నిషేధం నుంచి నియంత్రణ వైపు... క్రిప్టో

క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ నిబంధనావళి రూపకల్పనకు కృషి చేయాలని దిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. ఇది కీలక పరిణామం. అయితే, ఈ విషయంలో ఎన్నో సందేహాలు, సందిగ్ధతలు నెలకొన్నాయి.

Updated : 09 Oct 2023 17:31 IST

క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం ఒక అంతర్జాతీయ నిబంధనావళి రూపకల్పనకు కృషి చేయాలని దిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. ఇది కీలక పరిణామం. అయితే, ఈ విషయంలో ఎన్నో సందేహాలు, సందిగ్ధతలు నెలకొన్నాయి.

ఇంతకాలం భారత్‌, అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు క్రిప్టోలను ఉగ్రవాదులకు గుట్టుగా నిధులు పంపే సాధనంగా పరిగణిస్తున్నాయి. రాజకీయ అవినీతిపరులు, మాదక ద్రవ్య ముఠాలు తమ అక్రమార్జనను చట్టబద్ధంగా చలామణీ చేసే నిగూఢ కరెన్సీగానూ పేర్కొంటూ క్రిప్టోలను నిషేధించాలని అవి పట్టుబడుతూ వచ్చాయి. అయితే ఇటీవల జీ20 శిఖరాగ్ర సదస్సులో క్రిప్టోలను నిషేధించడం కాకుండా నియంత్రించాలని నిశ్చయించడం గణనీయ పరిణామం. క్రిప్టోల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రపంచ దేశాలు ఏకీకృత నిబంధనావళిని రూపొందించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ఆర్థిక స్థిరత్వ బోర్డు చేసిన సిఫార్సును జీ20 దేశాలు దిల్లీ సభలో ఏకగ్రీవంగా ఆమోదించాయి. అక్రమ ధన చలామణీకి తావులేని విధంగా అంతర్జాతీయ క్రిప్టో లావాదేవీలు జరిగేలా ఒక ఎక్స్ఛేంజ్‌ను నెలకొల్పి అధికారిక పర్యవేక్షణ ఏర్పరచాలని అవి నిర్ణయించాయి.

భారీగా వినియోగదారులు

భారత్‌లో క్రిప్టో కరెన్సీల చలామణీ, లావాదేవీలు పెరిగినప్పుడే రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. వ్యక్తులు, సంస్థలకు వర్చువల్‌ లేదా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు జరిపే అవకాశాన్ని కల్పించకూడదని 2018లో భారతీయ బ్యాంకులను ఆర్‌బీఐ వారించింది. ఆ ఆదేశాన్ని సుప్రీంకోర్టు 2020లో కొట్టివేయడంతో, నిర్దేశిత నిబంధనలను పాటించే వర్చువల్‌ కరెన్సీ కంపెనీలకు సేవలు అందించవచ్చని రిజర్వు బ్యాంకు 2021లో భారతీయ బ్యాంకులకు సూచించింది. అయినా బ్యాంకులు క్రిప్టో సేవలు అందించడానికి విముఖంగా ఉన్నాయి. అంతేకాదు, 2022లో క్రిప్టో ఆదాయంపై భారత్‌ 30శాతం పన్ను విధించింది. మొత్తానికి క్రిప్టోలను నిషేధించాలన్నదే రిజర్వు బ్యాంకు అభిమతం. అమెరికాలో సైతం ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రభుత్వాల వైఖరి ఎలా ఉన్నా నేడు ప్రపంచంలో 42 కోట్ల మంది క్రిప్టో వినియోగదారులు ఉన్నారని అంచనా. క్రిప్టోల విలువ అమాంతం పడిపోవడం, పెరగడం సాధారణ క్రిప్టో మదుపరులను దెబ్బతీస్తున్నాయి. 2021లో 2.6 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న క్రిప్టోల విలువ 2022లో లక్ష కోట్ల డాలర్లకు పడిపోయింది. మదుపరుల ప్రయోజనాలను రక్షించడం ప్రభుత్వాల బాధ్యత. అదే సమయంలో క్రిప్టోలు తమ ఆర్థిక వ్యవస్థల సుస్థిరతను దెబ్బతీయకుండా చూసుకోవడమూ సర్కార్ల విధి. అందుకే మొదట్లో వాటిని నిషేధించాలని చూసినా, అది సాధ్యం కాదని తెలిసి నియంత్రణ చర్యలు మొదలుపెట్టాయి. 38 దేశాలతో కూడిన ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నిరుడు క్రిప్టో ఆస్తుల వెల్లడి నిబంధనావళి (సీఏఆర్‌ఎఫ్‌)ని రూపొందించింది. ఈ ఏడాది మే నెలలో ఐరోపా సమాఖ్య (ఈయూ) ఆ నిబంధనావళిని శిరసావహించింది. క్రిప్టోల రూపంలో అక్రమ ధన చలామణీ నిరోధానికి ఒక బిల్లును తీసుకురావాలని అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) ఎగువ సభ తలపెట్టింది. 2023 ఏప్రిల్‌లో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) క్రిప్టోలపై కొరడా ఝళిపించింది. అయినా, క్రిప్టోల నిషేధానికి కాకుండా నియంత్రణకు సమగ్ర అంతర్జాతీయ నియంత్రణ నిబంధనావళి ఉండాలని ఐఎంఎఫ్‌ చేసిన సూచనను దిల్లీ జీ20 శిఖరాగ్ర సభ ఆమోదించింది. దీనిపై తదుపరి కార్యాచరణ కోసం కేంద్ర బ్యాంకుల గవర్నర్లు సమాలోచనలు జరపాల్సి ఉంది.

