వ్యాకరణ దిగ్గజం

తెలుగు భాషా చరిత్రలో తన బాల వ్యాకరణం ద్వారా పరవస్తు   చిన్నయ సూరి సమున్నత స్థానం అందుకొన్నారు. ఆ వ్యాకరణానికి సాహితీ సౌరభాన్ని అద్దిన సౌందర్య భావుకులు దువ్వూరి వేంకట రమణ శాస్త్రి. ఆయన గొప్ప వ్యాకరణవేత్త, పండితులు, అధ్యాపకులు, విమర్శకులు, వక్త. దువ్వూరి వేంకట రమణ శాస్త్రి 1898 మార్చి 25న ప్రస్తుత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామం.

Published : 25 Mar 2023 00:13 IST

నేడు దువ్వూరి 125వ జయంతి

తెలుగు భాషా చరిత్రలో తన బాల వ్యాకరణం ద్వారా పరవస్తు   చిన్నయ సూరి సమున్నత స్థానం అందుకొన్నారు. ఆ వ్యాకరణానికి సాహితీ సౌరభాన్ని అద్దిన సౌందర్య భావుకులు దువ్వూరి వేంకట రమణ శాస్త్రి. ఆయన గొప్ప వ్యాకరణవేత్త, పండితులు, అధ్యాపకులు, విమర్శకులు, వక్త.

దువ్వూరి వేంకట రమణ శాస్త్రి 1898 మార్చి 25న ప్రస్తుత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామం సమీపంలోని మసకపల్లి గ్రామంలో పండిత కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు వర్ధని, పార్వతీశం. పితామహుడు రామచంద్రుడు వేదవేత్త. తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు. వేంకట రమణ శాస్త్రి జగ్గంపేట, తాళ్లూరుల్లో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, తన పినతాత లింగయ్య శాస్త్రి వద్ద సంస్కృత కావ్య నాటకాలు అభ్యసించారు. అనంతరం దంగేడు గ్రామంలో ఉప్పులూరి గంగాధర శాస్త్రి, ద్రాక్షారామంలో కొండయ్య శాస్త్రి, కొంకుదురు గ్రామంలో వేదుల సూర్యనారాయణ శాస్త్రుల వద్ద సంస్కృత వ్యాకరణం (సిద్ధాంత కౌముది) చదువుకున్నారు. విజయనగరం సంస్కృత కళాశాలలో చేరి నాలుగేళ్లు తాతా సుబ్బరాయ శాస్త్రి, ఎస్‌.టి.జి.వరదాచార్యులు, వజ్ఝల చిన సీతారామ శాస్త్రుల వద్ద శిష్యరికం చేసి విద్వాన్‌ పట్టా పొందారు. కొద్దికాలం విజయనగరం, కొవ్వూరుల్లో; చాలాకాలం చిట్టి గూడూరులోనూ సంస్కృత కళాశాలల్లో పనిచేశారు. ఆ తరవాత 1942-1963 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో వ్యాకరణ పండితులుగా సేవలందించారు. 65ఏళ్ల వయసు నాటికి మొత్తం 45 సంవత్సరాల బోధనా వృత్తి సాగించారు. తెలుగు నాట మూడు తరాల సంస్కృతాంధ్ర పండితులెందరో వారికి శిష్య ప్రశిష్యులు.

దువ్వూరి వేంకట రమణ శాస్త్రి పేరు వినగానే బాలవ్యాకరణం చదువుకున్న వారందరికీ ‘రమణీయం’ గ్రంథం గుర్తుకొస్తుంది. దువ్వూరికి అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన రచన ఇది. బాలవ్యాకరణానికి అప్పటికే కొన్ని టీకలు ఉన్నప్పటికీ ఆ తీరులో వ్యాఖ్యాన రూపంగా కాకుండా సమీక్షగా ఈ గ్రంథాన్ని రాశారు. కావ్య నాటకాల్లా వ్యాకరణం ఆకర్షణీయమైన అంశం కాదు. అయితే, ఆ శాస్త్రాన్ని ఆకట్టుకునే శైలిలో బోధించడంలో విశేష ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శించారు. ‘రమణీయం’ గ్రంథం విశ్వవిద్యాలయ స్థాయిలో చిరస్మరణీయంగా నిలిచింది. దువ్వూరి వారి ప్రతిభకు మరో ప్రబల దృష్టాంతం ఉంది. చిన్నయ సూరి 18 ఏళ్లు అహోరాత్రాలు కృషిచేసి సంతరించిన బాలవ్యాకరణాన్ని శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి కవి సంస్కృతీకరించి ‘హరికారికావళి’ అనే పేరుతో ప్రకటించారు. హరికారికావళే మూల గ్రంథమని, దానికి తెనిగింపే బాలవ్యాకరణమని కొందరు ఒక వాదం లేవదీశారు. దువ్వూరి ప్రామాణిక నిదర్శనాలతో బాలవ్యాకరణమే స్వతంత్రమైన మూల గ్రంథమని, ‘హరికారికావళి’ దానికి అనువాదమని సిద్ధాంతీకరించారు. ఈ మేరకు 40 పేజీల వ్యాసాన్ని 1993లో ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రికలో ప్రకటించారు. అపూర్వ కథా సంవిధానభరితమైన పింగళి సూరన కళా పూర్ణోదయ ప్రబంధాన్ని సరసమైన వచనంలో ‘కలభాషిణి’ పేరుతో రచించారు. ఈ పుస్తకం ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. విద్యార్థులకు చాలా కాలం పాఠ్యగ్రంథంగా ఉంది. కొల్లూరి సోమశేఖర శాస్త్రితో కలిసి ‘న్యాయ దర్శనం’ (ప్రథమ భాగం) దువ్వూరి ఆంధ్రీకరించారు. తన ‘స్వీయ చరిత్ర’ను సైతం రాసుకున్నారు. ఇది వారి జీవిత విశేషాలకే కాకుండా సమకాలీన సాహిత్య సామాజిక రంగాలకు అద్దం పట్టింది. గురు సంపద, శిష్య సంపద, మిత్ర సంపద తనకు జీవితంలో లభించిన పెన్నిధులుగా దువ్వూరి భావించారు. ఆయన గొప్ప గురువుల వద్ద శిష్యరికం చేశారు. కట్టమంచి రామలింగారెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, డాక్టర్‌ వి.ఎస్‌.కృష్ణ, డాక్టర్‌ ఎ.ఎల్‌.నారాయణ వంటి విశ్వవిద్యాలయ ఉపకులపతుల మన్ననలు పొందారు.
ప్రముఖ తెలుగు ఆచార్యులుగా ప్రసిద్ధికెక్కిన కె.వి.ఆర్‌.నరసింహం, ఎస్వీ జోగారావు, భద్రిరాజు కృష్ణమూర్తి, కొర్లపాటి శ్రీరామమూర్తి, తూమాటి దొణప్ప మొదలైన వారు దువ్వూరి శిష్యులు. ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’ బిరుదు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యుడిగా గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్‌, అకడమిక్‌ కౌన్సిల్‌ సభ్యత్వాలు పొందారు. దువ్వూరి వారు తమ శిష్యుడని, తమకు సహాధ్యాయి, గురువు అని చెప్పుకోవడం ఒకనాడు తెలుగు సీమలో గౌరవంగా భావించేవారు. ఈ మహాపండితుడు 1976 మార్చి 6న తనువు చాలించారు. వ్యాకరణ శాస్త్రంలో ఆయన విశిష్ట ముద్ర ఎన్నటికీ చెరగనిది.

డి.భారతీదేవి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు