విప్లవాత్మక మార్పులకు 6జీ ఆలంబన

దేశంలో 5జీ టెలికాం సాంకేతికత వినియోగం ఊపందుకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చినట్లు  ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరింత  అధునాతనమైన 6జీ సాంకేతికత వైపు సన్నాహాలు మొదలయ్యాయి.

Updated : 22 Oct 2023 13:32 IST

దేశంలో 5జీ టెలికాం సాంకేతికత వినియోగం ఊపందుకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చినట్లు  ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరింత  అధునాతనమైన 6జీ సాంకేతికత వైపు సన్నాహాలు మొదలయ్యాయి.

దేశంలో 6జీ సాంకేతికతను పరిచయం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నామని ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించడంతో అందరి దృష్టీ దీనిపైకి మళ్ళింది. ఇందు కోసం 6జీ టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే, మనదేశంలో 5జీ గురించి ప్రాథమిక చర్చలు జరుగుతున్నప్పుడే చైనా దానిని విస్తృతంగా వినియోగంలోకి తేవడమే కాదు, 6జీ ప్రయోగాలూ ప్రారంభించేసింది. 6జీ విషయంలో అలాంటి తాత్సారం జరగకూడదనే ఉద్దేశంతో ఈ ఏడాది మార్చిలోనే దార్శనిక పత్రాన్ని ప్రధాని విడుదల చేశారు. 6జీ ప్రయోగవేదికనూ ప్రారంభించారు. 6జీపై సాంకేతిక నవకల్పనల బృందం (టీఐజీ-6జీ) పేరుతో ఓ కార్యదళాన్నీ ఏర్పాటు చేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు, విభాగాల ఉన్నతాధికారులు, పరిశోధక సంస్థలు, టెలికాం తదితర రంగాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు.

కొత్త పుంతలు

గతంలో 2జీ, 3జీ నెట్‌వర్క్‌లు కేవలం సెల్‌ఫోన్‌ సంకేతాలు అందించడానికే పరిమితమయ్యేవి. సాధారణ వేగంతో పనిచేసేవి. 4జీ వచ్చాక టెలికాం సర్వీసుల్లో వేగం పెరిగింది. అంతరాయాలు తగ్గాయి. ఉదాహరణకు 4జీలో ఓ ఫోన్‌ నుంచి మరో ఫోన్‌కు కాల్‌ లేదా మెసేజ్‌ చేస్తే అది చేరడానికి కనీసం 50 మిల్లీసెకన్ల సమయం పడుతోంది. ఇది 6జీలో మిల్లీసెకన్‌లోపే ఉంటుంది. డేటా డౌన్‌లోడ్‌లో పెరగనున్న వేగం సమాచార సాంకేతిక విప్లవంలో పెనుమార్పులకు తెరతీసే అవకాశం ఉంది. 4జీతో మొబైల్‌ అంతర్జాలం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) సర్వీసులకు ప్రాధాన్యం పెరిగింది. డిజిటల్‌ చెల్లింపులు, ఇ-కామర్స్‌ లావాదేవీలు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలు, ఆహార సరఫరా యాప్‌లు ప్రజల జీవనంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. 5జీ సాంకేతికత వీటిని మరింత వేగంగా, సమర్థంగా ముందుకు తీసుకెళుతోంది. టెలీమెడిసిన్‌, వ్యవసాయ, వాణిజ్య, రవాణా తదితర రంగాల్లో సాంకేతికత కొత్త పుంతలు తొక్కనుంది. 6జీతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు. భవిష్యత్‌ తరం అవసరాలైన స్మార్ట్‌ హోమ్స్‌, డ్రైవర్‌ రహిత కార్లు, పరిశ్రమలు, కర్మాగారాల్లో యంత్రాలను నడిపించడంలో సాంకేతిక వినియోగం, ఆసుపత్రుల్లో రోబోటిక్స్‌ శస్త్రచికిత్సలు వంటివన్నీ 6జీతో సాధ్యమవుతాయి. 6జీ సాంకేతికతను 2030 నాటికి రెండు దశల్లో ప్రజలందరికీ చేరువ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు. 2023 నుంచి 2025 వరకు ఉండే తొలి దశలో 6జీ ఏర్పాటులో కొత్త ఆలోచనలకు అంకురార్పణ, వాటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం, విద్య నుంచి వైద్యం వరకు వివిధ రంగాల్లో వినియోగం, వాటివల్ల కలిగే ప్రయోజనాలపై చర్చలు వంటివన్నీ ఉంటాయి. రెండో దశ 2025 నుంచి 2030 వరకు అయిదేళ్లు ఉంటుంది. 6జీ పరీక్షలకు ఏర్పాటు, స్పెక్ట్రమ్‌ వేలం, ప్రజలకు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తేవడం ఈ దశలో లక్ష్యాలు. ఒకటి, రెండేళ్లలో 5జీ పూర్తిస్థాయిలో పట్టాలకెక్కితే టెలికాం సంస్థలు 6జీపై దృష్టి సారిస్తాయి. అయితే, ఈ విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆమడ దూరంలో ఆగిపోయింది. దేశంలో 4జీ నెట్‌వర్క్‌ ప్రారంభమైన పదేళ్ల తరవాత ఈ ఏడాదే 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పటికి ప్రైవేటు సంస్థలు 6జీ సన్నాహాలు ప్రారంభిస్తాయని అంచనాలున్నాయంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంత వెనకంజలో ఉందో అర్థమవుతోంది.

అందుబాటు ధరలో...

ఇప్పుడిప్పుడే 5జీ ఫోన్లు చౌకగా అందుబాటులోకి వస్తున్నాయి. 5జీ వచ్చి ఏడాదవుతున్నా ఇంకా ఆ సాంకేతికతకు అనువైన సెల్‌ఫోన్ల సంఖ్య 20శాతం కూడా దాటలేదు. 5జీ నెట్‌వర్క్‌, దానికి అనువైన పరికరాలు సామాన్య వినియోగదారుడికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకో రెండు, మూడేళ్లయినా పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో 6జీ వచ్చేసరికి దాన్ని అందిపుచ్చుకోగలిగే ఫోన్లను సగటు వినియోగదారుడికి అనువైన ధరలో అందుబాటులోకి తేవాలి. వినియోగదారులపై భారం మోపకుండా చూడాలి. ఇందుకోసం ప్రభుత్వం వైపు నుంచి సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు, టెలికాం నెట్‌వర్క్‌ ప్రొవైడర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు భారతీయ ఇంజినీర్లు 6జీ సాంకేతికత ఆధారంగా కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించారు. మన ఇంజినీర్లు 6జీ సాంకేతికతలపై ఇప్పటికే 100కి పైగా మేధాసంపత్తి హక్కులు పొందారని కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 6జీ సాంకేతికతను భారతే ముందుకు నడిపిస్తుందని మంత్రి విశ్వాసం ప్రకటించడం కొత్త తరం సాంకేతికతపై ప్రభుత్వ ఉద్దేశాన్ని చాటిచెబుతోంది.

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.