స్టెమ్ రంగంలో సూపర్‌స్టార్స్!

మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నా ‘స్టెమ్‌’ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌) వంటి రంగాల్లో ప్రాతినిధ్యం ఇంకా పెరగాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం గుర్తించింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తల గురించి సమాజంలో ఉన్న లింగ ఆధారిత అంచనాలకు స్వస్తి పలికి మహిళలు, హిజ్రాలకు మరింత అభివృద్ధి....

Published : 01 Dec 2022 21:32 IST

మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నా ‘స్టెమ్‌’ (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌) వంటి రంగాల్లో ప్రాతినిధ్యం ఇంకా పెరగాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం సైతం గుర్తించింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తల గురించి సమాజంలో ఉన్న లింగ ఆధారిత అంచనాలకు స్వస్తి పలికి మహిళలు, హిజ్రాలకు మరింత అభివృద్ధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఏటా ‘సూపర్‌స్టార్స్‌ ఆఫ్‌ స్టెమ్‌’ అవార్డులను అందిస్తోంది. ఈ క్రమంలో భారతీయ మూలాలున్న ముగ్గురు మహిళలు ఇందులో చోటు దక్కించుకున్నారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం సైన్స్‌, టెక్నాలజీ అభివృద్ధి కోసం 2017లో ఎస్‌టీఏ (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆస్ట్రేలియా) సంస్థను ఏర్పాటు చేసింది. ఆ దేశంలోనే ఇది ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇందులో లక్షకు పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఈ సంస్థ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ద్వారా జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మానవాళి ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు పరిష్కారాలను అన్వేషిస్తుంది. ఈ క్రమంలో ప్రత్యేకించి మహిళలు, హిజ్రాలను ప్రోత్సహించడానికి ఏటా 60 మందికి ‘సూపర్‌స్టార్స్‌ ఆఫ్‌ స్టెమ్‌’ అవార్డులను ఇస్తుంటుంది. వీటిని ఆ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇందులో భారతి సంతతికి చెందిన నీలిమా కడియాల, డాక్టర్‌ ఇంద్రాణి ముఖర్జీ, డాక్టర్‌ అనా బాబూరమణిలు ఉండడం విశేషం.


ఆ రంగాల్లో మహిళా సాధికారత కోసం..

హైదరాబాద్‌కు చెందిన నీలిమా కడియాల 2002లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం 2003లో ఆస్ట్రేలియా వెళ్లింది. విక్టోరియా యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ కోర్సు పూర్తి చేసింది. యూనివర్సిటీలో చేరిన మొదట్లో నీలిమ ఒక మహిళగా, సామాజికంగా పలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంది. పనిప్రదేశంలో కూడా ఆమెకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే తను ఎదుర్కొన్న పరిస్థితుల నుంచే తన లక్ష్యాన్ని ఎంచుకుంది. దాన్నుంచే వివిధ వర్గాల వారు కలిసి పని చేసే వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించింది. నీలిమ అభిరుచిని గుర్తించిన GEEQ అనే సంస్థ దానికి అంబాసిడర్‌ని చేసింది. ఈ సంస్థ మహిళా సాధికారతతో పాటు లింగ సమానత్వం కోసం కృషి చేస్తుంటుంది. గత 15 సంవత్సరాలుగా నీలిమ వివిధ సంస్థలతో కలిసి పని చేస్తోంది.  ఇందులో ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం ఛాలెంజర్‌ లిమిటెడ్‌ సంస్థలో ప్రోగ్రామ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఐటీ కమ్యూనిటీ విస్తరించడానికి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు.


ఆ రహస్యం తెలుసుకోవడానికి..

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక సాధారణ కణం సముదాయంగా మారింది. దానివల్ల భూమిపై లక్షల కొద్ది సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు ఉద్భవించాయి. ఇందుకు దారి తీసిన క్రమాన్ని తెలుసుకోవడం కోసం పరిశోధనలు చేస్తోంది భూగర్భ శాస్త్రవేత్త ఇంద్రాణీ ముఖర్జీ. ఈ క్రమంలో ఆమె వివిధ శిలాజాల ద్వారా కొన్ని బిలియన్‌ సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను పరిశోధించింది. ఆ పరిశోధనే ఆమెను ఆస్ట్రేలియా వైపు పయనించేలా చేసింది. ముఖర్జీ ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టాస్మేనియాలో పీహెచ్‌డీ చేసింది. ఒకవైపు యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తూనే ప్రజలతో మమేకమయ్యే పలు కార్యక్రమాల్లో పాల్గొనేది. ఈ క్రమంలో ఒక మహిళగా, ప్రవాసిగా ఎదురయ్యే సమస్యల గురించి ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని ఆమె చెబుతారు.


మెదడు పనితీరుపై...

భారత సంతతికి చెందిన అనా బాబురమణి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పుట్టి పెరిగింది. అనాకి మెదడు పనితీరుని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. అంతేకాదు.. ప్రశ్నలకు సమాధానాలు వెతకడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఆమె అభిరుచి. ఈ క్రమంలో ఆమె మెదడు పనితీరుపై పరిశధనలు చేస్తోంది. అలాగే గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు.. పిండం, నవజాతి శిశువుపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవడంతో పాటు వాటికి కొత్త చికిత్సలను కనుగొనడానికి పలు పరిశోధనలు చేస్తోంది. ఇందుకోసం ఆమె ఐరోపా వెళ్లి మోనాష్‌ యూనివర్సిటీతో పాటు పలు విశ్వవిద్యాలయాల్లో 10 సంవత్సరాల పాటు పరిశోధనలు చేసింది. తర్వాత తిరిగి మెల్‌బోర్న్‌ వచ్చిన తర్వాత రక్షణ రంగంలో సైంటిఫిక్‌ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. 
అనా ఒకవైపు పరిశోధనలు నిర్వహిస్తూనే కొత్తగా రీసెర్చ్‌ చేసే విద్యార్థులకు మార్గదర్శనం చేస్తుంటారు. అలాగే స్టెమ్ అందరికీ అందుబాటులోకి రావడానికి నిర్వహించే కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్