తయారీని ప్రోత్సహిస్తేనే ఉపాధి

భారత జీడీపీ 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లకు పైబడినట్లు తాజాగా మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. మరో అయిదేళ్ల కాలంలోనే ఇండియా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పలు సవాళ్లను అధిగమించాలి.

Published : 03 Jun 2023 01:40 IST

భారత జీడీపీ 2022లో 3.5 లక్షల కోట్ల డాలర్లకు పైబడినట్లు తాజాగా మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. మరో అయిదేళ్ల కాలంలోనే ఇండియా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పలు సవాళ్లను అధిగమించాలి.

రెండేళ్ల క్రితం 3.2 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని గతంలోనే ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ఆ ఘనతను ఇండియా అందుకున్నట్లు తాజాగా మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ వెల్లడించింది. నిజానికి, 2024-25 నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019 బడ్జెట్‌లోనే వెల్లడించారు. కొవిడ్‌ మూలాన ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దాంతో నిర్దేశిత లక్ష్యం వెనకబడింది. ఈ క్రమంలో భారత్‌ 2026-27 నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇటీవల అంచనా వేసింది. అంతకంటే ముందుగానే ఆ ఘనతను సాధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి గతంలో రాజ్యసభలో వెల్లడించారు. మౌలిక రంగ ప్రాజెక్టులతో పాటు మూలధన వ్యయాలకు నిధుల పెంపు, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం, జాతీయ ఆస్తుల నగదీకరణ, లాజిస్టిక్స్‌ విధానం, పీఎం గతిశక్తి తదితరాలు ఇందుకు ఉపకరిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

తీవ్ర జాప్యం

ఆర్థిక వృద్ధిని జోరెత్తించేందుకు కేంద్రం చేపట్టిన పలు పథకాలు, కార్యక్రమాల వల్ల భారత్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మధ్యతరగతి వృత్తి, ఉద్యోగ నిపుణులకు వేతనాలు ఇతోధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సమీప భవిష్యత్తులోనే వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న జీ-20 దేశంగా ఇండియా నిలుస్తుందని తాజాగా మూడీస్‌ వ్యాఖ్యానించింది. అయితే, విధానపరమైన అడ్డంకులు, సంస్కరణలు పెట్టుబడులకు అవరోధంగా మారవచ్చని అది విశ్లేషించింది. లైసెన్సులు దక్కించుకోవడం, వ్యాపారాల ప్రారంభం నెమ్మదించే అవకాశం ఉండటం వల్ల ప్రాజెక్టులు పూర్తికావడంలో ఆలస్యం నెలకొంటుందని అంచనా వేసింది.

భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్రం పీఎల్‌ఐ పథకాన్ని తెచ్చింది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 14 పీఎల్‌ఐ పథకాల్లో ఎనిమిదింటి అమలు ఆలస్యమవుతున్నట్లు క్రిసిల్‌ నివేదిక ఇటీవల వెల్లడించింది. మరోవైపు, కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం ఇండియాలో 1,438 మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో, 835కుపైగా ఆలస్యంగా సాగుతున్నాయి. దానివల్ల 343 ప్రాజెక్టుల వ్యయం అదనంగా రూ.4.5 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఆయా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రంచర్యలు చేపట్టాలి.

దేశీయంగా రవాణా ఖర్చును తగ్గించేలా సమీకృత మౌలిక వసతుల కల్పనకు కేంద్రం రెండేళ్ల క్రితం పీఎం గతిశక్తి పథకాన్ని తెచ్చింది. అందులో రోడ్ల నిర్మాణం చాలా కీలకమైంది. ఇండియా తన జీడీపీలో 14-15శాతం రవాణాపై వ్యయం చేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 7-8శాతమే. అధిక రవాణా వ్యయం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రోడ్ల ప్రాజెక్టుల కోసం పెద్ద సంస్థలు బిడ్లు దాఖలు చేయడానికి ఆసక్తి చూపడంలేదన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వేరే ప్రాజెక్టుల్లో బిల్లులు రావాల్సి ఉండటం, కొత్తవాటి రాబడులపై సందేహాలతో అవి వెనకడుగు వేస్తున్నాయి. సరైన ఆర్థిక వెసులుబాట్లు లేని చిన్న, మధ్యస్థ సంస్థలు నిర్మాణాలను చేపట్టడం వల్ల అవి ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిగుమతుల భారం

భారత్‌ 2047 నాటికి 30-35 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్రం చెబుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇండియా మొత్తం ఎగుమతుల విలువ 77,000 కోట్ల డాలర్లకు చేరింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు పద్నాలుగు శాతం అధికం. అదే సమయంలో దిగుమతుల విలువ దాదాపు 89,200 కోట్ల డాలర్లు. యంత్రాలు, ఎలెక్ట్రానిక్‌ విడిభాగాలను భారత్‌ భారీగా దిగుమతి చేసుకుంటోంది. వాటిని స్థానికంగానే తయారు చేసేలా ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రస్తుతం దేశీయంగా 60 కోట్ల మంది 18-35 ఏళ్లలోపు యువతే. వీరందరినీ మేలిమి మానవ వనరులుగా తీర్చిదిద్దుకోవాలి. ఆర్థికాభివృద్ధితోపాటు భారత్‌లో ఆదాయ అసమానతలూ తీవ్రంగా పెచ్చరిల్లుతున్నాయి. వాటిని నిలువరించి విద్య, వైద్యం తదితర రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.

ఎం.వేణు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి