ముంచుతున్న నకిలీ విత్తనాలు

దేశంలో నకిలీ విత్తనాల బెడద అంతకంతకు పెరుగుతోంది. ఏటా ఏప్రిల్‌, మే మాసాల్లో వీటి విక్రయాలు గుట్టుగా సాగిపోతున్నాయి. నకిలీ విత్తనాలవల్ల అన్నదాతలతో పాటు సేద్య రంగం తీవ్రంగా నష్టపోతోంది. దేశ ఆహార భద్రతకూ ముప్పు వాటిల్లుతోంది.  

Updated : 10 May 2024 05:02 IST

దేశంలో నకిలీ విత్తనాల బెడద అంతకంతకు పెరుగుతోంది. ఏటా ఏప్రిల్‌, మే మాసాల్లో వీటి విక్రయాలు గుట్టుగా సాగిపోతున్నాయి. నకిలీ విత్తనాలవల్ల అన్నదాతలతో పాటు సేద్య రంగం తీవ్రంగా నష్టపోతోంది. దేశ ఆహార భద్రతకూ ముప్పు వాటిల్లుతోంది.

సేద్యానికి అనువైన భూములు భారత్‌లో విస్తారంగా ఉన్నాయి. ఖరీఫ్‌లో 8.30కోట్ల హెక్టార్లు, రబీలో 6.80కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. 2023లో విత్తన మార్కెట్‌ విలువ రూ.23,000 కోట్లకు చేరినట్లు జాతీయ విత్తన పరిశ్రమల సమాఖ్య చెబుతోంది. వాటి అమ్మకాలు ఏటా పది శాతం చొప్పున వృద్ధి చెందుతున్నట్లు అంచనా. ప్రపంచ విత్తన విపణిలో భారత్‌ అయిదో స్థానాన్ని ఆక్రమిస్తోంది. కానీ, నాణ్యమైన విత్తనాలు దొరకడం గగనమే అవుతోంది. దానివల్ల దేశార్థికం తీవ్రంగా నష్టపోతోందని అనేక సర్వేలు హెచ్చరిస్తున్నాయి.

దేశంలో ఊరూపేరూ లేని విత్తన బ్రాండ్లు వేలసంఖ్యలో చలామణీ అవుతున్నాయి. నిరుడు అనధికారిక విత్తన మార్కెట్‌ ద్వారా రూ.5,000 కోట్ల మేర విక్రయాలు సాగాయంటున్నారు. ప్రధాన వాణిజ్య పంటల సాగులో 60శాతం వరకు నాసిరకం, కల్తీ విత్తనాలను వినియోగిస్తున్నట్లు అంతర్జాతీయ విత్తన సమాఖ్య లోగడ వెల్లడించింది. దశాబ్దం కిందట బీటీ రకం పరిచయమైన తొలినాళ్లతో పోలిస్తే, దేశంలో నేడు పత్తి దిగుబడులు మూడో వంతు పడిపోయాయి. నిషేధిత జన్యుమార్పిడి, కల్తీ విత్తనాలే అందుకు కారణమని చెబుతున్నారు. ఈ ఏడాది దేశీయ అవసరాల కోసం 40శాతం వరకు పత్తిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని పరిశ్రమల సమాఖ్య చెబుతోంది. పత్తి అత్యధికంగా సాగయ్యే తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌, ఏపీ, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వేల మంది రైతులు నకిలీ విత్తనాలవల్ల నష్టపోతున్నారు. గులాబీ పురుగును తట్టుకొనే రకాలంటూ రూ.472 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టినట్లు ఏడేళ్ల కిందటే ‘దక్షిణాసియా బయోటెక్నాలజీ సెంటర్‌’ సర్వే వెల్లడించింది. ఇప్పుడీ చీడ ఇతర పంటలకూ వ్యాపించింది. సోయాబీన్‌ విత్తనాల్లో జన్యు స్వచ్ఛత లోపించడం తమను నట్టేట ముంచిందంటూ సుమారు 50వేల ఫిర్యాదులు అందడంతో నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రలో ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వ రంగ విత్తన సంస్థలు సైతం ఇటువంటి కేసులు ఎదుర్కోవాల్సి రావడం దారుణం. పూత, కాపు లేని మిరప... ఎదుగూబొదుగూ లేని వరి పైర్లు వేల ఎకరాల్లో పశుగ్రాసంగా మారుతున్న దృశ్యాలు తెలుగు రాష్ట్రాల్లో అనేకం! కూరగాయలు, ఆవాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు వంటి పంటల్లోనూ నకిలీ విత్తనాల బెడద ఎక్కువైనట్లు జాతీయ విత్తన సంఘం లోగడ కేంద్ర వ్యవసాయ శాఖకు నివేదించింది. గుజరాత్‌, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కల్తీ విత్తనాలు సాగవుతున్నాయి. కొందరు డీలర్లు, దుకాణదారులు అధిక కమిషన్లకు ఆశపడి వాటిని రైతులకు అంటగడుతున్నారు. వ్యవసాయానికి విత్తనమే మూలాధారం. పెట్టుబడి వ్యయంలో దీని వాటా ఏడు శాతం మించదు. హైబ్రిడ్‌ రకాలైతే భారం కొంత ఎక్కువగా ఉంటుంది. నాణ్యమైన విత్తనాలవల్ల దిగుబడి 25-30 శాతం పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నకిలీ విత్తనాలకు చీడపీడలను తట్టుకునే శక్తి ఉండదు. దానివల్ల పురుగు మందులను విచ్చలవిడిగా వాడాల్సి వస్తుంది. అది రైతులకు ఆర్థికంగా భారమవుతుంది. పైగా సాగు భూములు నిస్సారమవుతాయి.

నకిలీ విత్తనాల నుంచి సేద్య రంగాన్ని బయటపడవేసేందుకు రెండు మార్గాలున్నాయి. మొదటిది: ప్రభుత్వాలే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం. ఇది కార్యరూపం దాల్చాలంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి వంటి సంస్థలు కొత్త వంగడాల పరిశోధనలను జోరెత్తించాలి. విత్తన సంచులు, మినీ కిట్లను- ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాలు, సీడ్‌ కార్పొరేషన్లు, వ్యవసాయ శాఖల సహకారంతో పంపిణీ చేయాలి. విత్తన రంగంలో విదేశీ సాంకేతికతలు, పెట్టుబడులను ఆకర్షించాలి. ప్రైవేటు కంపెనీల నియంత్రణకు బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల తరహాలో నిఘా వ్యవస్థలను పటిష్ఠపరచాలి. అక్రమార్కులపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా పీడీ యాక్టును ప్రయోగించాలి. రెండోది: విత్తనాల ఎంపికపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి. గింజ సహజ రంగు, నిండుదనం, జన్యు స్వచ్ఛత, మొలక శాతాన్ని పరీక్షించడం, క్యూఆర్‌ కోడ్‌ వంటి సాంకేతికతలతో విత్తనాల నాణ్యతను తెలుసుకోవడం వంటి అంశాలపై వారికి శిక్షణ ఇవ్వాలి. గ్రామాల్లో రైతు ఉత్పత్తి సహకార సంఘాలను విత్తన తయారీ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే దేశంలో అన్నదాతలకు, ఆహార భద్రతకు భరోసా దక్కుతుంది.

మాడుగుల గోపయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.