బ్రెజిల్‌ ఆధ్వర్యంలో...

జీ20 తీర్మానాలను సభ్యదేశాలు విధిగా పాటించాల్సిన అవసరం లేదని, అది స్వచ్ఛంద వ్యవహారమని గమనించాలి. పైగా దిల్లీ జీ20 సదస్సుకు చైనా, రష్యా అధినేతలు హాజరు కానందువల్ల క్రిప్టో నియంత్రణ నిబంధనావళి ఎంతవరకు సాధ్యపడుతుందనేది అనుమానమే. అదీ కాకుండా అధిక జీడీపీ కలిగిన స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, స్పెయిన్‌, హాంకాంగ్‌, నైజీరియా వంటి దేశాలు జీ20లో సభ్యులు కావు. ఈ పరిస్థితిలో క్రిప్టోల నియంత్రణకు అంతర్జాతీయ నిబంధనావళి సమర్థంగా అమలు కాగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. అంతమాత్రాన ఆశ వదులుకోవాల్సిన పనిలేదు. డిసెంబరు నుంచి జీ20 కూటమికి బ్రెజిల్‌ అధ్యక్షత వహించనుంది. భారత్‌, అమెరికా, ఈయూలకు భిన్నంగా బ్రెజిల్‌ క్రిప్టోలపై సానుకూల వైఖరి అవలంబిస్తోంది. అక్కడ ఇప్పటికే క్రిప్టో కరెన్సీలకు నియంత్రణ ప్రాతిపదిక ఉంది. బ్రెజిల్‌ కేంద్ర బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)తో చేస్తున్న ప్రయోగాల్లో స్థానిక క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ పాలుపంచుకొంటోంది. బ్రెజిల్‌ బ్యాంకులు క్రిప్టో సేవలను అందిస్తున్నాయి. అక్కడి అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు క్రిప్టోలలో పన్ను చెల్లింపులను స్వీకరిస్తోంది. కాబట్టి క్రిప్టో నియంత్రణకు సరైన ప్రాతిపదికను బ్రెజిల్‌ ఆధ్వర్యంలో జరిగే జీ20 సదస్సు ముందుకు తెచ్చే అవకాశం ఉంది.

ఆర్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.