జీవ ఇంధనమే భవిష్యత్తు!

ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధనంవైపు మొగ్గు పెరుగుతోంది. ఈ రంగంలో అంతర్జాతీయ వాణిజ్యాన్నిపెంపొందించడానికి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల ఆయా దేశాలకు ముడిచమురు దిగుమతి వ్యయాలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలూ సిద్ధిస్తాయి.

Updated : 22 Oct 2023 13:34 IST

ప్రపంచవ్యాప్తంగా జీవ ఇంధనంవైపు మొగ్గు పెరుగుతోంది. ఈ రంగంలో అంతర్జాతీయ వాణిజ్యాన్నిపెంపొందించడానికి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల ఆయా దేశాలకు ముడిచమురు దిగుమతి వ్యయాలు తగ్గుతాయి. ఇతర ప్రయోజనాలూ సిద్ధిస్తాయి.

భారతదేశంలో 70శాతం డీజిల్‌, 99.6శాతం పెట్రోలును రవాణా రంగమే వినియోగిస్తూ కర్బన ఉద్గారాల విజృంభణకు కారణమవుతోంది. ప్రపంచంలో మూడో పెద్ద చమురు దిగుమతిదారైన భారత్‌- శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించి, వాటి బదులు సౌర, పవన, ఉదజని, జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఉదజనితో నడిచే రెండు బస్సులను ఇటీవల దిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది.  ఈ ఏడాది చివరికల్లా మొత్తం 15 ఉదజని బస్సులను రంగంలోకి దించనున్నది. 2030 నాటికే ఏటా 10లక్షల టన్నుల హరిత ఉదజనిని తయారుచేసే సామర్థ్యాన్ని సంతరించుకోవాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లక్షిస్తున్నాయి. గత ఆగస్టులో ఒక మిశ్రమ ఇంధన కారును భారత్‌లో టొయోటా-కిర్లోస్కర్‌ సంస్థ ఆవిష్కరించింది. 20శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోలు, విద్యుత్తుపై నడిచే ఈ కారు మున్ముందు చమురు దిగుమతులను తగ్గిస్తుందని భారత్‌ ఆశిస్తోంది. ఇటీవల జీ20 సదస్సు సందర్భంగా భారత్‌, అమెరికా, బ్రెజిల్‌ దేశాలు ఇథనాల్‌ వంటి జీవ ఇంధనాల తయారీని పెద్దయెత్తున చేపట్టడానికి అంతర్జాతీయ జీవఇంధన కూటమి(జీబీఏ)గా ఏర్పడ్డాయి. అందులో చేరడానికి 19 దేశాలు, 15 అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. హరిత భవిష్యత్తు కోసం అంతర్జాతీయ జీవ ఇంధనాల వాణిజ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. 1973లో చమురు ధరలు ఎగబాకి ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు ఇథనాల్‌ కలిపిన పెట్రోలును ఉపయోగించడం ద్వారా బ్రెజిల్‌ ఒడ్డున పడింది. చెరకు, గోధుమ, మొక్కజొన్న వ్యర్థాలు, కుళ్ళిన కూరగాయల నుంచి ఇథనాల్‌ను తయారు చేయవచ్చు. 1975 నుంచి ఇథనాల్‌ ఉత్పత్తిని బ్రెజిల్‌ పెద్దయెత్తున చేపట్టి మిశ్రమ ఇంధన కార్ల వినియోగాన్ని విస్తరించింది. ఈ రంగంలో అపార అనుభవం గడించిన బ్రెజిల్‌ జీవ ఇంధనాల కూటమిలో చేరడం శుభపరిణామం.

జీవ ఇంధనాల తయారీకి పంట వ్యర్థాలతోపాటు కలప, జంతు వ్యర్థాలు, పురపాలక వ్యర్థాలు, ఆహార శుద్ధి పరిశ్రమ నుంచి వెలువడే అవశేషాలు, ఇతరత్రా సూక్ష్మజీవులను ఉపయోగించవచ్చు. వీటినే బయోమాస్‌ అంటారు. భారత్‌లో ఏటా 50 కోట్ల టన్నుల బయోమాస్‌ ఉత్పత్తి అవుతోంది. అందులో 12-15 కోట్ల టన్నుల మిగులు ఉంటోందన్నది పరిశ్రమ వర్గాల అంచనా. ప్రస్తుతం భారత్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుచ్ఛక్తిలో 12.9శాతానికి జీవ ఇంధనాలే దోహదపడుతున్నాయి. 2001లో భారత్‌ అయిదు శాతం ఇథనాల్‌ను కలిపిన డీజిల్‌, పెట్రోలు వినియోగానికి పైలట్‌ ప్రాజెక్టును చేపట్టింది. 2030కల్లా పెట్రోలులో 20శాతం ఇథనాల్‌, డీజిల్‌లో అయిదు శాతం బయోడీజిల్‌ కలిపి విక్రయించాలని 2018 నుంచి అమలులోకి వచ్చిన జాతీయ జీవఇంధన విధానం నిర్దేశించింది. కానీ, 2025-26 నాటికే 20శాతం ఇథనాల్‌ మిశ్రమ పెట్రోలును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ఇటీవల నిశ్చయించింది.

అంతర్జాతీయ జీవ ఇంధన కూటమి ఈ రంగంలో అధునాతన సాంకేతికతలను సభ్యదేశాలు ఇచ్చిపుచ్చుకోవడానికి వేదికగా ఉపయోగపడుతుంది. భారత్‌లో మిశ్రమ ఇంధనాలతో నడిచే కార్ల ఉత్పత్తి, వాడకం పెరగడానికి తోడ్పడుతుంది. ముడి చమురు దిగుమతి బిల్లును తగ్గిస్తుంది. కర్బన ఉద్గారాలను తగ్గించి భూతాప నివారణకు ఉపకరిస్తుంది. బ్రెజిల్‌, అమెరికాల తరవాత అతిపెద్ద జీవ ఇంధన ఎగుమతిదారుగా భారత్‌ ఆవిర్భవించడానికి కూటమి దోహదపడుతుంది. జీవ ఇంధన రంగంలో పెరిగే పెట్టుబడులు- ఉపాధి అవకాశాలు, రైతుల ఆదాయం అధికమయ్యేందుకు తోడ్పడతాయి. అయితే, చెరకు వంటి ఆహార పంటలు, వంట నూనెలను ఉపయోగించి జీవ ఇంధనాలను తయారు చేయడం ఆహార భద్రతకు, పర్యావరణానికి నష్టం కలిగించే అవకాశం ఉంది. బొగ్గుపులుసు వాయువును అధికంగా ఉపయోగించుకునే పంటలను పెంచి అత్యధునాతన జీవ ఇంధనాలను తయారు చేయవచ్చు. ఈ విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి అంతర్జాతీయ కూటమి ఉపకరిస్తుంది.

ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.