అంతరిక్ష రంగంలోకి విదేశీ పెట్టుబడులు

చంద్రయాన్‌-3 విజయం అంతరిక్ష రంగంలో భారత్‌ సత్తాను మరోసారి ప్రపంచానికి తెలియజెప్పింది. ఈ రంగంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడానికి ఇండియా ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రధాన అడ్డంకిగా మారిన నిధుల లేమిని అధిగమించేందుకు ప్రైవేటు పెట్టుబడులను భారత్‌ ప్రోత్సహిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకూ సిద్ధమవుతోంది.

Updated : 15 Oct 2023 17:12 IST

చంద్రయాన్‌-3 విజయం అంతరిక్ష రంగంలో భారత్‌ సత్తాను మరోసారి ప్రపంచానికి తెలియజెప్పింది. ఈ రంగంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడానికి ఇండియా ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రధాన అడ్డంకిగా మారిన నిధుల లేమిని అధిగమించేందుకు ప్రైవేటు పెట్టుబడులను భారత్‌ ప్రోత్సహిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకూ సిద్ధమవుతోంది.

చంద్రయాన్‌-3 ప్రయోగంతో జాబిల్లి దక్షిణ ధ్రువంపై తొలిసారి కాలు మోపిన దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ నైపుణ్యం, పరిశోధనా పటిమకు ఇదో మచ్చుతునక. ముఖ్యంగా అత్యంత చౌకగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించగలిగే సత్తా ఇండియా సొంతం. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అంతరిక్ష కార్యకలాపాల విపణిలో భారత్‌ వాటా రెండు శాతమే! ఇందుకు ప్రధాన కారణం- మన అంతరిక్ష రంగం ప్రభుత్వ నియంత్రణలో ఉండటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారీగా నిధులు

ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కార్యకలాపాల విపణి పరిమాణం విలువ సుమారు రూ.45లక్షల కోట్లు. మరికొన్నేళ్లలో ఇది సుమారు రూ.83 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇందులో ఇండియా కీలక పాత్ర పోషించాలంటే- ప్రైవేటు రంగ పెట్టుబడుల తోడ్పాటు ఎంతో అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం దేశీయ అంతరిక్ష రంగంలో పలు సంస్కరణలు చేపట్టింది. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా గత ఏప్రిల్‌లో ‘భారత అంతరిక్ష విధానం (ఇండియన్‌ స్పేస్‌ పాలసీ) తీసుకొచ్చింది. మరోవైపు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సుమారు అయిదు దశాబ్దాలుగా దేశీయ అంతరిక్ష కార్యకలాపాల నియంత్రణ, నిర్వహణ బాధ్యతలను చేపడుతోంది. కేంద్రం ఏటా ఆర్థిక పద్దులో ఇస్రోకు కేటాయిస్తున్న నిధులు పరిమితంగానే ఉంటున్నాయి. దాంతో పరిశోధనలు వేగం పుంజుకోవడం లేదు. 2022-23లో ఆ సంస్థకు కేంద్రం సుమారు రూ.13వేల కోట్లు ప్రత్యేకించింది. ప్రైవేటు పెట్టుబడులూ పరిమితంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం దేశీయ అంతరిక్ష కార్యకలాపాల విపణి పరిమాణం సుమారు రూ.58వేల కోట్లు. దీన్ని నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పెంచుకోవాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇది సుసాధ్యం కావాలంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసికట్టుగా ముందుకు నడవడం ఎంతో అవసరం. భారత అంతరిక్ష వాణిజ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆర్థిక ప్రగతికి ఇది ఇతోధికంగా దోహదపడుతుంది. దేశీయ అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాత్రను పెంచేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం ఉపగ్రహాల ఏర్పాటు, సంబంధిత కార్యకలాపాల్లో మాత్రమే నూరు శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నారు. మిగతా రంగాల్లో మాదిరిగా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు లేకుండా (ఆటోమేటిక్‌’ పద్ధతిలో) పెట్టుబడులు పెట్టడానికి అంతరిక్ష రంగంలో వీలు లేదు. త్వరలో ప్రకటిస్తారని చెబుతున్న కొత్త ఎఫ్‌డీఐ విధానంలో- అంతరిక్ష రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో ఆటోమేటిక్‌ పద్ధతిలోనే 49-74శాతం మేర ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చే అవకాశముంది. ఇదే జరిగితే- ఉపగ్రహాల తయారీ, శాటిలైట్‌ కమ్యూనికేషన్లు, ఉపగ్రహాల విడిభాగాల తయారీలో నిమగ్నమైన సంస్థలకు పెద్దమొత్తంలో నిధులు సమకూరతాయి. అత్యాధునిక సాంకేతికతలను అవి అందుపుచ్చుకొంటాయి. మరిన్ని అంకుర సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టే వీలుంటుంది.

ఆవిష్కరణలకు తోడ్పాటు

ప్రస్తుతం అంతరిక్ష కార్యకలాపాల ద్వారా భారత్‌కు సుమారు రూ.8,300 కోట్ల వార్షిక ఆదాయం వస్తున్నట్లు అంచనా. 2025నాటికి ఇది లక్ష కోట్ల రూపాయలు దాటవచ్చని ఈవై సంస్థ పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించే కొత్త ఎఫ్‌డీఐ విధానం అందుకు బాటలు ఏర్పరచవచ్చని అనేక సంస్థలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. అంతరిక్ష రంగంలోకి భారీయెత్తున పెట్టుబడులు ప్రవహిస్తే- అనేక రంగాల్లో ఆ ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇంధనం, వాతావరణం, టెలి కమ్యూనికేషన్లు, విమానయానం, సముద్రయానం, రహదారి రవాణా, వ్యవసాయం వంటి రంగాలపై ఈ ప్రభావం ఉంటుంది. దేశ విదేశీ ప్రైవేటు సంస్థలు సొంతంగా ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగించడమూ పెరుగుతుంది. సాంకేతికతల బదిలీతో పాటు పరిశోధనలు, ఆవిష్కరణలకు తోడ్పాటు లభిస్తుంది. మారుమూల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సాంకేతిక సంస్థల సంఖ్యలో భారత్‌ వాటా ప్రస్తుతం 3.6శాతమే. విదేశీ పెట్టుబడులు అందివస్తే వీటి సంఖ్య భారీగా పెరుగుతుంది. నైపుణ్యాభివృద్ధికీ నిధులు సమకూరతాయి. తద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కార్యకలాపాల విపణిలో భారత్‌ పట్టు పెంచుకోగలుగుతుంది.

నాసు నరేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.