ధరల ఘాటు... నషాళానికి!

రైౖతు నుంచి వినియోగదారులకు చేరేసరికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దాదాపు రెట్టింపవుతున్నాయి. దళారుల చేతివాటాన్ని అరికట్టలేకపోవడం ప్రధాన సమస్య. పెట్రో ధరాఘాతాల ధాటికి రవాణా వ్యయం తడిసి మోపెడవుతుండటం- ద్రవ్యోల్బణ సమస్యను జటిలం చేస్తోంది.

Published : 05 Jun 2023 00:34 IST

రైౖతు నుంచి వినియోగదారులకు చేరేసరికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు దాదాపు రెట్టింపవుతున్నాయి. దళారుల చేతివాటాన్ని అరికట్టలేకపోవడం ప్రధాన సమస్య. పెట్రో ధరాఘాతాల ధాటికి రవాణా వ్యయం తడిసి మోపెడవుతుండటం- ద్రవ్యోల్బణ సమస్యను జటిలం చేస్తోంది.

కొవిడ్‌ ప్రజ్వలనం, అనంతరం ముంచుకొచ్చిన ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా వస్తు సరఫరాలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. దాంతో నిరుడు ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం విజృంభించింది. ఇండియాలో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ధరలను అదుపు చేసేందుకు కేంద్రం, ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంటున్నా- క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంతగా మెరుగుపడటం లేదు. ద్రవ్యోల్బణంపై అధికారిక గణాంకాలకు, రిటైల్‌ విపణిలోని ధరలకు పొత్తు కుదరడం లేదు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన సంఘం సభ్యుడు ఆచార్య జయంత్‌ ఆర్‌ వర్మ ఇటీవల హెచ్చరించినట్లు- ద్రవ్యోల్బణంపై యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. ‘ఒపెక్‌’ దేశాలు చమురు ఉత్పత్తిలో కోత పెడుతుండటం, పర్యావరణ సంబంధిత సమస్యల నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ మరింత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. లేకపోతే, ద్రవ్యోల్బణం కోరలు పదునెక్కి సామాన్యుల జీవితాలు ఇంకా దుర్భరమవుతాయి.

సామాన్యులపై పెనుభారం

ఉత్పత్తి గణనీయంగా పెరగడంవల్ల ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, కొన్ని రకాల పండ్ల ధరలు ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. నూనెలు, పాల ఉత్పత్తులు, పప్పులు, ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల ధరలు మాత్రం నింగిని తాకుతున్నాయి. గడచిన మూడు నెలల కాలంలో అంతర్జాతీయంగా వినియోగం తగ్గి ధరలు దిగివచ్చాయి. దానికి అనుగుణంగా దేశీయంగా వంట నూనెల రేట్లను తగ్గించాలని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఈఏ)ను ఆహార, వినియోగదారు వ్యవహారాల విభాగం ఆదేశించింది. వారి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో నూనెల ధరలు సామాన్యుడికి భారమవుతూనే ఉన్నాయి. నిరుడు ఏప్రిల్‌లో 7.79శాతంగా ఉన్న చిల్లర ద్రవ్యోల్బణం- డిసెంబరు నాటికి ఆరు శాతానికి, గత నెలలో అయిదు శాతానికి తగ్గినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో చిల్లర విపణి ధరల్లో 20-40శాతం పెరుగుదల నమోదైంది. ద్రవ్యోల్బణం లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేని విషయాన్ని అది స్పష్టం చేస్తోంది. వంట నూనెలు, పప్పుల ధరలు నిరుటితో పోలిస్తే- ముప్ఫైశాతం వరకు అధికమయ్యాయి. పాల ఉత్పత్తుల ధరలు పాతిక శాతం దాకా ఎగబాకాయి. పచ్చళ్లకు వినియోగించే వేరుశెనగ, నువ్వుల నూనెల రేట్లూ మండిపోతున్నాయి. కారం ధరల ఘాటు అయితే సామాన్యుల నషాళానికి అంటుతోంది. పోనుపోను ఉపాధి అవకాశాలు కుంచించుకుపోతుండటంతో సామాన్యుల ఆర్థిక స్థితిగతులు దిగజారిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో దళారుల మాయాజాలాన్ని నియంత్రించకపోతే సాధారణ ప్రజలకు నిత్యావసరాలు అందని ద్రాక్షలే అవుతాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు కలిగిన మహిళల్లో 57శాతం రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆరు నుంచి 23 నెలల్లోపు పసివారిలో నాలుగో వంతు మాత్రమే చాలినంత ఆహారానికి నోచుకుంటున్నారు. వయసుకు తగిన ఎదుగుదలలేని బాలలూ చాలామందే ఉన్నారు. అధిక ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగితే పేదల ఆర్థిక, ఆరోగ్య, సామాజిక పరిస్థితులు మరింతగా దిగజారతాయి. పస్తులతో కుటుంబాలు చిక్కి శల్యమవుతాయి. ప్రజల జీవనహక్కుకు మంటపెట్టే ద్రవ్వోల్బణాన్ని నియంత్రించడం అత్యావశ్యకం. అది సాధ్యం కావాలంటే ముందుగా తీరైన ప్రణాళికలతో వ్యవసాయ సంక్షోభాన్ని నివారించాలి. 

సరైన సేద్య ప్రణాళికలేవీ?

ప్రపంచంలో అమెరికా తరవాత అత్యధిక విస్తీర్ణంలో వ్యవసాయ యోగ్య భూములు భారత్‌లోనే ఉన్నాయి. సరైన సేద్య ప్రణాళికలు కొరవడటంతో ఎన్నో వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మనకన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు భూములున్న చైనా- 95శాతం ఆహార అవసరాలను సొంతంగా తీర్చుకుంటోంది. ఆ మేరకు ముందుచూపు కొరవడిన భారతదేశమేమో నూనెలు, పప్పుధాన్యాల దిగుమతుల కోసం ఏటా దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయల వరకు విదేశ మారక ద్రవ్యాన్ని ధారబోస్తోంది. మరోవైపు ఎల్‌నినో కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు తగ్గిపోయి తిండి గింజలతో సహా అనేక సరకుల ధరలు ఎగబాకే ప్రమాదం పొంచి ఉంది. రాయితీల్లో కోత, గోదాముల కొరత, సక్రమంగా అమలు కాని మద్దతు ధరల వంటివి సాగుపై రైతుల్లో నిరాశను పెంచుతున్నాయి. అన్న దాతల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ప్రణాళికలను మార్చుకోవాలి. అప్పుడే ద్రవ్యోల్బణాన్ని నిజంగా అదుపు చేయడం సాధ్యపడుతుంది.

 ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.