చమురు ధరలు భగ్గుమంటాయా?

ఇజ్రాయెల్‌తో భారత్‌కు బలమైన దౌత్య సంబంధాలున్నాయి. మరోవైపు, అరబ్‌ దేశాలకూ భారత్‌ చేరువవుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాలతో స్నేహం దెబ్బతినకుండా భారత్‌ ఆచితూచి వ్యవహరించాలి.

Updated : 22 Oct 2023 13:36 IST

ఇజ్రాయెల్‌తో భారత్‌కు బలమైన దౌత్య సంబంధాలున్నాయి. మరోవైపు, అరబ్‌ దేశాలకూ భారత్‌ చేరువవుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాలతో స్నేహం దెబ్బతినకుండా భారత్‌ ఆచితూచి వ్యవహరించాలి.

జ్రాయెల్‌, హమాస్‌ పోరు పశ్చిమాసియానే కాకుండా యావత్‌ ప్రపంచాన్నీ తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీనివల్ల చమురు ధరలు పెరిగి ప్రపంచదేశాలను రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడిన భారత ఆర్థిక వ్యవస్థకూ ఇది నష్టదాయకమే. చమురు ధరలు పెరిగితే, ఇప్పటికే మాంద్యం అంచున ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింతగా సమస్యల సుడిగుండంలోకి జారిపోతుంది. ఇజ్రాయెల్‌, హమాస్‌ పోరు పశ్చిమాసియాలోని ఇతర దేశాలకూ పాకితే ఎదురయ్యే రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో భారత విధానకర్తలు ఇప్పటి నుంచే ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

ప్రపంచంలో మూడో అతి పెద్ద చమురు దిగుమతిదారుగా భారత్‌ నిలుస్తోంది. ఇజ్రాయెల్‌, హమాస్‌ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరిగితే ఇండియా భారీగా ఆర్థిక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. త్వరలోనే అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో పెట్రో ధరలు పెరిగితే, అది రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తుంది. చమురు ధరలు ఎగబాకితే, దేశంలో నిత్యావసర సరకుల రేట్లూ చుక్కలను తాకి సామాన్యుల జీవితాలు మరింత భారంగా మారతాయి.

ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో హమాస్‌కు ఇరాన్‌ దన్ను ఉంది. ఏది ఏమైనా పోరాటంలో కాకలు తీరిన ఇజ్రాయెల్‌పై హమాస్‌ అకస్మాత్తుగా ఎలా విరుచుకుపడిందన్నది వ్యూహ నిపుణులకూ అంతు చిక్కడం లేదు. దాని గురించి ఇజ్రాయెల్‌ సైతం లోతుగా ఆలోచించాలి. ప్రస్తుతానికి ఇజ్రాయెలీలు ఏకతాటిపైకి వచ్చినా, క్రమంగా ఆ దేశంలో రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. 2005 నుంచి గాజాలోకి సేనలను పంపకుండా సంయమనం పాటించిన ఇజ్రాయెల్‌, హమాస్‌ దాడితో సైనిక దండయాత్రకు దిగింది. ఫలితంగా పోరు మరింత ప్రజ్వరిల్లుతోంది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపక మానదు. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ల మధ్య సన్నిహిత సంబంధాలను నెలకొల్పడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుతం విఘాతం కలుగుతుంది. సౌదీ-ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య ఇప్పట్లో కుదరకపోవచ్చు.

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య పోరు ఉద్ధృతమవుతున్న కొద్దీ అరబ్‌ దేశాలలో ప్రజాగ్రహం పెల్లుబికి అక్కడి ప్రభుత్వాలపైనే కాకుండా మిగతా ప్రపంచంపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశ భద్రతకూ సవాలు విసరుతున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులు పరస్పరం సహకరించుకుంటున్నారు. భారత్‌పై గురిపెట్టిన ఉగ్రమూకలు ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి నుంచి పాఠాలు నేర్చుకొని ఇండియాపై ప్రయోగించే ప్రమాదం ఉంది. అందువల్ల భారత్‌ అప్రమత్తంగా ఉండాలి. ఉగ్రవాదంపై పోరుకు కొత్త వ్యూహాలను అనుసరించాలి.

ఇజ్రాయెల్‌తో ఆర్థికంగా ఇండియాకు బలమైన సంబంధాలున్నాయి. ఇజ్రాయెల్‌ నేడు ఆసియాలో భారత్‌కు మూడో అతి పెద్ద, అంతర్జాతీయంగా పదో వాణిజ్య భాగస్వామి. రక్షణ, ఔషధ, ఐటీ, టెలీకమ్యూనికేషన్లు, వ్యవసాయ రంగాల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి చెందింది. భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌కు రత్నాలు, లోహాలు, రసాయన ఉత్పత్తులు, వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. ఇజ్రాయెల్‌ నుంచి డ్రోన్లు, క్షిపణులు తదితర ఆయుధాలతో పాటు, ముత్యాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ఇండియా ఒకవైపు ఇజ్రాయెల్‌తో సైనిక, ఆర్థిక బంధాలను బలపరచుకుంటూనే- సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లకు దగ్గరవుతోంది. హమాస్‌ దాడి అనంతరం పశ్చిమాసియాలో ఇండియా ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌, సౌదీల మధ్య సమతూకం పాటించాలి. గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక కార్యకలాపాలు పశ్చిమాసియా అరబ్బుల్లో టెల్‌ అవీవ్‌పై తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా దౌత్యపరమైన నేర్పరితనాన్ని ప్రదర్శించాలి.

చంద్రకళా చౌధరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.