డ్రాగన్‌ ఎత్తులకు పైయెత్తు

భారత్‌-పసిఫిక్‌ ద్వీపాల సహకార వేదిక మూడో శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ చేపట్టిన తాజా పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ పపువా న్యూగినియా సందర్శన చరిత్రాత్మకం. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టిన తొలి పర్యటన  అందరి దృష్టినీ అధికంగా ఆకర్షించింది.

Published : 26 May 2023 00:42 IST

భారత్‌-పసిఫిక్‌ ద్వీపాల సహకార వేదిక మూడో శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ చేపట్టిన తాజా పర్యటన ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీ పపువా న్యూగినియా సందర్శన చరిత్రాత్మకం. ఆ దేశంలో భారత ప్రధాని చేపట్టిన తొలి పర్యటన  అందరి దృష్టినీ అధికంగా ఆకర్షించింది.

హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లో పరిమాణంలో చిన్నగా, మారుమూలగా ఉండే సీషెల్స్‌ మొదలు ఫిజీ వరకుగల దేశాలు దశాబ్ది కాలంగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ద్వీపదేశాలు చైనా వైపు మొగ్గుచూపడంపై భారత్‌ ఆందోళన చెందుతోంది. దానివల్ల ఈ ప్రాంతంలో భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమైంది. చైనా వలలో పడకుండా పసిఫిక్‌ ద్వీప దేశాలను నిలువరించే లక్ష్యంతో భారత్‌ క్వాడ్‌ కూటమిని ముందుకు నడిపిస్తోంది. ద్వీప దేశాలకు చేరువ కావడం ద్వారా అక్కడ చైనా సైనిక స్థావరాలను నిర్మించుకోకుండా అడ్డుకోవడం ఈ వ్యూహంలో ఒక భాగం. 2022లో చైనా సోలొమన్‌ ద్వీపాలతో భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ప్రాంతంలో డ్రాగన్‌ దేశం మొదటి సైనిక స్థావరాన్ని నిర్మించడంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ క్రమంలో పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో చైనా విస్తరణ వ్యూహం, అమెరికా ఎత్తుగడలు, దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంతో సంబంధాలు పెంచుకొనేందుకు భారత్‌ చేసే యత్నాలు వంటివన్నీ భౌగోళిక ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పసిఫిక్‌ ప్రాంతంలోని ద్వీప దేశాలపై పట్టునిలుపుకొనేందుకు ప్రధాన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ సంక్లిష్టమైన రాజకీయ, దౌత్య ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి.

ప్రభావశీల ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు అంతర్జాతీయ వేదికలపై 14 పసిఫిక్‌ ద్వీప దేశాల మద్దతును భారత్‌ కోరుతోంది. ఇప్పటిదాకా ఈ ప్రాంతంతో ఇండియాకు ఓ మోస్తరు సంబంధాలే ఉన్నాయి. 14 పసిఫిక్‌ ద్వీపదేశాల్లో కేవలం రెండు హైకమిషన్లను మాత్రమే ఏర్పాటు చేసింది. వాటిలో ఒకటి భారతీయులు గణనీయంగా ఉన్న ఫిజీలో ఉండగా, మరొకటి వాణిజ్య, ఖనిజాల కారణంగా  పపువా న్యూగినియాలో ఏర్పాటయ్యింది. చైనా మాత్రం పసిఫిక్‌ ద్వీపదేశాలన్నింటిలో దౌత్య కార్యాలయాలను నెలకొల్పింది. అంతర్జాతీయ వేదికల్లో ఒక దేశం- ఒక ఓటు నిబంధన విషయంలో 14 పసిఫిక్‌ ద్వీపదేశాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తన ప్రాధాన్యాన్ని చాటుకోవాలని ఆశిస్తున్న భారత్‌కు ఇది మరింత ముఖ్యమైన అంశం. తక్కువ జనాభాతో, సమృద్ధ వనరులతో కూడిన పసిఫిక్‌ ప్రాంతాన్ని సుస్థిరమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలోని దేశాలు- పెరుగుతున్న సముద్ర వాణిజ్య మార్గాల కూడలిలో, వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్నాయి. వనరుల పరంగా పపువా న్యూగినియా సమృద్ధమైనది. బంగారు నిల్వలు, రాగి గనులు దండిగా ఉండటంతో చైనా కన్ను దానిపై పడింది. క్వాడ్‌ సభ్యులు ఈ దేశాల్ని నిర్లక్ష్యం చేయడంతో బీజింగ్‌ ఈ ప్రాంతంపై నియంత్రణను సాధించింది. చైనా తన సైనిక స్థావరాన్ని నిర్మించడం మొదలుపెట్టిన తరవాతే అసలు పరిస్థితి అందరికీ బోధపడింది. దాంతో సోలొమన్‌ దీవుల్లో ఎంబసీని అమెరికా  ప్రారంభించింది. చైనాను దూరం పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇండియా, జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలతో కూడిన క్వాడ్‌ దేశాలు ఆగస్టు 11 నుంచి 20 వరకు సిడ్నీ తీరంలో వార్షిక మలబార్‌ నావికా విన్యాసాలను చేపట్టనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అనుకోని పరిస్థితుల్లో ఇటీవలి పపువా న్యూగినియా సందర్శనను రద్దు చేసుకోవడంతో మోదీ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న భారత్‌ తన ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానంలో భాగంగా పసిఫిక్‌ ద్వీప దేశాలకు చేరువయ్యేందుకు పలు చర్యలు చేపట్టింది. హరిత ఇంధనం, సాంకేతికత, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలతో ఈ దేశాలతో భాగస్వామ్యం పెంపొందించుకోవాలని కోరుకుంటోంది. సౌర విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో తోడ్పాటు, వ్యవసాయ ఉపకరణాల సరఫరా చేపట్టాలని భావిస్తోంది. భీకర తుపానులు, పెరుగుతున్న సముద్ర మట్టాలతో వాతావరణం ఇబ్బందికరంగా మారడంపై ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్‌ చేపట్టిన హరిత ఇంధన కార్యక్రమాలు వాటికి బాగా తోడ్పడగలవు. ఈ ద్వీపదేశాలతో ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొనేందుకు భారత్‌ ముంగిట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇండో పసిఫిక్‌ ప్రాంతాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా సురక్షితంగా కొనసాగించేందుకు భారత్‌ ఈ దేశాలతో సరైన వారధులను నిర్మించాల్సి ఉంది. ప్రధాని మోదీ పర్యటన ఈ దిశగా మెరుగైన అవకాశాల్ని కల్పిస్తుందని ఆశించవచ్చు.

నీరజ్‌ కుమార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.