సైబర్‌ నేరాల జోరు

తెలంగాణ రాష్ట్రంలో సైబర్‌ నేరాలు అంతకంతకు పెచ్చుమీరుతున్నాయి. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ నేరాలు ఇప్పుడు గ్రామాల్లోనూ చోటుచేసుకుంటున్నాయి. సైబర్‌ మోసాలను కట్టడి చేసేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

Published : 09 May 2024 02:06 IST

తెలంగాణ రాష్ట్రంలో సైబర్‌ నేరాలు అంతకంతకు పెచ్చుమీరుతున్నాయి. నిన్న మొన్నటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఈ నేరాలు ఇప్పుడు గ్రామాల్లోనూ చోటుచేసుకుంటున్నాయి. సైబర్‌ మోసాలను కట్టడి చేసేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలి.

తెలంగాణలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి ఎనిమిదో తేదీ మధ్య సైబర్‌ నేరాలవల్ల రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వాటికి సంబంధించి 11 వేలకు పైగా ఫిర్యాదులు అందాయని తెలంగాణ రాష్ట్ర సైబర్‌ భద్రతా మండలి ఇటీవల వెల్లడించింది. సైబర్‌ మోసాల్లో ఎక్కువగా ఉద్యోగాలు, ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులు, గృహిణుల నుంచి డబ్బులు కాజేసేవే ఉంటున్నాయి. ఖరీదైన మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరకే అమ్ముతామంటూ ఓఎల్‌ఎక్స్‌ వంటి వేదికల్లో ఫొటోలు పెడుతున్నారు. వాటికి స్పందించిన వారి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. కొందరు విద్యార్థులు, చిరుద్యోగులు సైతం ఇటువంటి మోసాలకు పాల్పడుతుండటం విస్తుగొలుపుతోంది.

ఖమ్మంలో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులకు వల విసిరాడు. రూ.70వేలు కడితే కొలువు ఖాయమంటూ నమ్మించాడు. అడ్వాన్సుగా రూ.35వేలు ఇవ్వాలని, తొలి జీతం అందుకున్నాక మిగతా డబ్బులు చెల్లించాలంటూ నమ్మబలికాడు. చాలామంది యువకుల నుంచి డబ్బులు వసూలుచేసి ఉడాయించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి మోసాలకు చిక్కి ఎంతోమంది గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు వంటివారు చిన్నచిన్న మొత్తాలను పోగొట్టుకుంటున్నారు. వాటిలో చాలామటుకు పోలీసుల దృష్టికి రావడంలేదు. సైబర్‌ మోసగాళ్లు... మీ ఫోన్‌ నంబరుకు లక్కీ డ్రాలో లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశం వచ్చిందని, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలుకుతూ ప్రాసెసింగ్‌ రుసుములు, హ్యాండ్లింగ్‌ ఛార్జీలు, గిఫ్ట్‌ టాక్సుల పేరిట దఫదఫాలుగా లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. రాష్ట్రంలో సైబర్‌ నేరగాళ్లు ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా దోచుకుంటున్నారని డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారి ఆమధ్య వెల్లడించారు. ఇవన్నీ పోలీసుల దాకా వచ్చినవి మాత్రమేనని, వాస్తవంలో ఆ నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన విశ్లేషించారు.

కొంతకాలంగా సైబర్‌ నేరగాళ్లు చిన్న నగరాలు, పట్టణాల్లో కొత్త మార్గాల్లో దోపిడికి తెర తీశారు. సెల్‌ఫోన్‌ టవర్లను మీ ఇంటిపై ఏర్పాటు చేసుకుంటే నెలనెలా అద్దె వస్తుందంటూ నకిలీ అద్దె పత్రాలు సృష్టిస్తున్నారు. తరవాత ప్రాసెసింగ్‌ రుసుములు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఛార్జీల పేరిట వేల రూపాయలు దండుకుని మొహం చాటేస్తున్నారు. ఇదే తరహాలో ఖరీదైన కార్లు, బైకులు చవగ్గా విక్రయిస్తామని నమ్మిస్తున్నారు. భర్తలకు తెలియకుండా చాలామంది గృహిణులు ఇలాంటి మోసాలకు గురవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 10, 20వేల రూపాయలు పోగొట్టుకున్నవారు పోలీసులకు ఫిర్యాదుచేసి, ఠాణాల చుట్టూ తిరగలేరన్న భావనతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

సైబర్‌ మోసాలను నిరోధించేందుకు తెలంగాణ రాష్ట్ర సైబర్‌ భద్రతా మండలి (టీఎస్‌సీఎస్‌బీ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, సిద్దిపేట, మెదక్‌, రామగుండంలో సైబర్‌ సెక్యూరిటీ పోలీస్‌స్టేషన్‌ (సీసీపీ)లను ఏర్పాటు చేసింది. ప్రతి సీసీపీకి ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. వీటితోపాటు ప్రతి జిల్లాలోనూ ‘డిస్ట్రిక్ట్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (డీఫోర్‌సీ)’లను నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఇవి ప్రారంభమయ్యాయి. డీఫోర్‌సీలు, సీసీపీలు సమన్వయంతో పనిచేస్తాయి. హైదరాబాద్‌లో ఉన్న టీఎస్‌సీఎస్‌బీ ప్రధాన కార్యాలయం వీటిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. లక్ష రూపాయల వరకు నష్టపోయినట్లు వచ్చిన ఫిర్యాదులను సీసీపీలు నమోదు చేసుకుని కేసులను సంబంధిత ఠాణాలకు పంపడమే కాకుండా, వాటిని ఛేదించడంలో సహకారం అందిస్తాయి. మరోవైపు సైబర్‌ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

పోలీసులకు సైబర్‌ నేరగాళ్లు చిక్కినప్పటికీ, సొమ్మును రికవరీ చేయడం చాలా కష్టమవుతోంది. దోచుకున్న సొమ్మును అప్పటికే వారు ఖర్చుపెట్టేస్తున్నారు. దాంతో నేరగాళ్లకు శిక్ష పడుతుందేగాని, బాధితులకు తిరిగి వచ్చే సొమ్ము మాత్రం చాలా తక్కువగానే ఉంటోంది. కాబట్టి సైబర్‌ నేరాలు ఎలా జరుగుతున్నాయనే దానిపై అందరికీ అవగాహన అవసరం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు స్పందించకూడదు. ఆకర్షణీయమైన ఆఫర్లు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చనే ప్రలోభాలకు లొంగకూడదు. ఫోన్లకు వచ్చే అపరిచిత లింకులను తెరవకుండా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించడమూ ఎంతో ముఖ్యం.

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.