకం...

వైద్య విద్య అభ్యసించడం, గొప్ప వైద్యులుగా పేరు గడించాలనే ఒత్తిడి ప్రధాన కారణంగా నిలుస్తున్నా- వైద్యులు, వైద్య విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసే సంక్లిష్ట కారణాలు ఎన్నో ఉంటున్నాయి. వైద్యులు, రోగుల నిష్పత్తి అతి తక్కువగా ఉండటంతో వైద్యులు, జూనియర్‌ వైద్యులపై అలవికాని భారం పడుతోంది. అది విపరీతమైన మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రతి వైద్యుడూ ఆరు గంటల వ్యవధిలో సగటున రెండు వందల మంది రోగులకు చికిత్స అందించాల్సి వస్తోంది. అది సమస్య తీవ్రతను పెంచుతోంది. వైద్య చికిత్సకు సరైన ఉపకరణాల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు కనీస సదుపాయాలు (విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, నాణ్యమైన ఆహారాన్ని అందించే భోజనశాలలు) లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏకబిగిన 24 నుంచి 36 గంటల పాటు సేవలు అందించేలా ఒత్తిడి పెంచడం వల్ల వైద్యుల శారీరక ఆరోగ్యం దెబ్బతింటోంది. పలు మానసిక రుగ్మతలకూ దారితీస్తోంది. ఒత్తిడిలోనూ సమర్థంగా విధులు నిర్వహించాలనే నిశ్చితాభిప్రాయం వైద్య రంగంలో బలంగా వేళ్లూనుకొని ఉంది. దీంతో చికిత్స మాట అటుంచి, చాలామంది వైద్యులు తాము ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి చర్చించడానికి కూడా విముఖత చూపే పరిస్థితి నెలకొంది. విధి నిర్వహణలో సీనియర్‌ వైద్యుల నుంచి నిరంతర బెదిరింపులు, ఆధిపత్య ధోరణి, మహిళా వైద్యుల పట్ల లైంగిక వేధింపులు సమస్యలుగా మారాయి. రోగుల బంధువుల నుంచి ఎదురయ్యే భౌతిక దాడుల వంటి భయాందోళనలూ చాలామంది వైద్యులను ఆత్మహత్య దిశగా అడుగులు వేయిస్తున్నాయి. వైద్యుల ఆత్మస్థైర్యాన్ని కొవిడ్‌ మహమ్మారి మరింతగా దిగజార్చింది. కనీస సదుపాయాలు లేకపోయినా ఎక్కువ సమయం విధులు నిర్వహించాల్సి రావడం, ఒంటరి జీవితం, మహమ్మారి నుంచి పొంచి ఉన్న భయాందోళన... చాలామంది వైద్యుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు తక్కువ సీట్లు ఉండటం, పోటీ విపరీతంగా ఉండటం, ప్రవేశానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాల్సి రావడం వైద్యుల్లో మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఒప్పంద ప్రభుత్వ వైద్యులు, రెసిడెంట్‌ వైద్యులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా వేధించడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిపాటిగా మారుతోంది.

స్పందించే యంత్రాంగం అవసరం

భారతీయ వైద్య సమాఖ్య వైద్యుల బలవన్మరణాలను తగ్గించేందుకు పలు చర్యలకు రూపకల్పన చేసింది. ‘డాక్టర్స్‌ ఫర్‌ డాక్టర్స్‌’ కార్యక్రమం, స్వీయ-సహాయ అవగాహన కార్యశాలలు నిర్వహించడంతో పాటు 24/7 హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. వైద్య విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచేందుకు 2019లో మానసిక ఆరోగ్య మార్గదర్శకాలనూ రూపొందించింది. వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానసిక కౌన్సెలింగ్‌,  చికిత్స కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించడం అత్యంత ఆవశ్యకం. ర్యాగింగ్‌ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకొన్న తరహాలో సీనియర్లు, అధికారుల నుంచి నిరంతరం ఎదురయ్యే బెదిరింపులు, ఆధిపత్య ధోరణి, లైంగిక వేధింపులతో పాటు వైద్యులపై భౌతిక దాడులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. వేధింపులకు గురయ్యే వైద్యుల సమస్యల పట్ల స్పందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ సీట్లతోపాటు, వైద్య కోర్సుల సీట్లను, ప్రభుత్వ వైద్యుల సంఖ్యను పెంచితే పని ఒత్తిడి తగ్గించినట్లవుతుంది. ఎంబీబీఎస్‌ అర్హత మాత్రమే కలిగిన వైద్యుల కనీస వేతనాన్ని సవరించి- వారి ఆర్థిక భద్రతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మౌలిక వసతుల కల్పన, సుదీర్ఘ పని గంటల వ్యవధిని తగ్గించి, విధుల నిర్వహణకు అనువైన వాతావరణం ఏర్పరచాలి. వేధింపులు, భౌతిక దాడుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థకు రూపకల్పన జరిగితే- వైద్యుల ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.