పర్యావరణానికి గొడ్డలి పెట్టు

డెంగీ, మలేరియా తదితర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న క్రిమికీటకాలను నివారించడానికి ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం డీడీటీ (డైక్లోరో డైఫినిల్‌ ట్రైక్లోరోఈథేన్‌) రసాయనాన్ని ఆవిష్కరించారు. దీని వినియోగం వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తేలింది. అయితే, డీడీటీ ఉత్పత్తిని మరో అయిదేళ్లు కొనసాగించాలని భారత్‌ నిర్ణయించింది.

Published : 24 May 2024 00:29 IST

డెంగీ, మలేరియా తదితర వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్న క్రిమికీటకాలను నివారించడానికి ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం డీడీటీ (డైక్లోరో డైఫినిల్‌ ట్రైక్లోరోఈథేన్‌) రసాయనాన్ని ఆవిష్కరించారు. దీని వినియోగం వల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తేలింది. అయితే, డీడీటీ ఉత్పత్తిని మరో అయిదేళ్లు కొనసాగించాలని భారత్‌ నిర్ణయించింది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దోమలు, ఈగలు వంటి క్రిమికీటకాల వల్ల పౌరులు, సైనికుల్లో వ్యాపిస్తున్న వ్యాధులను అరికట్టడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు డీడీటీని (డైక్లోరో డైఫినిల్‌ ట్రైక్లోరోఈథేన్‌) విరివిగా ఉపయోగించాయి. 1955లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రత్యేకంగా మలేరియా నిర్మూలన కార్యక్రమం చేపట్టడంతో డీడీటీకి ప్రపంచ దేశాల్లో గిరాకీ మరింతగా పెరిగింది. దీని విస్తృత వినియోగం వల్ల అమెరికా, ఐరోపా, సోవియట్‌ యూనియన్, ఉత్తర ఆఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో మలేరియా, డెంగీ కారక మరణాలు చాలావరకు తగ్గాయి. శ్రీలంక, మలేసియా మొదలైన దేశాల్లోనూ విషజ్వరాల మరణాలు దిగివచ్చాయి. అయితే, డీడీటీలో క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయని, అవి ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని తేలడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. దాని వినియోగంపై ఆంక్షలూ ప్రారంభమయ్యాయి.

స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోమ్‌లో 1972లో జరిగిన ప్రపంచదేశాల సదస్సులో డీడీటీ వినియోగంపై లోతైన చర్చలు జరిగాయి. 2001 నాటి సదస్సులో డీడీటీ వాడకం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. డీడీటీని వినియోగించిన వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్న మనుషుల్లో నరాల బలహీనత, రోగ నిరోధకశక్తి క్షీణించడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం, మధుమేహం, హెపటైటిస్‌లు ప్రబలడాన్ని గుర్తించారు. చేపలు, పక్షులు, వణ్యప్రాణులకూ డీడీటీ ప్రమాదకరంగా మారినట్లు నిపుణులు వెల్లడించారు. స్త్రీ గర్భంలోని పిండంపైనా డీడీటీ దుష్ప్రభావాలు చూపుతుంది. డీడీటీ మూలంగా మహిళల్లో రొమ్ముక్యాన్సర్, పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ వంటివి తలెత్తే ప్రమాదముంది. అందుకే ఈ రసాయనం వినియోగాన్ని, ఉత్పత్తిని చాలా దేశాలు నిలిపివేశాయి. 1970లో నార్వే, 1972లో పశ్చిమ జర్మనీ, 1984లో యునైటెడ్‌ కింగ్‌డమ్, సింగపూర్‌లు, 1986లో దక్షిణ కొరియా డీడీటీ వినియోగాన్ని నిషేధించాయి. 2007లో చైనా డీడీటీ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ముఖ్యంగా, వ్యవసాయ రంగంలో చీడపీడల నివారిణిగా దీన్ని అస్సలు వినియోగించకూడదని పలు దేశాలు తీర్మానించాయి. స్టాక్‌హోం సదస్సు సూచనల మేరకు 2024 నాటికి డీడీటీ వినియోగాన్ని, ఉత్పత్తిని పూర్తిగా నిషేధించాలనే విషయమై వివిధ దేశాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే డీడీటీని పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్‌. దాని వినియోగాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని ఇండియా వ్యతిరేకించింది. భారత్, ఉత్తర కొరియాలు డీడీటీని వ్యవసాయేతర రంగాల్లో వాడుతూనే ఉన్నాయి.

మలేరియాతో సతమతమవుతున్న ఆఫ్రికా దేశాల్లో డీడీటీ వినియోగానికి 2006 సెప్టెంబరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు తెలిపింది. ఆఫ్రికాదేశాల్లో డీడీటీకి ఉన్న గిరాకీ మూలంగా మరో అయిదేళ్లపాటు దాని ఉత్పత్తిని కొనసాగించాలని ఇండియా ఇటీవల నిర్ణయించింది. హిందుస్థాన్‌ ఇన్సెక్టిసైడ్స్‌ లిమిటెడ్‌ సంస్థ డీడీటీ ఉత్పత్తిని చేపడుతోంది. బోట్స్‌వానా, దక్షిణాఫ్రికా, జాంబియా, మొజాంబిక్, నమీబియా, జింబాబ్వే మొదలైన దేశాలకు డీడీటీని ఇండియా ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ప్రపంచదేశాల సమావేశంలో డీడీటీ ఉత్పత్తిని మరో అయిదేళ్ల పాటు కొనసాగించాలనే నిర్ణయాన్ని తెలియజేయాలనే ఆలోచనలో ఉంది. నిజానికి భారత్‌ 2014లోనే డీడీటీ ఉత్పత్తిని నిలిపివేయాల్సి ఉన్నా, పదేళ్లు పొడిగించింది. అయితే, భవిష్యత్తులో డీడీటీ ఉత్పత్తిని భారత్‌ పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఆలోగా దానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. 2022 నవంబరులో జెనీవాలో జరిగిన సమావేశంలో డీడీటీకి ప్రత్యామ్నాయాల గురించి పరిశోధనలు జరగాలని అన్నిదేశాలూ తీర్మానించాయి. కెన్యా, మెక్సికో, వియత్నాం మొదలైన దేశాలు డీడీటీకి ప్రత్యామ్నాయాలను కనుగొని ఆశించిన ఫలితాలు సాధించాయి. మిగిలిన దేశాలూ అదే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాయి. అయితే, ఆ ప్రత్యామ్నాయాలు డీడీటీ స్థానాన్ని పూర్తిస్థాయిలో భర్తీచేయడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దాంతో, క్రిమిసంహారకంగా డీడీటీని తప్పక వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డీడీటీకి ప్రత్యామ్నాయాలపై పరిశోధనలకు పాలకులు సరైన ప్రోత్సాహం అందించాలి.

డాక్టర్‌ వి.రాజేంద్రప్రసాద్‌
(విశ్రాంత ప్రాంతీయ సంచాలకులు, ఏపీ పురపాలక శాఖ)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు