ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపడదాం!

వాతావరణ మార్పుల కారణంగా అనేక దేశాలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాయి.  ఈ తరుణంలో భారత్‌ అప్రమత్తం కావాలి. వాననీటిని ఒడిసిపట్టి, జలాశయాల్లో నీటి మట్టాల పెంపునకు గట్టి కృషి చేయాలి.

Published : 07 May 2024 00:33 IST

వాతావరణ మార్పుల కారణంగా అనేక దేశాలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నాయి.  ఈ తరుణంలో భారత్‌ అప్రమత్తం కావాలి. వాననీటిని ఒడిసిపట్టి, జలాశయాల్లో నీటి మట్టాల పెంపునకు గట్టి కృషి చేయాలి.

ల్‌ నినో పరిస్థితులవల్ల ఆసియాలోని అధిక దేశాలు రోజుల తరబడి వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా వాతావరణ శాఖలతో పాటు మన దేశానికి చెందిన ‘స్కైమెట్‌’ సంస్థ కూడా చల్లని కబురు చెప్పింది. ఎల్‌ నినో ప్రభావం తగ్గుముఖం పడుతోందని... పసిఫిక్‌ మహాసముద్రంలో పరిస్థితులు మారుతున్నందువల్ల మే నెలాఖరు, జూన్‌లో ఆసియా చల్లబడే అవకాశముందని అవి వెల్లడించాయి. భారత్‌లో ఈసారి నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగాలు అంచనా వేశాయి.

ఆవిరవుతున్న నిల్వలు

దేశంలో ప్రధానమైన 150 జలాశయాల్లో ప్రస్తుత నిల్వలు పదేళ్ల సగటు కంటే దారుణంగా పడిపోయాయి. వీటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 17,900 కోట్ల ఘనపు మీటర్లు. ప్రస్తుతం కేవలం 5,040 కోట్ల ఘనపు మీటర్ల మేరకే జలాలున్నాయి. 5,330 కోట్ల ఘనపు మీటర్ల నిల్వ సామర్థ్యమున్న దక్షిణాది రిజర్వాయర్లలో కేవలం 15శాతం జలాలే ఉన్నాయి. నిరుడు ఇదే సమయానికి అవి 29శాతం నిల్వలతో కనీసం తాగునీటికైనా భరోసా ఇవ్వగలిగాయి. గతేడాది జూన్‌లో సాధారణంగా, ఆగస్టు డిసెంబరు మాసాల్లో భారీగా వానలు కురిశాయి. ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. అంత నీరొచ్చినా ఏడాది తిరక్కముందే జలాశయాలు అడుగంటి నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి సాధారణ వర్షాలే కురుస్తాయన్న అంచనాలు వెలువడుతున్నాయి కాబట్టి, ప్రభుత్వాలు ఇప్పటినుంచే అప్రమత్తం కావాలి. ప్రతి వాన చినుకును ఒడిసిపట్టుకోవడాన్ని ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తమ బాధ్యతగా భావించాలి. పూర్తిస్థాయిలో జలాశయాలు నిండుతున్నప్పటికీ, అధిక వేడిమివల్ల నీరు వేగంగా ఆవిరవుతోంది. పైగా లీకేజీ నష్టాలు, విద్యుదుత్పత్తి, పరిశ్రమల కోసం నీటి వినియోగం పెరుగుతోంది. ప్రాజెక్టుల గేట్లు, కట్టలు దెబ్బతినడంవల్లా చాలా నీరు సముద్రంపాలవుతోంది. ఏటా రబీ పంటకు చివరి తడి అందించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ చిన్న నీటిపారుదల వ్యవస్థలను బలోపేతం చేయాలి.దేశంలో సుమారు వెయ్యి ఆనకట్టలు వచ్చే ఏడాది వందేళ్లు పూర్తి చేసుకోబోతున్నాయి. వాటిని రక్షించుకోవడం అత్యావశ్యకం. ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంకు నిధులతో 2012 నుంచి ‘జలాశయ పునరావాస, అభివృద్ధి కార్యక్రమం(డ్రిప్‌)’ అమలవుతోంది. ఎంపిక చేసిన రాష్ట్రాలు, ప్రాజెక్టుల్లో ఈ పనులు చేపడుతున్నారు. దీని కింద ఆంధ్రప్రదేశ్‌లో 31, తెలంగాణలో 29 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వేల సంఖ్యలో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పటిష్ఠీకరించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో కడెం, మూసీ, పులిచింతల ప్రాజెక్టుల గేట్లకు మరమ్మతులు చేపట్టి నీటి లీకేజీని అరికట్టడం తక్షణావసరం. ఆంధ్రప్రదేశ్‌లో 46 చిన్నతరహా ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధమైనప్పటికీ, ఏళ్ల తరబడి పునాది రాళ్లూ పడటంలేదు. కనీసం చెక్‌డ్యామ్‌లనైనా నిర్మించి స్థానికంగా భూగర్భ జలమట్టాలను పెంచుకోవాలి. కొట్టుకుపోయిన అన్నమయ్య జలాశయం కట్టను పటిష్ఠీకరించాలి.

జల రక్షణ వ్యూహాలతో...

ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం అంతకంతకు తగ్గుతుంటే... విద్యుదుత్పత్తి, సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు వాటిపై ఆధారపడటం పెరుగుతోంది. ఒకప్పుడు హైదరాబాద్‌ నీటి అవసరాలను హిమాయత్‌సాగర్‌, మంజీరా తదితర స్థానిక వనరులు తీర్చేవి. అనంతరం నాగార్జునసాగర్‌ నుంచి, ఇప్పుడు గోదావరిపైనున్న ప్రాజెక్టుల నుంచి నీటిని తరలిస్తున్నారు. స్థానిక జల వనరులను ఎండబెట్టి, ధ్వంసం చేసి అవసరాలన్నింటికీ జలాశయాలపై ఆధారపడటం తగని పని. కాబట్టి స్థానిక నీటి వనరులను పునరుద్ధరించుకోవాలి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక జల రక్షణ వ్యూహాలతోనే మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నీటి ఎద్దడిని అధిగమించగలం. లేకుంటే ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినా కరవురక్కసికి చిక్కడం ఖాయం!

బండపల్లి స్టాలిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.