చైనాతో వాణిజ్య తెగతెంపులు సాధ్యమేనా?

భారత్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు 1983 వరకు ఇంచుమించు సమానంగా ఉండేవి. చైనా నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా దూసుకుపోతోంది. భారత్‌ మాత్రం అయిదో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఉభయ దేశాల సంబంధాలు సానుకూలంగా లేనప్పటికీ, వాటి ఆర్థిక వ్యవస్థలు మాత్రం పరస్పరం ఆధారపడి ఉండటం విశేషం.

Updated : 19 Jun 2023 17:23 IST

భారత్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు 1983 వరకు ఇంచుమించు సమానంగా ఉండేవి. చైనా నేడు ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా దూసుకుపోతోంది. భారత్‌ మాత్రం అయిదో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం ఉభయ దేశాల సంబంధాలు సానుకూలంగా లేనప్పటికీ, వాటి ఆర్థిక వ్యవస్థలు మాత్రం పరస్పరం ఆధారపడి ఉండటం విశేషం.

చైనా ఆదినుంచీ అమెరికా, జపాన్‌ల స్థాయికి ఎదగాలని భావించి తదనుగుణంగా అడుగులు వేసింది. భారత్‌ మాత్రం స్వదేశీ కంపెనీలను విదేశీ ఉత్పత్తుల పోటీ నుంచి కాపాడుకుంటూ వచ్చింది. స్వల్పకాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వాణిజ్యం చైనా ప్రగతికి బాటలు వేసింది. కఠిన నిబంధనలతో కూడిన పాలనా వ్యవస్థ, అన్ని రంగాల్లోనూ ఉత్పాదకత వేగం పుంజుకోవడం ఆ దేశాన్ని పరుగులు పెట్టించింది. నేడు అగ్రరాజ్యమైన అమెరికాను ఢీకొనే స్థాయికి డ్రాగన్‌ ఎదిగింది. భారత్‌ దిగుమతుల్లో చైనా వాటా 2007-08లో 10.8శాతం. 2021-22లో అది 15.43 శాతానికి పెరిగింది. దాంతో నిరుడు సుమారు 7,321కోట్ల డాలర్ల మేరకు వాణిజ్య లోటు ఏర్పడింది. ఇది భారతదేశ మొత్తం వాణిజ్య లోటులో 38.37శాతం!

భారత్‌ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఎలెక్ట్రిక్‌, ఎలెక్ట్రానిక్స్‌, ఆర్గానిక్‌ రసాయనాలు, ప్లాస్టిక్‌ ముఖ్యమైనవి. మొత్తం దిగుమతుల్లో ఇవి 70శాతం. కొవిడ్‌ తరవాత వీటి దిగుమతులు మరింతగా పెరిగాయి. ఇండియా ఉత్పత్తులకు చైనా అతిపెద్ద మార్కెట్‌ అయినప్పటికీ, వాణిజ్య లోటు భారీగా ఉండటం భారత్‌కు శ్రేయస్కరం కాదు. చైనా మొదటి నుంచి భారత్‌ను దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉంది. అలాగని డ్రాగన్‌తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకోలేం. దేశం అభివృద్ధి సాధించడానికి మౌలిక వసతులతో పాటు యంత్ర పరికరాలు, అత్యాధునిక సాంకేతికతలు చాలా అవసరం. వాటిని దిగుమతి చేసుకోవడం- స్వదేశీ కంపెనీలపై తాత్కాలికంగా కొంత ప్రతికూల ప్రభావం చూపుతుంది. కానీ, దిగుమతి చేసుకొన్న సాంకేతికతల సాయంతో భవిష్యత్తులో అవి అభివృద్ధి చెందిన దేశాల స్థాయిని అందుకోగలుగుతాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ కంపెనీలకు పలు పథకాల ద్వారా ఊతమిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలు సానుకూలంగా లేనప్పటికీ భారత్‌, చైనాలు తమ అవసరాల నిమిత్తం పరస్పరం ఆధారపడుతున్నాయి. భారత్‌లో యువ జనాభా అధికం. చైనా వస్తువులకు ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. చైనా ఫ్యాక్టరీల్లోని యంత్రాలు నిరంతరం పనిచేయడానికి భారత్‌ ప్రధాన కారణం. అలాగే భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకువెళ్ళడానికి చైనా యంత్రాలు, పరికరాల తోడ్పాటు అవసరం. చైనా నుంచి సరకులు చౌకగా లభించడంవల్ల మనదేశంలో ద్రవ్యోల్బణం కొంతవరకు నియంత్రణలో ఉంటోంది.

పుల్వామా ఘటన తరవాత కేంద్ర ప్రభుత్వం కొన్ని చైనా యాప్‌లను నిషేధించింది. దాంతో ఆ దేశం నుంచి దిగుమతులకు భారత్‌ స్వస్తి పలుకుతుందని అంతా భావించారు. అలా జరగకపోగా, దిగుమతులు మరింత పెరిగాయి. చైనాను పూర్తిగా పక్కనపెట్టడం అంత సులభంకాదు. అలా చేస్తే, ఇండియా ఆర్థికవృద్ధి కుంటువడుతుంది. మనదేశంలో ఔషధ రంగంతోపాటు పలు ప్రధాన రంగాలు చైనా దిగుమతులపైనే ఆధారపడి కొనసాగుతున్నాయి. కానీ, మన వస్తువులపై ఆధారపడే స్థితిలో చైనా లేదు. అందువల్ల, భారత్‌ ప్రస్తుతం ఆ దేశ దిగుమతులను ఉపయోగించుకుని, భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ స్వయంసమృద్ధి సాధించేందుకు ప్రణాళికలను రూపొందించుకోవాలి. ముఖ్యంగా జీఎస్టీ హేతుబద్ధీకరణ, మౌలిక వసతుల కల్పనతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి చర్యలను చేపట్టాలి. తద్వారా దీర్ఘకాలంలో చైనాపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

ఆచార్య బి.ఆర్‌.కె.రావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.