భద్రంగా విద్యుత్‌ వినియోగం

విద్యుత్‌ వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, నాసిరకం ఉపకరణాలను వినియోగించడం, ఏమరుపాటుగా ఉండటంవల్ల నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుదాఘాతాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి ఘటనల్లో చాలామంది గాయపడుతున్నారు. కొందరు శాశ్వత వైకల్యానికి గురైతే, మరికొంతమంది కన్నుమూస్తున్నారు!

Published : 07 May 2024 00:32 IST

నేడు విద్యుత్‌ లేనిదే రోజు గడవని పరిస్థితులు నెలకొన్నాయి. కరెంటు వినియోగం పట్ల సరైన అవగాహన లేకపోవడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

విద్యుత్‌ వినియోగంపై సరైన అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, నాసిరకం ఉపకరణాలను వినియోగించడం, ఏమరుపాటుగా ఉండటంవల్ల నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుదాఘాతాలు సంభవిస్తున్నాయి. ఇటువంటి ఘటనల్లో చాలామంది గాయపడుతున్నారు. కొందరు శాశ్వత వైకల్యానికి గురైతే, మరికొంతమంది కన్నుమూస్తున్నారు!

జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం, భారత్‌లో 2022లో విద్యుత్‌ ప్రమాదాలవల్ల 12,971 మంది మృతిచెందారు. ఆ ఏడాది అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 2,048 విద్యుదాఘాతాలు, మహారాష్ట్రలో 1,448, ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,441 ఘటనలు చోటుచేసుకున్నాయి. తమిళనాడులో 970, ఆంధ్రప్రదేశ్‌లో 829, తెలంగాణలో 676 విద్యుదాఘాతాలు నమోదయ్యాయి. ఇటువంటి ప్రమాద మృతుల్లో ఎక్కువమంది కుటుంబాన్ని పోషించేవారు, మధ్య వయస్కులే ఉండటం బాధాకరం. భవనాల్లో విద్యుత్‌ వైరింగ్‌ పనులను నిపుణులైన ఎలెక్ట్రీషియన్లతోనే చేయించాలి. కరెంటు స్తంభం నుంచి అతుకుల్లేని సర్వీసు వైర్‌ను నేరుగా మీటరుకు అనుసంధానించాలి. దానికి సపోర్టుగా ఉండే జీఐ తీగను ఇంటి గోడ వద్ద పింగాణీ ఇన్సులేటర్‌కు కట్టాలి. మీటరు వద్ద కూడా తప్పనిసరిగా ఎర్త్‌ పిట్‌, ఎర్త్‌ లీకేజీ సర్క్యూట్‌ బ్రేకర్‌ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. మోటార్లు, ఏసీలు, గీజర్లు,  కుక్కర్లు, మిక్సీలు, ఇస్త్రీ పెట్టె, వాషింగ్‌ మెషీన్‌ లాంటి ఉపకరణాలను మూడు పిన్నుల ప్లగ్‌తో మాత్రమే వాడాలి. చాలామంది అనేక రకాల ఉపకరణాలను ఒకే ప్లగ్‌ దగ్గర పెడుతుంటారు. దాంతో సామర్థ్యం సరిపోక వైర్లు వేడెక్కి కాలిపోతాయి. పిల్లలు స్విచ్‌ బోర్డుల వద్దకు, ఆరుబయట కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరకు వెళ్ళకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి వినియోగించడం చాలా ప్రమాదకరం. ఇంట్లో వైరింగ్‌ చేయించి పాతికేళ్లు పూర్తయితే నిపుణులతో తనిఖీ చేయించుకుని లోపాలను సరిచేసుకోవాలి. సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పేవారు ఎర్త్‌ పిట్‌లను అమర్చుకోవడం తప్పనిసరి. ఎలెక్ట్రిక్‌ వాహనాలకు ఛార్జింగ్‌ పెట్టే విషయంలోనూ జాగరూకత అవసరం. రైతులు నాణ్యమైన, ఐఎస్‌ఐ ప్రమాణాలతో కూడిన మోటార్లు, స్టార్టర్లనే వినియోగించాలి. నీరు చొరబడని ప్లాస్టిక్‌ స్టార్టర్‌ బాక్సులను వినియోగించాలి. కరెంటు సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్‌లో లోపం తలెత్తినప్పుడు సంబంధిత సిబ్బందికి తెలపాలి.స్వయంగా మరమ్మతులు చేపట్టకూడదు. పొలాల్లో విద్యుత్‌ స్తంభాల నుంచి తీగలు కిందకు వేలాడకుండా చూసుకోవాలి.  విద్యుత్తు తీగలకు కొండీలు తగిలించి అనధికారికంగా విద్యుత్తును వినియోగించడం ప్రమాదాలకు దారితీస్తుంది. కేంద్ర విద్యుత్‌ ప్రాధికారిక సంస్థ నివేదిక ప్రకారం 2021-22లో దేశంలో 13,855 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లతో ముడివడినవే ఎక్కువ. సిబ్బంది నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంవల్ల అవి సంభవించినట్లు తేలింది.

ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యుదాఘాతానికి గురైతే, సమీపంలో ఉన్నవారు ముందుగా విద్యుత్‌ సరఫరాను నిలిపేయాలి. బాధితుడిని పొడి కర్రతో లైన్‌ నుంచి తప్పించి ప్రాథమిక సపర్యలు చేయాలి. తీవ్రతను బట్టి అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించాలి. విద్యుత్‌ సంస్థలకు సంబంధించిన లైన్ల కారణంగా ఎవరైనా మరణిస్తే రూ.5లక్షలు, అంగ వైకల్యానికి గురైతే నష్టపరిహారం చెల్లిస్తారు. జంతువులు మరణిస్తే వాటి యజమానులకు రూ.50వేల వరకు అందిస్తున్నారు. ఉపరితల విద్యుత్‌ లైన్లకు బదులు భూగర్భ కేబుళ్లను వినియోగించడం చాలా శ్రేయస్కరం. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, వారణాసి వంటి నగరాల్లో కొంతవరకు ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్న నాసిరకం విద్యుత్‌ పరికరాలను ఉత్పత్తి జరిగేచోటే అడ్డుకోవాలి. కరెంటు పనులపై ఎక్కువమంది యువతకు శిక్షణ ఇవ్వాలి. విద్యుత్‌ ప్రమాదాలు, నివారణపై అందరికీ అవగాహన అవసరం. కాబట్టి ప్రభుత్వాలు, విద్యుత్‌ సంస్థలు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇటువంటి బహుముఖ చర్యలతోనే విద్యుత్‌ వినియోగం భద్రంగా సాగిపోతుంది.

ఇనుగుర్తి శ్రీనివాసాచారి (విద్యుత్‌, ఇంధన రంగ నిపుణులు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.