ఆరోగ్య బీమా... దక్కని ధీమా!

అత్యవసరంగా చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఆసరాగా నిలుస్తుంది. భరించలేని ఆస్పత్రిబిల్లులతో కుటుంబాలు రోడ్డుమీద పడకుండా నిరోధిస్తుంది.

Updated : 22 Oct 2023 13:33 IST

అత్యవసరంగా చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఆసరాగా నిలుస్తుంది. భరించలేని ఆస్పత్రి బిల్లులతో కుటుంబాలు రోడ్డుమీద పడకుండా నిరోధిస్తుంది. అయితే, పాలసీదారుల అవగాహన లేమి, బీమా సంస్థల షరతుల వల్ల ఆరోగ్య బీమా పరిహార దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఒక్కోసారి పరిహారం పాక్షికంగానే లభిస్తోంది.

వ్యాధుల ముట్టడి తీవ్రం కావడం, చికిత్స వ్యయం భారీగా ఉంటుండటంతో ఇటీవలి కాలంలో ఆరోగ్య బీమా తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. నగదు రహిత (క్యాష్‌లెస్‌) చికిత్స సదుపాయం వల్ల డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండానే సకాలంలో వైద్యం పొందే వీలుండటం ఆరోగ్య బీమా పాలసీలకు గిరాకీని పెంచుతోంది. అయితే, పాలసీ ఉందన్న నమ్మకంతో ఆస్పత్రిలో చేరిన తరవాత బీమా పరిహార దరఖాస్తులు (క్లెయిములు) తిరస్కరణకు గురయ్యి పాలసీదారులు ఇబ్బందులు పడుతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. అవగాహనా రాహిత్యంతో పాలసీదారులు చేసే పొరపాట్ల వల్ల కొన్నిసార్లు ఇలా జరుగుతోంది. పాలసీ పత్రంలోని షరతులను ఆసరాగా చేసుకొని బీమా సంస్థలు కొన్ని సందర్భాల్లో పరిహారాన్ని తిరస్కరిస్తున్నాయి. ముఖ్యంగా, బీమా సంస్థలు సహేతుక కారణాలు లేకుండానే ఆరోగ్య బీమా క్లెయిములను తిరస్కరిస్తున్నాయంటూ అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ ఇండియా (ఏహెచ్‌పీఐ) చేసిన తాజా ఆరోపణ చర్చనీయాంశంగా మారింది. అయితే, భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) 2021-22 వార్షిక నివేదిక ప్రకారం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 2021-22లో సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు మొత్తం క్లెయిముల్లో 86 శాతాన్ని పరిష్కరించాయి. ఆరు శాతమే తిరస్కరణకు గురయ్యాయి. మరో ఎనిమిది శాతం 2022 మార్చి 31 నాటికి పెండింగులో ఉన్నాయి. అదే కాలానికి జీవిత బీమా సంస్థలు సైతం 81 శాతం ఆరోగ్య బీమా క్లెయిములను పరిష్కరించాయి.

తిరస్కరణ ముప్పు తప్పాలంటే...

ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడే పాలసీదారులు సరైన జాగ్రత్తలను పాటించడం శ్రేయస్కరం. ముఖ్యంగా బీమాకు సంబంధించిన అన్ని నిబంధనలను తెలుసుకోవాలి. ఆరోగ్య సంబంధిత వివరాలను పూర్తిగా వెల్లడించకపోతే భవిష్యత్తులో క్లెయిములు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. బీమా తీసుకునేటప్పుడు ప్రీమియం పెరుగుతుందని కొన్ని ప్రయోజనాలను ఎంపిక చేసుకోకపోయినా తరవాతి కాలంలో నష్టపోవాల్సి వస్తుంది. ఆరోగ్య బీమా క్లెయిములు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బీమా సంస్థలు గుర్తించిన (నెట్‌వర్క్‌ పరిధిలోని) ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స చేయించుకోవడం. దీనివల్ల పాలసీదారుపై ఆర్థిక భారం పడదు. రెండో పద్ధతిలో ముందుగానే ఆస్పత్రిలో చికిత్స ఖర్చును చెల్లించి, ఆ తరవాత వైద్య వ్యయాలను బీమా సంస్థ నుంచి తిరిగి పొందుతారు. నెట్‌వర్క్‌ పరిధిలో లేని ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. నెట్‌వర్క్‌ పరిధిలో ఏయే ఆసుపత్రులు ఉన్నాయనే దానిపై పాలసీదార్లు సరైన అవగాహన కలిగి ఉండాలి. తద్వారా నగదు రహిత చికిత్సను అందుకోవచ్చు. 2021-22లో నగదు రహిత విధానంలో 59శాతం, రీఇంబర్స్‌మెంట్‌ విధానంలో 38శాతం, ఈ రెండు పద్ధతుల్లో కలిపి మరో రెండు శాతం క్లెయిములను సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు పరిష్కరించినట్లు ఐఆర్‌డీఏఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా పాలసీ తీసుకున్న తరవాత దాని ప్రయోజనాలు వర్తించేందుకు కొంతకాలం వేచి ఉండాలనే నిబంధన ఉంటుంది. ఆ లోగా ఏదైనా అనారోగ్యం తలెత్తి క్లెయిముకు దరఖాస్తు చేసుకున్నా బీమా సంస్థలు దాన్ని తిరస్కరిస్తాయి. 

సత్వర పరిష్కారంతో భరోసా

పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. బీమా సంస్థలపై ఫిర్యాదులకు ప్రత్యేక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. టోల్‌ ఫ్రీ ఫోన్‌ నంబరు, ఈ-మెయిల్‌ ద్వారా ఐజీసీసీ ఫిర్యాదులను స్వీకరించి, వాటి స్థితి ఎక్కడి వరకు వచ్చిందో తెలియజేస్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ కోసం సమీకృత ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ(ఐజీఎంఎస్‌)ను ఐఆర్‌డీఏఐ అందుబాటులోకి తెచ్చింది. 2021-22లో ఐజీఎంఎస్‌కు దాదాపు 2.20 లక్షల ఫిర్యాదులు అందాయి. వాటిలో జీవిత బీమాకు సంబంధించినవి 70శాతం, సాధారణ, ఆరోగ్య బీమాకు చెందినవి 30శాతం ఉన్నాయి. ఫిర్యాదుల పరిష్కరణ రేటు 99.15శాతంగా నమోదైంది. జీవిత బీమా సంస్థలు 99.92శాతం ఫిర్యాదులను, సాధారణ బీమా సంస్థలు 97.44శాతం ఫిర్యాదులను పరిష్కరించాయి. ప్రస్తుతం పాలసీ తీసుకున్న బీమా కంపెనీ అందించే సేవలు సంతృప్తికరంగా లేకుంటే పాలసీదారులు మరో సంస్థకు మారిపోయే అవకాశమూ ఉంది. క్లెయిమ్‌ పరిష్కారాలు అధికంగా ఉండి, విస్తృత ఆస్పత్రుల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఆరోగ్య బీమా సంస్థలకే పాలసీదారులు ప్రాధాన్యమివ్వాలి. ఆరోగ్య బీమాపై పాలసీదారులకు సంస్థలు సరైన అవగాహన కల్పించాలి. క్లెయిములను సత్వరం పరిష్కరించి పాలసీదారుల్లో భరోసా నింపాలి. అప్పుడే ఆరోగ్య బీమా అసలు లక్ష్యం నెరవేరుతుంది. 

 నాసు నరేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.