నైతిక ప్రమాణాలకు తిలోదకాలు

గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై హేయ కృత్యానికి ఒడిగట్టిన దుర్మార్గులు ప్రభుత్వం చొరవతో జైలు నుంచి విడుదలయ్యారు. దాన్ని ఆలోచనాపరులంతా ముక్తకంఠంతో ఖండించారు. నైతిక విలువలకు మన్నన దక్కేలా, నేరస్థులకు ఎలాంటి మద్దతు అందకుండా జనావళి బలంగా తమ గళాన్ని వినిపించాలి.

Published : 03 Oct 2022 00:48 IST

గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై హేయ కృత్యానికి ఒడిగట్టిన దుర్మార్గులు ప్రభుత్వం చొరవతో జైలు నుంచి విడుదలయ్యారు. దాన్ని ఆలోచనాపరులంతా ముక్తకంఠంతో ఖండించారు. నైతిక విలువలకు మన్నన దక్కేలా, నేరస్థులకు ఎలాంటి మద్దతు అందకుండా జనావళి బలంగా తమ గళాన్ని వినిపించాలి.

గుజరాత్‌లో రెండు దశాబ్దాల కిందట గోద్రా రైలు దహనం అనంతరం అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారానికి ఒడిగట్టిన నరరూప రాక్షసులు ఇటీవల కారాగారం నుంచి విడుదలయ్యారు. బానో కుటుంబ సభ్యులను సైతం వారు దారుణంగా హతమార్చారు. అత్యాచారం, హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన పదకొండు మందిని గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది. దోషుల్లో ఒక వ్యక్తి తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని ఉన్నత న్యాయపాలిక గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిందితులందరికీ క్షమాభిక్ష ప్రసాదించాలని సిఫార్సు చేసింది. ఆ మేరకు దోషులంతా విడుదలయ్యారు. ఈ చర్య సభ్య సమాజానికి సిగ్గుచేటు. దోషులు సంస్కారవంతులని కమిటీలోని ఓ వ్యక్తి వ్యాఖ్యానించడం హేయం. జైలు నుంచి విడుదలయ్యాక వారికి పూల దండలతో స్వాగతం పలకడం మరింత దారుణం. మహాత్మా గాంధీ స్వయంగా నైతిక విలువలకు నిలువెత్తు రూపం. అలాంటి మహా మనీషి జన్మభూమి అయిన గుజరాత్‌ నేడు ఘోరమైన నేరాలకు పాల్పడేవారి పట్ల మౌనంగా ఉండిపోవడం సిగ్గుపడాల్సిన విషయం. మనం ఎలాంటి సమాజంలో జీవించాలని కోరుకుంటున్నామన్నది తేల్చుకోవాల్సిన సమయమిది.

తామంతా ఒక భావజాలానికి సంబంధించిన వారము కాబట్టే, తమను కేసులో కుట్రపూరితంగా ఇరికించారని జైలు నుంచి విడుదలైన దోషుల్లో ఒక వ్యక్తి వ్యాఖ్యానించాడు. రాజకీయాలకు తాము బలయ్యామనీ మరొకడు చెప్పుకొచ్చాడు. ఈ మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్ముతారనుకోవడం వారి భ్రమే. గోద్రా కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఇతర ఖైదీల్లో చాలా మంది తక్కువ తీవ్రత ఉన్న నేరాలకు పాల్పడినవారే. వారిని ఎందుకు విడు దల చేయలేదని న్యాయవాది నరేంద్ర పర్మార్‌ ప్రశ్నించారు. దోషుల విడుదలపై నిర్ణయం తీసుకున్న కమిటీ సమావేశ వివరాలను అందించాలని పాత్రికేయుడు రజాక్‌ మన్సూరీ సమాచార హక్కు చట్టం కింద అర్జీ దాఖలు చేశారు. నెల రోజులు గడిచినా దానికి ఇంకా ఎలాంటి సమాధానం లభించలేదు. దోషుల్లో ఒకరు మాత్రమే శిక్ష తగ్గించాలని కోర్టును అభ్యర్థిస్తే, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన పేరిట పదకొండు మందినీ వదిలేశారు. మహిళల పట్ల మన దృక్పథం మారాలని, వారి గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలని ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఘనమైన సందేశం ఇచ్చిన రోజే ఆ దుర్మార్గులు స్వేచ్ఛగా సమాజంలోకి విడుదలయ్యారు. ఎన్నికలకు ముందు వారిని విడుదల చేయడం ద్వారా గుజరాత్‌ పాలకపక్షం ఏమి ఆశిస్తోంది? దానివల్ల రాజకీయంగా వారు లాభపడవచ్చు. కానీ, ఇది ప్రమాదకర పరిణామం.

దేశీయంగా విభజన రాజకీయాలు ప్రజల మనస్సాక్షిని క్రమంగా ప్రభావితం చేస్తున్నాయి. జరిగిన సంఘటనను బట్టి కాకుండా కులం, మతం ప్రాతిపదికగా ప్రజల దృక్పథాలను ఏమార్చే విధానాలు కొనసాగుతున్నాయి. ఇవి నెమ్మదిగా ప్రజలను ఎలాంటి ఘటనలకు స్పందించకుండా చేస్తాయి. మనుషుల్లో సహానుభూతిని చంపేస్తాయి. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఒక వర్గం ప్రజలతో పాటు కీలకమైన స్థానాల్లో ఉన్నవారు సైతం ఆధిపత్య భావజాలాన్ని దృఢమైన జాతీయవాదంగా భ్రమపడుతుండటంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. ఈ విభజన, దురభిమాన రాజకీయాల వల్ల స్నేహి తులు, బంధువుల మధ్యా, ప్రజల నడుమా దూరం పెరుగుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం తమను తప్పుదారి పట్టిస్తున్నట్లు చాలామంది గ్రహించడంలేదు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడకుంటే నైతిక విలువలు, ప్రమాణాలు అధఃపాతాళంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. మానవత్వం మనుగడ సాగించేలా, నైతిక విలువలకు మన్నన దక్కేలా, అమాయకులు సురక్షితంగా ఉండేలా, నేరస్థులకు ఎలాంటి మద్దతు దక్కకుండా ప్రజలు తమ గళం వినిపించాల్సిన అవసరం ఉంది. అప్పుడే బిల్కిస్‌ బానోకు జరిగిన అన్యాయం మరొకరికి ఎదురుకాకుండా నివారించడానికి అవకాశం లభిస్తుంది.

- సందీప్‌ పాండే
(రచయిత- రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.