పుడమి తల్లి గుండెపై కర్బన కుంపట్లు

మానవ చర్యల వల్ల కర్బన ఉద్గారాలు అంతకంతకు పెరుగుతున్నాయి. పర్యవసానంగా వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దానివల్ల వడగాడ్పులు, తుపానులు, కరవులు విరుచుకుపడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు పెరగడానికి మానవ చర్యలే కారణమని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.

Published : 10 May 2024 00:20 IST

మానవ చర్యల వల్ల కర్బన ఉద్గారాలు అంతకంతకు పెరుగుతున్నాయి. పర్యవసానంగా వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దానివల్ల వడగాడ్పులు, తుపానులు, కరవులు విరుచుకుపడుతున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలు పెరగడానికి మానవ చర్యలే కారణమని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అడవుల నరికివేత, పారిశ్రామిక కార్యకలాపాలు, పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనాల వినియోగం పెరుగుతుండటంతో పెద్దయెత్తున కాలుష్యం వాతావరణంలోకి విడుదల అవుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి పెద్దసంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలను కట్టడి చేయకపోతే మానవాళితోపాటు జీవజాతుల మనుగడకు పెనుముప్పు తప్పదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆ దిశగా సరైన ప్రయత్నాలు కొరవడుతున్నాయి.

దారుణ వైఫల్యం

చైనా, భారత్‌ వంటి దేశాల్లో ప్రస్తుతం మండుతున్న ఎండలు, వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు బ్రెజిల్‌లో గడచిన 150 ఏళ్లలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. భూగోళంపై ఒకే సమయంలో తలెత్తిన ఈ విపత్తులు భవిష్యత్తులో ఎదురయ్యే కఠిన పరిస్థితులకు సంకేతాలని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉంటున్నాయి, వాటిని తగ్గించడానికి ఏ దేశం ఎంతమేర ప్రయత్నిస్తోందనే గణాంకాలను ఐరాస పర్యావరణ సంస్థ (యూఎన్‌ఈపీ) 2010 నుంచి పక్కాగా సేకరిస్తోంది. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను రెండు డిగ్రీల మేర తగ్గించే ప్రయత్నాలకు ఈ గణాంకాలు కీలకమవుతున్నాయి. థర్మల్‌ విద్యుత్కేంద్రాలు, వాహనాలు, పరిశ్రమలు వంటి వాటి నుంచి ఏటా భారీగా కార్బన్‌ డయాక్సైడ్‌ గాలిలో కలుస్తోంది. దానివల్ల ఉష్ణతాపం పెరిగి వడగాలులు, కరవులు, వరదలు తలెత్తుతున్నాయి. వీటిని అదుపులో ఉంచేందుకు కృషి జరగాలంటూ పారిస్‌ వాతావరణ సదస్సులో ప్రపంచ దేశాలన్నీ తీర్మానించాయి. వాస్తవంలో మాత్రం కార్బన్‌ డయాక్సైడ్‌ను నియంత్రించడంలో అవి దారుణంగా విఫలమవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి 510 కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువు గాలిలో కలుస్తుందని అంచనా. దేశాలన్నీ ప్రయత్నించినా అప్పటికి 190 కోట్ల టన్నుల మేర మాత్రమే సీఓ2ను తగ్గించగలుగుతాయి. కానీ, చాలా దేశాలు అందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడంలేదని జర్మనీ కేంద్రంగా పనిచేసే ‘మెర్కేటర్‌ వాతావరణ మార్పుల ప్రపంచ పరిశోధన సంస్థ’ తాజా అధ్యయన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా గాలిలోకి వెలువడుతున్న మొత్తం కర్బన ఉద్గారాల్లో 31శాతం వాటా చైనాదే. 13.6శాతం అమెరికా నుంచి, 7.6శాతం ఇండియా, 4.4శాతం రష్యా, 2.8శాతం జపాన్‌, రెండు శాతం ఇండొనేసియా నుంచి వెలువడుతున్నాయి. ప్రపంచంలో ఒక శాతానికి మించి కర్బన ఉద్గారాలను వదులుతున్న దేశాల సంఖ్య 16. వాటిలో కేవలం నాలుగే పేద దేశాలు. మిగతావన్నీ అభివృద్ధి చెందినవే. దాంతో ధనిక దేశాలు చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాలు యావత్‌ ప్రపంచానికి శాపంగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

బహుముఖ చర్యలతోనే...

పారిశ్రామికీకరణ ద్వారా ఇప్పటికే అభివృద్ధి చెందిన చైనా, అమెరికా, జర్మనీ వంటివి- కర్బన ఉద్గారాలను తగ్గించాలంటూ భారత్‌ లాంటి ఆసియా, ఆఫ్రికా దేశాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. వాటిలో నివసించే కోట్ల మందికి జీవనోపాధి లభించాలంటే పరిశ్రమలు, పట్టణాలు ఎంతో కీలకం. అయితే, వాటి విస్తరణవల్ల కార్బన్‌ డయాక్సైడ్‌ పెద్దమొత్తంలో విడుదల అవుతుంది. దాన్ని తగ్గించడానికి సౌర, పవన విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులను గణనీయంగా ఉపయోగించుకోవాలి. 2030 నాటికి మొత్తం విద్యుత్‌ అవసరాల్లో సగం సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకుంటే, కర్బన ఉద్గారాలు చాలావరకు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నాయి. అది జరిగితేనే 2070 నాటికి దేశంలో కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకువచ్చే లక్ష్యం నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. అడవులను కాపాడటం, మొక్కలను పెంచడం, ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం, ఎలెక్ట్రిక్‌ వాహన వినియోగాన్ని ప్రోత్సహించడం ఎంతో అవసరం. లేకుంటే భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు మానవాళిని మరింతగా కుంగదీస్తాయి.

మంగమూరి శ్రీనివాస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.