80 ఏళ్ల వయసులో.. 80 రోజుల్లో.. ప్రాణ స్నేహితుల ప్రపంచ యాత్ర!

జీవితంలో ఒక్కసారైనా ప్రపంచమంతా చుట్టిరావాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు, ఇతర పరిస్థితుల రీత్యా చాలామందికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. అయితే 80 ఏళ్ల వయసులో ఈ కోరికను తీర్చుకుంటున్నారు....

Updated : 19 Apr 2023 18:46 IST

(Photos: Instagram)

జీవితంలో ఒక్కసారైనా ప్రపంచమంతా చుట్టిరావాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలు, ఇతర పరిస్థితుల రీత్యా చాలామందికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. అయితే 80 ఏళ్ల వయసులో ఈ కోరికను తీర్చుకుంటున్నారు టెక్సాస్‌కు చెందిన ఇద్దరు బామ్మలు. ప్రాణ స్నేహితులైన వీరిద్దరూ.. కలిసి ప్రపంచంలోని వివిధ దేశాలు చుట్టిరావాలనుకున్నారు. కానీ ఇన్నేళ్లు ఆయా బాధ్యతల రీత్యా కుదరకపోవడంతో తమ టూర్‌ను వాయిదా వేస్తూ వచ్చిన వీరు.. మలి వయసులో ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఏడు ఖండాల్లోని సుమారు 18 దేశాల్ని సందర్శించిన ఈ ఇద్దరు బామ్మల వరల్డ్‌ టూర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

ఒకరు డాక్టర్‌.. మరొకరు ఫొటోగ్రాఫర్!

ఎల్లీ హ్యాంబీ, శాండీ హేజ్‌లిప్‌.. టెక్సాస్‌కు చెందిన ఈ బామ్మలిద్దరి వయసు 81 ఏళ్లు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు కూడా! వీరిలో శాండీ వృత్తిరీత్యా ఫిజీషియన్‌. ప్రస్తుతం స్ప్రింగ్‌డేల్‌ సిటీలోని ‘విండ్‌క్రెస్ట్‌ హెల్త్‌ అండ్‌ రీహ్యాబిలిటేషన్‌ సెంటర్‌’కి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతోన్న ఆమె.. తన కెరీర్‌లో పేషెంట్స్‌కి అత్యుత్తమ వైద్య సేవలందించారు. 20 ఏళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఆమె.. తల్లిగా, బామ్మగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించారు. శాండీ రచయిత్రి, వక్త కూడా! మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలపై జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగాలు కూడా చేస్తుంటారామె.

ఇక ఎల్లీ అంతర్జాతీయంగా పేరు మోసిన డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా పేరు గడించారు. ఫొటోలతోనే తన మనసులోని భావాల్ని పలికించగల ఆమె చిత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం తన ఫొటోగ్రఫీ వృత్తితో పాటు ‘జాంబియా మెడికల్‌ మిషన్‌’కి డైరెక్టర్‌గానూ సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా జులైలో రెండు వారాల పాటు జాంబియాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలందించడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం. ఈ మిషన్‌లో భాగంగా అప్పుడప్పుడూ జాంబియాను సందర్శిస్తూ.. అక్కడి చిన్నారులు, అనాథలకు వైద్య సేవలందేలా చూస్తున్నారామె. ముగ్గురు పిల్లల తల్లిగా, వాళ్ల పిల్లలకు బామ్మగా.. ఇంటి బాధ్యతలకూ ప్రాధాన్యమిస్తుంటారామె.

ఐదేళ్ల క్రితం వచ్చిన ఆలోచన!

ఎల్లీ, శాండీ.. ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నప్పటికీ సందర్భమొచ్చినప్పుడల్లా కలుసుకుంటూనే ఉంటారీ స్నేహితులు. అలా ఐదేళ్ల క్రితం కలుసుకున్న వీరికి ఓ ఆలోచన వచ్చింది. ‘80 ఏళ్ల వయసులో 80 రోజుల్లో ప్రపంచమంతా చుట్టేస్తే ఎలా ఉంటుంది?’ అని! అంతే.. ఆ క్షణమే ఓకే అనేసుకున్న వీరు.. అప్పట్నుంచి ఈ ట్రిప్‌ కోసం ప్రణాళిక వేసుకున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతల నుంచి కాస్త విరామం తీసుకొని ఈ ఏడాది జనవరి 11న తమ ప్రపంచయాత్రకు శ్రీకారం చుట్టారు. అంటార్కిటికాతో మొదలుపెట్టిన తమ ప్రయాణంలో భాగంగా.. చిలీ, అర్జెంటీనా, ఫిన్లాండ్‌, ఉత్తర ధ్రువం, రోమ్‌, లండన్‌, జాంబియా, ఈజిప్ట్‌, భారత్‌, నేపాల్‌, జపాన్‌, బాలీ, ఆస్ట్రేలియా.. వంటి దేశాల్ని సందర్శించారీ బామ్మలు. ఇలా ఇప్పటివరకు 40 రోజులు ప్రయాణించిన వీరు.. ఏడు ఖండాల్లో సుమారు 18 దేశాల్ని చుట్టేశారు. మరో 40 రోజుల్లో మరిన్ని దేశాల్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారీ గ్రానీ ఫ్రెండ్స్.

వెకేషన్‌ కాదు.. అడ్వెంచర్!

ఈ ఇద్దరు బామ్మలు తమ కళ్లతో ఆయా దేశాల్లోని అందాల్ని తిలకించడమే కాదు.. అక్కడి అందమైన ప్రదేశాల్ని కెమెరాలో బంధిస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని ‘Around The World At 80’ అనే ఇన్‌స్టా ఖాతాలో పంచుకుంటున్నారు కూడా! అంతేకాదు.. వీటితో పాటు తమ అనుభవాల్నీ క్యాప్షన్లుగా అక్షరీకరిస్తూ.. మురిసిపోతున్నారు.

‘సౌకర్యం కన్నా సాహసాలు చేయడానికే ఇష్టపడతాం. ఇప్పటి వరకు చూసిన ప్రదేశాలన్నీ మాకెంతో నచ్చాయి. అయితే అంతకంటే ఎక్కువగా ఆయా దేశాల ప్రజలు, వారి జీవనశైలి, ఆచార వ్యవహారాలు మమ్మల్ని మరింతగా ఆకట్టుకున్నాయి. ఎన్నో మధురానుభూతుల్ని మాకు అందించాయి. ఈ ప్రపంచంలో ఎంతో అద్భుతమైన, దయతో కూడిన, స్నేహపూర్వకమైన వ్యక్తులున్నారని మాకు ఈ టూర్‌ ద్వారానే అర్థమైంది. ఈ ప్రయాణంలో మా ఇద్దరికీ మరెంతోమంది స్నేహితులయ్యారు. మేం దీన్ని వెకేషన్‌లా కాకుండా ఓ సాహసోపేతమైన ప్రయాణంలా భావిస్తున్నాం..’ అంటున్నారీ ఇద్దరు గ్రానీస్‌. ఇలా వీళ్లు పోస్ట్‌ చేసిన ఫొటోలు, వీడియోలు.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ వయసులో వీళ్ల ఉత్సాహం చూసి చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఆయా దేశాల్లోని పర్యటక ప్రదేశాల అందాలకు ముగ్ధులవుతున్నారు.











Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్